ప్రధాని.. ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం

18వ లోక్‌సభ తొలి సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, విపక్ష ఇండియా కూటమి నేతలకు మధ్య మాటల యుద్దం కొనసాగింది.

  • Publish Date - June 24, 2024 / 04:32 PM IST

ఎమర్జన్సీ పునరావృతం కావద్దన్న ప్రధాని
ఎమర్జన్సీ పేరుతో ఎంతకాలం పాలన సాగిస్తారన్న ఖర్గే
ప్రధాని, హోంమంత్రి రాజ్యంగంపై దాడి చేస్తున్నారన్న రాహుల్‌గాంధీ

విధాత, హైదరాబాద్ : 18వ లోక్‌సభ తొలి సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, విపక్ష ఇండియా కూటమి నేతలకు మధ్య మాటల యుద్దం కొనసాగింది. సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పార్లమెంటరీ చరిత్రలో ఇదో అద్భుతమైన రోజు అంటూ కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలికారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారం మన కొత్త పార్లమెంట్ భవనంలో జరగనుందన్నారు.

ఈ శుభ సమయాన కొత్తగా ఎన్నికైన సభ్యుల కు స్వాగతాభినందనలు తెలియజేశారు. ప్రజలు మా విధానాలను విశ్వసించారని, దేశానికి మూడోసారి సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారని చెప్పుకొచ్చారు. సరికొత్త విశ్వాసంతో నేడు కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నామని, రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నామని, సభ్యులందరినీ కలుపుకొని 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారు.

ఎమర్జెన్సీ ఓ మచ్చ

దేశంలో ఎమర్జన్సీ విధించి రేపటికి 50 ఏళ్లు పూర్తవుతాయని, దేశ ప్రజాస్వామ్య చర్రితలో ఎమర్జెన్సీ ఓ మచ్చలా మిగిలిపోయిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 50ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదని మోదీ అన్నారు. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలకు చురకలంటించారు. “ఈ దేశానికి మంచి, బాధ్యతాయుతమైన విపక్షం అవసరమని, ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా, సామాన్య పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నడుచుకుంటాయని ఆశిస్తున్నానని, డ్రామాలు, ఆటంకాలను ప్రజలు కోరుకోవట్లేదని, నినాదాలు ఆశించట్లేదని. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలి” అని ప్రధాని హితవు పలికారు.

ఎంతకాలం ఎమర్జన్సీ పేరుతో పాలన సాగిస్తారు : ఖర్గే

ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ చీకటి పాలనపై చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే తిప్పికొట్టారు.ఖర్గే మీడియాతో మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రధాని నిరంతరం ప్రస్తావిస్తూనే ఉంటారన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించిన అనంతరం ప్రభుత్వం దానిని అమలుచేసిందన్నారు. కాని బీజేపీ పాలనలో ప్రధాని మోదీ ఎమర్జెన్సీని ప్రకటించకుండానే దానిని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇలాంటి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఆయన ఎంతకాలం అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తారు? అని ఖర్గే ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు, అందుకే ఇవాళ అన్ని పార్టీల నాయకులు ముందుకొచ్చి నిరసన చేపడుతున్నారని అన్నారు.కాషాయ పాలకులు అన్ని ప్రజాస్వామ్య నియమ, నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని తాము మోదీని కోరుతున్నామని ఖర్గే చెప్పారు.

దేశ రాజ్యంగంపై మోదీ, షా దాడి: రాహుల్‌గాంధీ

దేశ రాజ్యాంగంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దాడికి పాల్ప‌డుతున్న‌ట్లు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. జ‌వాబు ఇవ్వ‌కుండా ప్ర‌ధాని మోదీని ప్ర‌తిప‌క్షాలు త‌ప్పించుకోనివ్వ‌జాలవని స్పష్టం చేశారు. రాజ్యాంగం పుస్త‌క కాపీల‌ను చేతుల్లో ప‌ట్టుకున్న ఇండియా కూట‌మి నేత‌లు లోక్‌స‌భ‌కు మార్చ్ చేశారు. ఈ సందర్భంగా పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో రాహుల్ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం పై దాడిని ఆమోదించ‌బోమ‌న్నారు. త‌మ సందేశం ప్ర‌జ‌ల‌కు చేరుతోంద‌ని, భార‌త రాజ్యాంగాన్ని ఏ శ‌క్తి కూడా తాక‌లేద‌ని, దాన్ని తాము ప‌రిర‌క్షించ‌నున్న‌ట్లు రాహుల్ తెలిపారు.

ట్విటర్ వేదికగా కూడా రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మాన‌సికంగా బ‌ల‌హీనంగా ఉన్న ప్ర‌ధాని మోదీ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌క్షించుకునే ప‌నిలో ప‌డిన‌ట్లు ఎక్స్ అకౌంట్‌లో రాహుల్ ఆరోపించారు. ఎన్డీఏ ప్ర‌భుత్వం తొలి 15 రోజుల్లో అనేక ర‌కాల దారుణ సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్లు చెప్పారు. భ‌యాన‌క రైలు ప్ర‌మాదం, క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల దాడి, రైళ్ల‌లో ప్ర‌యాణికుల ఇబ్బందులు, నీట్ స్కామ్‌, నీట్ పీజీ ర‌ద్దు, యూజీసీ నెట్ పేప‌ర్ లీకేజీ, పాలు, ప‌ప్పుదినుసులు, పెట్రోల్‌, టోల్ ధ‌ర‌లు పెర‌గ‌డం, అడ‌వులు అంటుకోవ‌డం, నీటి సంక్షోభం లాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్లు రాహుల్ తెలిపారు.

ట్విటర్‌లోనూ పరస్పర విమర్శలు

18వ లోక్‌సభ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు బయట, ట్విటర్ వేదికగా ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య మాటల యుద్దం వాడివేడిగా సాగింది. లోక్‌సభ సమావేశాలను పురస్కరించుకుని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలను సభకు సాదరంగా ఆహ్వానించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా సభ్యులకు సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. సమన్వయంతో సభను నడుపుదామని ఆకాంక్షించారు. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ “చెప్పే పదాల కంటే చేసే పనులే గట్టిగా మాట్లాడుతాయి మాటల్లో కాదు.. చేతల్లో చూపించండి మినిస్టర్” అంటూ జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు.

దానిపై రిజిజు స్పందిస్తూ.. “తప్పకుండా రమేశ్ మీరొక తెలివైన వ్యక్తి మీరు సానుకూలంగా మీ సేవలు అందిస్తే.. ఈ సభకు మీరొక విలువైన ఆస్తిగా మారతారని రిప్లై ఇచ్చారు. పార్లమెంటరీ డెమోక్రసీలో పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయని,. దేశానికి సేవలు అందించే విషయంలో మనమంతా ఒక దగ్గరకు చేరామని, ఈ పార్లమెంటరీ సంప్రదాయాలను కొనసాగించే విషయంలో మీ సహకారం అందుతుందని ఆశిస్తున్నాం” అని బదులిచ్చారు. రిజిజు కౌంటర్‌పై ప్రతిస్పందించిన జైరాం రమేశ్ “ధ్యాంక్యూ రిజిజు. నా ఇంటిలిజెన్స్‌కు మీరు ఇచ్చిన సర్టిఫికేట్ ఎన్టీయే తరహాది కాదనుకుంటున్నా దానికేం గ్రేస్ మార్కులు కలపలేదుగా…?” అని నీట్ పరీక్ష వివాదాన్ని ఉద్ధేశిస్తూ ఎద్దేవా చేశారు.

Latest News