Site icon vidhaatha

క‌చోరీ షాపులోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు

car

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని క‌శ్మీరీ గేట్ ఏరియాలోని ఫ‌తే క‌చోరీ షాపులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో క‌చోరీ షాపు నిండా క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. కొంద‌రు క‌చోరీ తింటుండ‌గా, మ‌రికొంద‌రు పానీ పూరి లాగించేస్తున్నారు. అదే స‌మ‌యంలో ఓ మెర్సీడిస్ ఎస్‌యూవీ కారు అదుపుత‌ప్పి క‌చోరీ షాపులోకి దూసుకొచ్చింది. దీంతో అక్క‌డున్న ఆహార ప‌దార్థాలు, టేబుల్స్ చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. క‌స్ట‌మ‌ర్లు కూడా కింద‌ప‌డిపోయారు. ఇందులో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. కారు న‌డిపిన వ్య‌క్తిని ప‌రాగ్ మెయినీ(36)గా పోలీసులు గుర్తించారు. ఇత‌ను నోయిడాకు చెందిన వ్య‌క్తి కాగా, వృత్తిరీత్యా లాయ‌ర్ అని పోలీసులు పేర్కొన్నారు. ర్యాష్ డ్రైవింగ్ కింద పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప‌రాగ్ మ‌ద్యం సేవించి న‌డిపాడా..? లేదా..? అన్న‌ది విచార‌ణ‌లో తేలుతుంద‌న్నారు. డ్రంకెన్ టెస్టుకు అత‌ని నుంచి ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించామ‌న్నారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌రాగ్ భార్య కూడా కారులో ఉన్నారు.

Exit mobile version