ఆమ్ ఆద్మీ పార్టీలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభలో పార్టీ ఉప నేతగా రాఘవ్ ఛద్దాను తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి రాఘవ్ ఛద్దా ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు భారీ స్థాయిలో ఊరట లభించిన నెల రోజుల వ్యవధిలోనే రాఘవ్ ఛద్దాను పక్కనపెట్టడం విశేషం. దీనిపై తీవ్ర స్థాయిలోనే స్పందించిన ఛద్దా.. శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఆప్ నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. దీనికి పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయన్న చర్చలు ఢిల్లీ రాజకీయవర్గాల్లో జోరందుకున్నాయి.
రాజ్యసభ కొత్త ఉప నేతగా అశోక్ మిట్టల్ పేరును ప్రతిపాదిస్తూ గురువారం పార్టీ నాయకత్వం రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ సమర్పించింది. అందులో రాఘవ్ ఛద్దా స్థానంలో మిట్టల్‌ను నియమిస్తున్నట్టు కూడా పేర్కొనలేదు. నేరుగా మిట్టల్ నియామకాన్ని తెలియజేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఛద్దా విషయంలో పెద్ద తుఫానే రేగనుందనే అభిప్రాయాలను ఆప్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 2012లో ఆప్‌లో చేరిన ఛద్దా.. 2022 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ ముఖ్యనేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కానీ.. త్వరలో జరిగే పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఆయన పేరు లేకపోవడం గమనార్హం.
నిజానికి తాజా పరిణామం వెనుక సుదీర్ఘ నేపథ్యమే ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి సంబంధించిన అనేక అంశాల్లో చాలా కాలంగా ఛద్దా మౌనంగా ఉంటున్న అంశాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా ఆయన కనిపించకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ఛద్దాను తప్పించడం వెనుక ప్రత్యేక కారణాలేమీ లేవని పార్టీ సీనియర్లు చెబుతున్నప్పటికీ.. సమయం కోసం పార్టీ వేచి చూసిందని అంటున్నారు. అయితే.. ఈ సమయంలో నిర్ణయం తీసుకోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేసిందని అంటున్నారు. కేజ్రీవాల్‌తోపాటు మనీశ్ సిసోడియాను ఎక్సయిజ్ పాలసీ కేసు నుంచి తప్పించిన సమయంలో నిర్వహించిన భారీ ప్రదర్శనతోపాటు.. కీలక సందర్భాల్లో ఛద్దా అందుబాటు లేరని గుర్తు చేస్తున్నారు. అప్పటి నుంచీ క్రమంగా దూరం పెరుగుతూ వచ్చిందని సమాచారం. కేజ్రీవాల్ సైతం తనకు మద్దతు పలికిన ఆప్ నేతలు, వారి కుటుంబాలకు ధన్యవాదాలు చెప్పే సమయంలో ఛద్దా పేరును ప్రస్తావించలేదు.
చర్చల్లో ఉన్న అంశాలివే..
- కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో కూడా ఛద్దా అందుబాటులో లేరు.
- కంటి చికిత్స నిమిత్తం లండన్‌లో ఉన్నారు.
- 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైతం ఆయన అంటీముట్టనట్టే వ్యవహరించారన్న అభిప్రాయాలను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలేమీ ఛద్దాపై లేవు.
- కానీ.. గత నాలుగేళ్లలో ఆయన వ్యవహార శైలిని గమనిస్తే ఈ నిర్ణయం తమకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
- ఛద్దాను ఇప్పటికిప్పుడు ఆప్ నుంచి బహిష్కరించే ఆలోచనలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
- ‘ఆయన నిర్ణయం తీసుకునేంత వరకూ’ ఆప్‌కు ఉన్న పది మంది రాజ్యసభ సభ్యుల్లో ఒకరిగా కొనసాగుతారని అంటున్నారు.
పంజాబ్ ప్రభుత్వంలో జోక్యం?
‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ మూవ్‌మెంట్’లో అప్పట్లో యువ వృత్తి నిపుణులు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. అందులో భాగంగా పనిచేసిన ఛద్దా.. నిపుణుడైన చార్టెడ్ అక్కౌంటెంట్. తర్వాతి కాలంలో ఆప్‌లో ఆయన వేగంగా నాయకత్వ స్థానాలకు ఎదిగారు. ఢిల్లీ బడ్జెట్ల రూపకల్పనలో కీలక పాత్ర మొదలుకుని.. 9 మంది సభ్యులతో కూడిన ఆప్ అత్యున్న నిర్ణాయక విభాగం పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో సభ్యుడిగా పార్టీ నాయకత్వానికి సలహాలు సూచనలు అందించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేసిన ఛద్దా.. ఆ ఎన్నికల్లో పరాజయాన్ని చవి చూశారు. మరుసటి సంవత్సరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా పదవీకాలం పూర్తికాకముందే పార్టీ ఆయనను 2022 మార్చిలో రాజ్యసభకు పంపింది. ఆ తర్వాతి కాలంలో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా సహా పలువురు కీలక మంత్రులపై అభియోగాల నమోదు, విచారణ, అరెస్టుల పర్వం సాగింది. ఈ కాలంలో పంజాబ్‌లోని భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు రాజ్యసభలో తన ప్రతిష్ఠను పెంచుకునే దిశగా ఛద్దా ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే ముంబై ఎయిర్ పోర్టులో మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫ్‌ను ఛద్దా తన ఎక్స్ పోస్టులో ప్రశంసలతో ముంచెత్తారు.
ఛద్దాను తొలగించిన విషయాన్ని కొత్తగా ఆ బాధ్యతలు చేపట్టిన మిట్టల్ తేలిగ్గా తీసుకున్నారు. గతంలో ఆ బాధ్యతల్లో ఎన్‌డీ గుప్తా ఉన్నారని, తర్వాత ఛద్దా.. తదుపరి తాను ఆ స్థానంలోకి వచ్చామని చెప్పారు. రేపు మరొకరు ఆ స్థానంలోకి రావచ్చని అన్నారు. అందరు ఎంపీలు నేర్చుకోవాలనే ఉద్దేశంలోనే పార్టీ ఉందని చెప్పారు. అందుకే తనకు ఈ పాత్ర అందించారని భావిస్తున్నట్టు తెలిపారు.
Read Also |
బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు !
Amba’s Revenge : తెలుగులో తొలి ఏఐ సినిమా “అంబ’s రివెంజ్”
Ravi Varma’s Yashoda and Krishna Art : రాజా రవివర్మ చిత్రానికి రూ. 167.2కోట్లు !
