Operation Mahadev | న్యూఢిల్లీ : ఇటీవల పహల్గాంలో 26 మంది ప్రాణాలను బలిగొని పరారైన ఉగ్రవాదులలో ముగ్గురిని భద్రతా బలగాలు సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో అంతమొందించినట్లుగా సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్‌షా, అబూ తల్హా హతమయ్యారని తెలుస్తుంది. పహల్గాం ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల కోసం జరిగిన సెర్చింగ్ ఆపరేషన్ లో భాగంగా శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలకు ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుపడగా ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మృతి చెందిన ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులని, లష్కరే తయిబాకు చెందినవారని సమాచారం. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చినార్ కోర్ వెల్లడించింది. వీరు పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులని ప్రచారం జరుగుతోంది. దీనిపై చినార్ కోర్ విభాగం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మృతదేహాలను పరిశీలించిన తర్వాతే వారి వివరాలు తెలుస్తాయని సమాచారం. సంఘటన స్థలంలో ఉగ్రవాదుల ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ గైడ్ ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం అక్కడినుంచి పరారైన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మర వేట సాగిస్తున్నాయి. లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిలో ఒక్కొక్కరి తలపై రూ.20లక్షల వరకు రివార్డును ఇప్పటికే ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రవాదులను అంతమొందించేందుకు భద్రతా బలగాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.