PM Modi | కాంగ్రెస్‌ మీ ఆస్తులు గుంజుకుంటుంది

వారసత్వ ఆస్తిపై పన్ను విషయంలో కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

  • Publish Date - April 25, 2024 / 09:50 AM IST

చనిపోయిన తర్వాత పన్ను భారం వేస్తుంది
ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణ
తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న పిట్రోడా
అతి సంపన్నుల గురించి చేసిన వ్యాఖ్యలు
మధ్యతరగతికి వర్తింపజేసిన ప్రధాని

న్యూఢిల్లీ : వారసత్వ ఆస్తిపై పన్ను విషయంలో కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్యామ్‌ పిట్రోడా శతకోటీశ్వరుల సంపద గురించి మాట్లాడితే.. మధ్యతరగతి వర్గాల ఆస్తులు కూడా కాంగ్రెస్‌ లాగేసుకుంటుందని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు వాళ్లు వారసత్వ సంపద పన్ను విధిస్తారట. మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను మీ పిల్లలకు ఇవ్వకుండా అడ్డుకుంటారట’ అని ఆరోపించారు. ‘మీరు బతికి ఉన్నంతకాలం కాంగ్రెస్‌ పార్టీ మీపై భారీగా పన్నులు వేస్తూనే ఉంటుంది. మీరు చనిపోయిన తర్వాత కూడా వారసత్వ పన్ను భారం వేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడంపై ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ శ్యాం పిట్రోడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘55శాతం ఆస్తులు తీసేసుకుంటారని ఎవరు చెప్పారు? ఇండియాలోనూ ఇలా చేయాలని ఎవరన్నారు? బీజేపీ, మీడియా ఎందుకు అల్లకల్లోలం అవుతున్నాయి? వారసత్వ ఆస్తి పన్నుపై అమెరికాలో నేను వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో గురించి ప్రధాని మోదీ చెబుతున్న అబద్ధాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే గోడీ మీడియా వక్రీకరించడం దురదృష్టకరం. మంగళసూత్రాలు, బంగారం లాక్కుంటారని మోదీ అసంబంధ వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని పిట్రోడా పేర్కొన్నారు. ‘అమెరికాలో వారసత్వ పన్ను గురించి ఒక ఉదాహరణగా మాత్రమే నేను టీవీ చర్చల్లో చెప్పాను. వాస్తవాలను నేను చెప్పకూడదా? ప్రజలు ఇటువంటి కొన్ని విషయాలు చర్చించాలని నేను చెప్పాను. దానితో రాజకీయాలకు, కాంగ్రెస్‌ పార్టీకి సంబంధం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

మంగళసూత్రాలు లాక్కుంటారని మోదీ చేసిన వ్యాఖ్యపై ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా స్పందిస్తూ.. పేద ప్రజలను దోచి, సంపన్నులకు ఇవ్వాలన్నదే ప్రధాని ప్రయత్నమని అన్నారు. ‘అమెరికాలో వారసత్వ సంపదపై పన్ను ఉన్నది. ఎవరైనా వంద మిలియన్ల ఆస్తి (సుమారు 833 కోట్ల రూపాయలు) కలిగి ఉంటే.. ఆయన చనిపోయిన పక్షంలో అందులో 45 శాతం మాత్రమే ఆయన పిల్లలకు వెళుతుంది. మిగిలిన 55 శాతం ఆస్తి ప్రభుత్వం తీసుకుంటుంది. అదొక ఆసక్తికర చట్టం. దానర్థం.. మీ తరంలో సంపాదించిన ఆస్తిలో మీ మరణానంతరం సగభాగం ప్రజలకు వదలాలి. అది సరైనది అనిపిస్తున్నది’ అని చెప్పారు.

భారతదేశంలో ఇలాంటిది లేదు. ఇక్కడ ఎవరికైనా పది బిలియన్‌ డాలర్ల ఆస్తి (సుమారు 83వేల కోట్ల రూపాయలు) ఉంటే.. ఆ మొత్తం వారి పిల్లలకు వెళ్లిపోతుంది. ప్రజలకు ఏమీ వెళ్లదు. ఇటువంటి అంశాలను ప్రజలు చర్చించాలి. సంపదను పునఃపంపకం చేయడం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కొత్త విధానాలు, కొత్త కార్యక్రమాల గురించి మనం మాట్లాడుతాం. అవి పేదలకు మేలు చేసేవి అయి ఉంటాయి కానీ.. అతి సంపన్నులకు మేలు చేసేవి కాదు’ అని ఆయన అన్నారు.

ఈ ఇంటర్యూ అనంతరం దీనిపై వివాదాన్ని లేవదీసిన బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా ఎక్స్‌లో స్పందిస్తూ ప్రజలు పన్ను కట్టి సంపాదించుకున్న ఆస్తులను గుంజుకోవాలని కాంగ్రెస్‌ అనుకుంటున్నదంటూ వక్రీకరణలు మొదలు పెట్టారు. మీరు సంపాదించిన ఆస్తిలో 55శాతం మీ మరణానంతరం తీసేసుకుంటామని గాంధీ, వాధ్రా కుటుంబాలకు సన్నిహితుడైన శ్యాంపిట్రోడా ద్వారా కాంగ్రెస్‌ చెప్పదల్చుకున్నది’ అని పేర్కొన్నారు. ‘మీరు రైతు అయితే మీ భూమిలో 55శాతం గుంజుకుంటారు.

మీరు వ్యాపారులు అయితే.. మీ వ్యాపారాల్లో 55శాతం గుంజుకుంటారు. మీ పిల్లల కోసం మీరు పొదుపు చేసిన డబ్బులో 55శాతం తీసేసుకుంటారు. వాస్తవానికి తమ పిల్లలు, అల్లుడికి గాంధీ కుటుంబం భారీగా ఖజానాను తయారు చేసి ఉంచింది. కానీ.. వాళ్లు మీరు పన్ను కట్టి కష్టపడి సంపాదించిన సొమ్మును గుంజుకోవాలని చూస్తున్నారు’ అని పూనావాలా అన్నారు. తాజాగా ప్రధాని సైతం పిట్రోడా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఇదే తరహా విమర్శలు గుప్పించారు.

Latest News