రేపు ఆదివారం దేశ వ్యాప్తంగా నీట్ యూజీ రీఎగ్జామ్ జరుగబోతున్న తరుణంలో మరో వివాదం తెరపైకి రావడం సంచలనం రేపింది. మరికొన్ని గంటల్లో పరీక్ష కోసం సిద్దమైన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ విద్యార్థి.. తీరా అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకుని చూసేసరికి గుండె గుభేల్ మంది. ఎన్‌టీఏ నిర్వాహకులు అతనికి దేశంలో కాకుండా ఏకంగా విదేశాల్లో (అబుదాబిలో) పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. పరీక్షకు కేవలం ఒక్కరోజు ముందు జరిగిన ఈ ఘోర సాంకేతిక తప్పిదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఎన్‌టీఏ దిద్దుబాటు చర్యలకు దిగింది. నాగ్‌పూర్‌కు చెందిన నీట్ అభ్యర్థి అబ్దుల్లా మహ్మద్ తాలిబ్‌కు జూన్ 21 రీ-ఎగ్జామ్ కోసం యూఏఈ దేశంలోని అబుదాబిలోని పాఠశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించడంతో కుటుంబం షాక్‌కు గురైంది.
ఈ వ్యవహరం నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణలో సాంకేతిక లోపాలకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటనతో ఎన్‌టీఏ పరిపాలనా విధానం, పనితీరు మరోసారి తీవ్ర విమర్శలపాలైంది. పరీక్షకు కేవలం కొద్ది గంటల ముందే జరిగిన ఈ విచిత్ర పరిణామం సదరు విద్యార్థిని, అతని కుటుంబాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. నిజానికి అంతకుముందు జరిగిన మొదటి పరీక్షలో ఈ విద్యార్థి నాగపూర్‌లోనే పరీక్ష రాశాడు.
అబ్దుల్లా తన నీట్ అప్లికేషన్ ఫారమ్ నింపే సమయంలో తన స్థానిక ప్రాధాన్యతలుగా నాగపూర్, వార్ధా, భండారా ప్రాంతాలను ఎగ్జామ్ సెంటర్లుగా ఎంచుకున్నాడు. కానీ, ఎన్‌టీఏ మాత్రం వీటన్నింటినీ పక్కనబెట్టి, అతని సొంత ఊరికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబిలో సెంటర్ కేటాయించింది.
అబుదాబీ పరీక్ష కేంద్రం కేటాయింపుపై విద్యార్థి తండ్రి మహ్మద్ తాలిబ్ మీడియాతో మాట్లాడారు. తాము ఎలాంటి విదేశీ కేంద్రాన్ని ఎంపిక చేయలేదని, అడ్మిట్ కార్డు చూసిన తర్వాతే విషయం తెలిసిందని వెల్లడించారు. అది చూసి షాక్ కు గురయ్యామని, వెంటనే హెల్ప్‌లైన్‌ను సంప్రదించగా మెయిల్ పంపాలని సూచించారని, అనంతరం తాజా అడ్మిట్ కార్డు జారీ చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
విద్యార్థికి పాస్‌పోర్ట్ కూడా లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడని, నాగ్‌పూర్‌లోనే పరీక్ష కేంద్రం కేటాయించాలని విద్యార్థి కుటుంబం డిమాండ్ చేసింది. ఈ ఘటనపైస్పందించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ఇది ఓ సాంకేతిక లోపంగా పేర్కొంది. విద్యార్థికి ఎలాంటి నష్టం జరుగకుండా దగ్గరలోని సెంటర్ కెటాయిస్తామని తెలిపింది. ఈ ఘోర తప్పిదంపై మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ అనీస్ అహ్మద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌టీఏ పరీక్షా విధానాన్ని ఒక పెద్ద జోక్‌గా మార్చేసిందని ఆయన మండిపడ్డారు. విద్యార్థికి వెంటనే సవరించిన (రివైజ్డ్) అడ్మిట్ కార్డ్‌ను జారీ చేసి, ఈ తప్పును సరిదిద్దాలని డిమాండ్ చేశారు.
ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ ఎక్స్ ‘ఎక్స్’ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎన్‌టీఏ పనితీరును తప్పుపట్టారు. అసలు ఇలాంటి ఘోరమైన తప్పు ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ‘విద్యార్థి ఉన్న నగరంలోనే ఒక పరీక్షా కేంద్రాన్ని సరిగ్గా కేటాయించలేని విద్యా వ్యవస్థకు, ఇలాంటి అత్యున్నత స్థాయి పరీక్షలను నిర్వహించే హక్కు ఎక్కడిది?’ అని ప్రశ్నించారు.
విద్యార్థుల, వారి తల్లిదండ్రుల సహనాన్ని ఎన్‌టీఏ పరీక్షిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవల తాను కోటాలో విద్యార్థులను కలిసి వారి బాధలను పంచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత విద్యా వ్యవస్థ యువతను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని విమర్శిస్తూ.. ‘ఇది నిజమైన విద్యా వ్యవస్థ కాదు, ఇది ఒక తరానికి చెందిన డబ్బును, సమయాన్ని, మానసిక ప్రశాంతతను నిలువునా దోపిడీ చేసిందన్నారు.
పిల్లల భవిష్యత్తుతో జూదం ఆడటం ఇకనైనా ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. దేశంలోని విద్యార్థులకు బాధ్యతాయుతమైన, సమాధానం చెప్పే విద్యా వ్యవస్థ, పరీక్షా యంత్రాంగం అవసరమని ఇందుకోసం తాము పోరాడి తీరుతామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
నీట్ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం
🔸 నాగ్‌పూర్‌కు చెందిన నీట్ అభ్యర్థి అబ్దుల్లా మహ్మద్ తాలిబ్‌కు జూన్ 21 రీ-ఎగ్జామ్ కోసం అబుదాబిలోని పాఠశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించడంతో కుటుంబం షాక్‌కు గురైంది.
🔸 తాము ఎలాంటి విదేశీ కేంద్రాన్ని ఎంపిక చేయలేదని, అడ్మిట్ కార్డు చూసిన… pic.twitter.com/ERPDWCCZNh
— ముచ్చట్లు (@muchatlu_) June 20, 2026
