- మహారాష్ట్రలో 80 లక్షల పేర్లు ఉఫ్
- లబ్ధిదారులు 2.4 కోట్ల నుంచి 1.7 కోట్లకు తగ్గింపు
- ఆర్థిక భారం తగ్గించుకునే చర్యల్లో అధికార పార్టీలు
విధాత, హైదరాబాద్:
అధికారం కోసం అడ్డమైన హామీలు ఇస్తూ ప్రజలతో ఓట్లు వేయించుకుంటున్న పార్టీలు, అధికారంలోకి రాగానే సంక్షేమ, నగదు సాయం పథకాల్లో భారీ కోత విధిస్తున్నాయి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడా అన్నీ రాష్ట్రాలు ఒకదాన్ని చూసి మరోటి పాటిస్తూ అర్హులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు వీరి పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఈ కేవైసీ పేరుతో భారీ కోత విధిస్తూ, ఖజానాలో డబ్బులు మిగుల్చుకుంటున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అదేమీ లేదని అనర్హులను మాత్రమే తొలగించి, అర్హులకు న్యాయం చేస్తున్నామని పాలక పార్టీలు సమర్థించుకుంటున్నాయి. మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయగా నిన్న బీహార్ ప్రభుత్వం ఏరివేత మొదలు పెట్టింది. తాజాగా అధికారంలోకి వచ్చిన పశ్చిమ బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం కూడా బోగస్ పేరుతో 30 లక్షల మంది పేర్లను లక్ష్మీర్ భండార్ స్కీమ్ నుంచి తొలగించింది. ఈ మూడు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది.
ప్రతి నెలా పదిహేను వందలు
మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ‘మాజీ లడ్కీ బహిన్ స్కీమ్’ అమలు చేస్తున్నది. జూన్ 2024లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద.. 21 సంవత్సరాల వయస్సు నుంచి 65 సంవత్సరాల వయస్సు కల మహిళలకు ప్రతి నెలా రూ.1,500 చొప్పున నగదు బదిలీ చేస్తారు. ప్రతి నెలా రూ.2.5 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి మాత్రమే అర్హతగా నిర్థారించారు. బోగస్ లబ్ధిదారులు, చనిపోయిన వారు, అనర్హులు ఉన్నారని ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ సేకరించాలని నిర్ణయించి గడువు ఏప్రిల్ 30వ తేదీగా ప్రకటించింది. 55 లక్షల మంది లబ్ధిదారులు ఈ కేవైసీ సమర్పించలేకపోయారు. దీనికి అదనంగా మరో 12 లక్షల మంది ఐటీ చెల్లింపుదారులుగా తేలిపోయారు. 12 లక్షల మంది ఆదాయం చెల్లింపు రికార్డుల ప్రకారం వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు దాటింది. 4.5 లక్షల మంది వయస్సు 65 సంవత్సరాలు దాటినట్లు ఈ కేవైసీలో స్పష్టమైంది. వీరే కాకుండా మరో ఐదు లక్షల మంది మహిళలు నమో షెట్కారి పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు తేలింది. ఈ కేవైసీ పుణ్యమా అని మొత్తంగా 80 లక్షల మంది అనర్హులుగా తేలింది.
ఆర్థిక భారం తగ్గించుకునేందుకే..
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉండటంతో పొదుపు చర్యల్లో భాగంగా లబ్ధిదారుల సంఖ్యను కుదించిందని ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు జయంత్ పాటిల్ విమర్శించారు. ఈ కేవైసీ పేరుతో అర్హుల పేర్లను కూడా తొలగించడం అన్యాయమన్నారు. ఈ చర్య తనకు ఆశ్చర్యమేమి కలిగించలేదని, పథకానికి చరమగీతం పాడేందుకు ఈ కేవైసీ పాట పాడుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహిన్ స్కీమ్ ప్రారంభ సమయంలో మొత్త లబ్ధిదారులు 2.48 కోట్ల మంది ఉండగా, ఆ తరువాత కొద్ది రోజులకే 2.46 కోట్లకు తగ్గించారని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియ సులే ఆరోపించారు. ఈ స్కీమ్ అమలు, లబ్ధిదారుల తొలగింపు వంటి అంశాలపై నిగ్గు తేల్చేందుకు ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాధనం సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా తెలుసుకునేందుకు ఆర్థిక నిపుణులతో స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మహారాష్ట్ర సీఎల్పీ నాయకుడు విజయ్ వాడెట్టివర్ మాట్లాడుతూ, బీజేపీ అధికారం చేపట్టిన తరువాత ఓట్లు వేసిన మహిళలను వదిలించుకుంటున్నదని ఆరోపించారు. ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదని, 80 లక్షల మంది మహిళల నుంచి వ్యతిరేకత తప్పదని ఆయన హెచ్చరించారు.
