Site icon vidhaatha

Droupadi Murmu | కోల్‌కతా అఘాయిత్యంపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu : కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రెయినీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. కోల్‌కతాలో విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసనలు తెలుపుతున్నారని, నేరస్థులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూతుళ్లు, అక్కాచెల్లెళ్లపై ఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదని అన్నారు. సమాజానికి ‘నిజాయితీ, నిష్పాక్షికమైన ఆత్మపరిశీలన’ అవసరమని చెప్పారు.

కాగా కోల్‌కతాలో ట్రెయినీ డాక్టర్‌పై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఘటనను నిరసిస్తూ తాజాగా బీజేపీ చేపట్టిన బెంగాల్ బంద్‌ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దాంతో బంద్‌పై సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌ను అప్రతిష్టపాలు చేయడమే ఈ బంద్‌ ఉద్దేశమని, ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జరిగిన అత్యాచారం-హత్య కేసు దర్యాప్తును నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని మమత ఆరోపించారు. కోల్‌కతాలో ఏర్పాటు చేసిన టీఎంసీ విద్యార్థి సంఘం ర్యాలీలో మమత మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటే డాక్టర్ హత్య కేసులో నిందితులకు 7 రోజుల్లో మరణశిక్ష విధించి ఉండేదని మమత చెప్పారు. ఇప్పటికైనా నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఉద్యమం చేపడతామని ఆమె అన్నారు. వారం రోజుల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పిలిచి 10 రోజుల్లోగా రేపిస్టులకు మరణశిక్ష విధించేలా బిల్లును ఆమోదిస్తామని ప్రకటించారు. ఈ బిల్లును గవర్నర్‌కు పంపుతామని, ఆయన ఆమోదించకుంటే రాజ్‌భవన్‌ బయట నిరసనలు చేపడుతామని హెచ్చరించారు.

Exit mobile version