Site icon vidhaatha

Rahul Gandhi | రాహుల్‌ ఉండగా కూలిన వేదిక.. తృటిలో తప్పించుకున్న కాంగ్రెస్‌ నేత

బీహార్‌ ఎన్నికల ప్రచారసభలో ఘటన

పాట్నా: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి తృటిలో ప్రమాదం తప్పించింది. సోమవారం బీహార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌.. ఒక వేదికపై ఉండగా.. అది ఒక్కసారిగా కూలిపోయింది. పాట్నా శివార్లలోని పాలిగంజ్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. పాటలిపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మీసా భారతికి మద్దతుగా ఆయన ప్రచారం చేసేందుకు వచ్చారు. రాహుల్‌ను మీసా భారతి ఆయన సీటు వద్దకు తోడ్కొని వస్తుండగా.. వేదికలో ఒక భాగం కూలిపోయింది. దీంతో రాహుల్‌ పట్టుతప్పారు.

వెంటనే మీసా భారతి ఆయన చేతిని పట్టుకుని పడిపోకుండా చూశారు. ఈ ఘటన కలవరం కలిగించినప్పటికీ.. రాహుల్‌, మీసా భారతి పరస్పరం చిరునవ్వులు చిందించుకున్నారు. వెంటనే వారి సహాయం కోసం భద్రతా సిబ్బంది వేదికపైకి చేరుకుని సహకారం అందించారు. రాహుల్‌గాంధీకి ఏమీ కాలేదని వారు సభికులను తెలియజేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కొనసాగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన రాహుల్‌గాంధీ.. భారతికి తన మద్దతు ప్రకటించారు.

Exit mobile version