Site icon vidhaatha

అష్టదిగ్బంధంలో అమరుల సంస్మరణ

విధాత ప్రత్యేక ప్రతినిధి: అష్టదిగ్బంధంలో, అత్యంత గడ్డుపరిస్థితుల్లో సైతం అమరుల సంస్మరణ వారాన్ని పోరాట ఉత్తేజంతో నిర్వహించేందుకు మావోయిస్టు పార్టీ సిద్ధమైంది. విప్లవ ప్రతిఘాతుక ‘కగార్’ యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులను వర్గపోరాటంలో, గెరిల్లా యుద్ధంలో సమీకరిద్దామంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ అమరుల సంస్మరణ వారాన్ని ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు పాటించాలని పిలుపు నిచ్చింది. పార్టీని, పీఎల్జీఎను, ఐక్యసంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామంటూ పార్టీ శ్రేణులు, పీఎల్జీఎ బలగాలకు, విప్లవ ప్రజానిర్మాణాలకు, ప్రజలకు కమిటీ ప్రకటించింది. నక్సల్బరి నిర్మాత చారుమజూందార్ మృతిచెందిన జూలై 28ను ఆ పార్టీ అమరుల సంస్మరణ దినంగా పాటిస్తూ వస్తోంది.

ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అమలు చేస్తున్న కగార్ అష్టదిగ్భంధానికి గురై ఆపత్కాలంలో చిక్కుకుని, పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజుతోపాటు అనేక మంది అగ్రనాయకులతోపాటు వందల సంఖ్యలో అమరులవుతున్న అత్యంత గడ్డుపరిస్థితిని సీపీఐ మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నడూ చూడని నష్టాలను అనుభవిస్తూ….ఇంటా బయట పలు సవాళ్ళను ఎదుర్కొంటున్న ఆల్లకల్లోల పరిస్థితుల్లోనూ ఆ పార్టీ కేంద్రనాయకత్వం ఆత్మస్థైర్యాన్ని ప్రకటించింది. ఆపార్టీ కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి బసరాజు అలియాస్ నంబాల కేశవరావు అమరత్వం తర్వాత ఆ పార్టీ కేంద్ర కమిటీ పేరుతో మీడియాకు విడుదల చేసిన 24 పేజీల ప్రకటనలో ఈ మేరకు పిలుపునిచ్చింది. ఈ ప్రకటనలోని కొన్ని వివరాలిలా ఉన్నాయి.

విప్లవప్రతిఘాతుక కగార్

బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్టు బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ వర్గ పార్టీల ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సంయుక్తంగా గత సంవత్సన్నరకాలంగా కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక కగార్ యుద్ధం మధ్య ఈ సారి అమరుల సంస్మరణ వారాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాదిలో 357 మంది అమరులుకాగా 36 మంది వివరాలు దొరకలేదు. అమరులైన వారిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు (బీఆర్) సహా నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు వివేక్, చలపతి, ఉదయ్,శర్మ,16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులలో శర్మ, గౌతం, మధు, రూపేష్, నీతి, కార్తిక్, చైతే, గుడ్డు,సత్యం, లోక్, పాపన్న, మధు, భాస్కర్, జగన్,అరుణ,జయ తో సహా ఇతర అనేక మందిని కోల్పొయి తీవ్ర నష్టాలు కొనసాగుతున్న సమయంలోఈ సంస్మరణ వారాన్ని నిర్వహించుకుంటున్నాం. భారత విప్లవ మహానాయకులు చారుమజుందార్, కన్హయ్ చటర్జీ అందించిన ప్రజాయుద్ధమార్గంలో సాగుతూ ఈ సంవత్సర కాలంలో 357 మంది అమరులయ్యారు.ఇందులో 136 మంది మహిళలు, 34 మంది గ్రామీణులున్నారు. అమరుల్లో బీహార్,ఝార్ఖండ్ రాష్ట్రాలలో 14 మంది, తెలంగాణలో 23 మంది, దండకారణ్యంలో 241 మంది, ఏవోబీలో 9 మంది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ జోన్లో 8 మంది, ఒరిస్సాలో 20 మంది,పశ్చిమ కనుమల్లో ఒకరు, పంజాబ్లో ఒకరు ఉన్నారు. బూటకపు ఎన్కౌంటర్లలో 80 మంది, చుట్టివేత దాడుల్లో 269 మంది ఉన్నారు. ఇందులో 23 మంది జిల్లా కమిటీ, 83 మంది ఏసీ, 138 మంది పార్టీ, 17 మంది పీఎల్జీఎ, ఆరుగురు ప్రజానిర్మాణాలకు చెందినవారున్నారు.

ఎత్తుగడల అమలులో విఫలం

కగార్ ఆపరేషన్లో పార్టీ నష్టపోవడానికి ప్రధాన కారణం మన బలగాల రహస్య పని విధానం, గెరిల్లాయుద్ధ నియమాలు, కేంద్ర కమిటీ రూపొందించిన ఎత్తుగడలను సరిగా అమలు చేయకపోవడంలో ఉందని తేల్చారు. గెరిల్లా యుద్ధం గాలిలాగా వీచే, నీరులా ప్రవహించే ఎత్తుగడల ప్రకారం సాగుతుందన్నారు. నిరంతరం కదలికలో ఉండడమని అర్ధం.2024 ఫిబ్రవరి, ఆగస్టులో కేంద్రకమిటీ, పొలిట్బ్యూరో సర్యు లలర్ విడుదల చేసిందని పేర్కొన్నారు. వీటిని ఆచరించకపోవడం వల్ల తీవ్రనష్టాలపాలవుతున్నాం. పార్టీ రూపొందించిన ఎత్తుగడలను అమలుచేసి మార్చి 31, 2026కు ముందే విప్లవోద్యమాన్ని నిర్మూలించాలనే ప్రభుత్వాల దుష్టపథకాన్ని విఫలం చేద్దామని పిలుపు నిచ్చారు.

సంస్మరణ కార్యక్రమం

అమరుల సంస్మరణ సందర్భంగా అంతటా అమరుల త్యాగాలను సంస్మరించుకోవాలని, కుటుంబాలను గౌరవించాలని, వారి జీవిత చరిత్రలను ప్రచురించి, ప్రచారం చేయాలని సూచించారు. గెరిల్లాప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ వారాన్ని కగార్ యుద్ధాన్ని విఫలం చేయడానికి, ప్రజలను రాజకీయ చైతన్యం చేయడానికి, ప్రచారం, ఆందోళనలను చేపట్టే క్యాంపెయిన్ లాగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు నిచ్చింది.

Exit mobile version