Haryana polls । ఆప్‌తో పొత్తును హర్యానా కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది ఇందుకే!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచిస్తుంటే.. మరోవైపు హర్యానా కాంగ్రెస్ నేతలు మాత్రం పొత్తును వ్యతిరేకిస్తున్నారు.

Haryana polls । లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ (Congress) పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. ఆ మేరకు బీజేపీని నిలువరించగలిగాయి. అదే సెంటిమెంట్‌ను ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించాలనే తలంపుతో కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉన్నట్టు చెబుతున్నారు. ఒక విధంగా రాహుల్ ఆదేశాలతోనే హర్యానాలో ఆప్‌తో సీట్ల సర్దుబాటు చర్చలను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రారంభించిందని సమాచారం. అయితే రెండు పార్టీలూ తమ పొత్తు (alliance) లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha) మాత్రమే పరిమితమని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అందుకు భిన్నమైనవని చెబుతుండటం విశేషం.
ఆప్‌తో పొత్తును రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గట్టిగా వ్యతిరేకిస్తున్నదని సమాచారం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా(Bhupinder Singh Hooda)తోపాటు.. ఆయనకు పార్టీలోనే ప్రత్యర్థిగా భావించే కుమారి సెల్జా (Kumari Selja) సైతం ఆప్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. ఆప్ పది సీట్లు కోరుతుంటే.. తొలుత గరిష్ఠంగా ఐదు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని సమాచారం. అయితే.. సర్దుబాటు కుదరడానికి సీట్ల సంఖ్య కారణం కాదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏయే సీట్లలో ఎవరు పోటీచేయాలనే (quality of seats) అంశంపైనే పీటముడి పడిందని సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో (rural areas) తమకు గట్టి పట్టు ఉన్నదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ప్రత్యేకించి ఆప్ కోరుతున్న కొన్ని నిర్దిష్టమైన గ్రామీణ ప్రాంత సీట్లను ఇచ్చేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సుముఖంగా లేదని తెలుస్తున్నది. పట్టణ ప్రాంత (urban areas) నియోజకవర్గాల నుంచి ఆప్ పోటీచేయాలని, గ్రామీణ ప్రాంతాల కంటే అర్బన్ ఏరియాల్లోనే ఆ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆప్ తన డిమాండ్లను పక్కకు పెట్టని పక్షంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోటీకే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపుతున్నది. సీట్ల సర్దుబాటులో చర్చలు ఫలించకపోవడానికి పలు రూరల్ సీట్లను ఆప్ కోరుతుండటమే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గత లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ 9 సీట్లోల, ఆప్ ఒకే ఒక్క స్థానం కురుక్షేత్ర(Kurukshetra)లో బరిలోకి దిగాయి. హర్యానాలో ఆప్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ లాభపడిందేమీ లేదనే వాదనను అధిష్ఠానం ముందు రాష్ట్ర నాయకత్వం తెచ్చింది. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఆప్‌కు పెద్దగా పట్టులేదనేది కాంగ్రెస్ నేతల వాదన. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 9 స్థానాల్లో ఐదు సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా, ఆప్ పోటీచేసిన ఒక స్థానంలో ఓటమిపాలైంది. మిగిలిన ఐదు సీట్లను బీజేపీ గెలుచుకున్నది. వాస్తవానికి 2019 లోక్‌సభ ఎన్నికల్లో హర్యానా నుంచి కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ కూడా లేని స్థితిలో తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలిచింది. లోక్‌సభ ఎన్నికల తరహాలోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఢీ అంటే ఢీ అనేలా (direct contest) ఉంటాయని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ధీమాతో ఉన్నది.
మరోవైపు కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కనివారు ఆప్ నుంచి లేదా ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తున్నది. మరో 50 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సిన కాంగ్రెస్.. అందుకనే మలి జాబితా విడుదలకు జాప్యం చేస్తున్నదని తెలుస్తున్నది. చివరి నిమిషంలో జాబితా ప్రకటించడం ద్వారా తిరుగుబాట్లను, అసమ్మతిని కొంత వరకూ నిరోధించవచ్చనే అభిప్రాయంతో కాంగ్రెస్ ఉన్నదని సమాచారం. నామినేషన్ల (nominations) దాఖలుకు సెప్టెంబర్ 12 వరకు అవకాశం ఉన్నది. పోలింగ్ అక్టోబర్ 5 నిర్వహించనున్నారు.