Site icon vidhaatha

Pahalgam attack | మాడస్‌ ఆపరెండీ మార్చేసిన ఉగ్రవాదులు!

Pahalgam attack | దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి ఎలా చొరబడ్డారు? ఎంత కాలం నుంచి లోయలో ఉంటున్నారు? అన్న విషయాల్లో స్పష్టత లేదని పోలీసులు చెబుతున్నారు. ‘ఆ విషయాలను ఇంకా బేరీజు వేస్తున్నాం. సరిహద్దుల్లో చొరబడేందుకు అవకాశాలు ఉన్న ప్రాంతాల ఆధారంగా కొంత సమాచారం ఉన్నా.. నిర్ధారణ కాలేదు. ఆ వివరాలను ఏజెన్సీలు వెరిఫై చేస్తున్నాయి. చొరబాటుకు వీలున్న ప్రాంతాలు సరిహద్దులో ఎక్కడున్నాయో తనిఖీ చేస్తున్నారు’ అని ఆయన వివరించారు. ఉగ్రవాదుల కదలికలను భద్రతా సంస్థలు ఎందుకు కనిపెట్టలేకపోయాయన్న ప్రశ్నకు.. ఉగ్రవాదుల ఆపరేషన్‌ విధానం ఇటీవలి కాలంగా పెద్ద ఎత్తున మారిపోయిందని ఆయన చెప్పారు. ‘ఉదాహరణకు మొత్తం అనంతనాగ్‌ జిల్లాలోనే ఒక్కటంటే ఒక్క స్థానిక ఉగ్రవాద ఘటన కూడా చోటు చేసుకోలేదు. కొన్ని కదలికలపై మాకు సమాచారం ఉంది కానీ.. ఇప్పుడు ఘటన జరిగిన ప్రాంతం గురించి కాదు. రైల్వేలు లేదా స్థానికేతర వర్కర్లపై దాడి జరుగుతుందని మేం భావించాం, వాటిని నిరోధించేందుకు ముందస్తు చర్యలు కూడా తీసుకున్నాం’ అని ఆయన తెలిపారు.

మైనస్‌ పది డిగ్రీల చలిలోనూ అడవులనుంచి బయటకు రారు
‘ఈ ఉగ్రవాదులు చిన్న చిన్న గ్రూపులుగా తిరుగుతుంటారు. మైనస్‌ పది డిగ్రీల ఉష్ణోతల్లో గడ్డకట్టిపోయే పరిస్థితి ఉన్నా వారు అడవుల నుంచి బయటకు రారు. వాళ్లు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ వాడని కారణంగా టెక్నికల్‌ ఇంటెలిజెన్సీకి అవకాశం లేకుండా పోయింది. వీటితోపాటు వాళ్లు ఎక్కడా స్థిరంగా ఉండరు. ఉదాహరణకు సోనార్గ్‌ దగ్గర ఉగ్రవాదులు ఉన్నారని మాకు సమాచారం అంది, మేం రెస్పాండ్‌ అయ్యేలోపే వారు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. కొద్ది రోజుల్లోనే వారు పహల్గామ్‌ ఎత్తయిన ప్రాంతాలకు ఆఖరుకు బందిపోర్‌ కూడా వెళ్లిపోతున్నారు. ఇవన్నీ అడవులతో కనెక్ట్‌ అయి ఉన్నాయి’ అని ఆ అధికారి వివరించారు. ప్రత్యేకించి పహల్గామ్‌లో పర్యాటకు రద్దీ ఎక్కువగా ఉంటుందని, అక్కడ ఒక్క పార్కింగ్‌ స్లాట్‌ కూడా లభ్యం కాదని ఆ అధికారి తెలిపారు. పర్యాటకులు తమ కుటుంబాలతో నేరుగా పహల్గామ్‌కు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోతుంటారని చెప్పారు. కొందరు పర్యాటకులు గుర్రాలను తీసుకుని చుట్టుపక్కల ప్రాంతాలకు వెళుతుంటారని చెప్పారు. ఇలాంటివారిని ట్రాక్‌ చేయడం కూడా సాధ్యం కాదని అన్నారు.

దాడిలో నలుగురైదుగురు పాకిస్తానీయులు?
పహల్గావ్‌ దాడి వెనుక ఏడుగురు ఉగ్రవాదులు ఉన్నారని దర్యాప్తులో వెల్లడైందని అధికారవర్గాలు చెబుతున్నాయి. వారిలో నలుగురు లేదా ఐదుగురు పాకిస్తానీ ఉగ్రవాదులని అధికారవర్గాలు చెబుతున్నాయి. బాడీ కెమెరాలు ధరించి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తున్నదని జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులకు ఇది సాధారణ అలవాటుగా మారిందన్నారు. గత మూడేళ్లుగా జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద దాడులన్నీ బాడీ కెమెరాలు లేదా తుపాకులకు కెమెరాలు అమర్చి జరుగుతున్నవేనని ఆయన చెప్పారు. వాటిని లష్కరే తాయిబా ఉగ్రవాదులు ప్రచారం నిమిత్తం వాడుకుంటారని అన్నారు. దాడికి పాల్పడినవారిలో ఇద్దరు స్థానిక టెర్రరిస్టులని ఇంటెలిజెన్స్‌ నివేదికలు, ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి తెలుస్తున్నది. అయితే.. దాడికిపాల్పడినవారిని ఇంకా గుర్తించలేదు. వాళ్లు (విదేశీ ఉగ్రవాదులు) మాట్లాడే ఉర్దూ.. పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాట్లాడే తరహాలో ఉన్నది. వారితో ఉన్నవారిలో కనీసం ఇద్దరు స్థానికుల్లా ఉన్నారు. ఈ ఇద్దరూ కశ్మీర్‌లోని ఏ ప్రాంతం నుంచి వచ్చారనేది ఇంకా మాకు నిర్ధారణ కాలేదు’ అని పోలీస్‌ అధికారి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు.

Exit mobile version