Gujarat | గేమ్‌జోన్‌ అగ్నిప్రమాదం ఘటనలో అధికారులపై గుజరాత్‌ హైకోర్టు ఆగ్రహం

28 మంది మరణానికి కారణమైన రాజ్‌కోట్‌ గేమ్‌ జోన్‌ అగ్నిప్రమాదంపై గుజరాత్‌ హైకోర్టు రాజ్‌కోట్ మున్సిపల్‌ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

  • Publish Date - May 27, 2024 / 05:33 PM IST

గుజరాత్‌ యంత్రాంగంపై నమ్మకం లేదు
రెండున్నరేళ్లగా మీరంతా ఏం చేస్తున్నారు?
అఫిడవిట్ల దాఖలుకు ఆదేశం

న్యూఢిల్లీ : 28 మంది మరణానికి కారణమైన రాజ్‌కోట్‌ గేమ్‌ జోన్‌ అగ్నిప్రమాదంపై గుజరాత్‌ హైకోర్టు రాజ్‌కోట్ మున్సిపల్‌ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఘటన జరిగి, అమాయక ప్రాణాలు పోయిన తర్వాతే చర్యలు తీసుకున్నదని వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర అధికార యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నది. రాజ్‌కోట్‌ టీఆర్పీ గేమ్‌ జోన్‌ అవసరమైన అనుమతులు తీసుకోలేదని మున్సిపల్‌ కార్పొరేషన్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా.. మీ పరిధిలో అంత పెద్ద నిర్మాణం జరుగుతూ ఉంటూ కళ్లు మూసుకున్నారా? అని జస్టిస్‌ బీరేన్‌ వైష్ణవ్‌, జస్టిస్‌ దేవన్‌ దేశాయి ప్రత్యేక బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

గేమ్‌ జోన్‌ ప్రారంభించిన 2021 నుంచి ఘటన జరిగిన మే 25వ తేదీ వరకూ ఉన్న రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కమిషనర్లను ఈ ఘటనకు బాధ్యులను చేయాలని పేర్కొన్నది. వారంతా వేర్వేరుగా అఫిడవిట్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. గేమ్‌ జోన్‌ ఉన్నదనే విషయం రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు తెలుసా? వారు రెండున్నరేళ్లుగా పూర్తిగా దాన్ని విస్మరించారా? అని ప్రశ్నించింది.

‘మీ పరిధిలో ఉన్న నిర్మాణాన్ని మీరు ఇప్పటి వరకూ విస్మరించారా? ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఈ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల గురించి మీకు తెలియదా? మీరంతా ఏం చేస్తున్నారు? ఈ గేమ్‌ జోన్‌ ప్రారంభ కార్యక్రమానికి అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ హాజరైనట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. దీనిని మేం పరిగణనలోకి తీసుకోవద్దా? పద్ధెనిమిది నెలలుగా కార్పొరేషన్‌ యంత్రాంగం ఏం చేసింది. దానిపై కూర్చున్నారా?’ అని బెంచ్‌ ప్రశ్నించింది. అగ్నిమాపక రక్షణ చర్యలపై కోర్టు గతంలో ఇచ్చిన ఉత్వర్వులను పాటించారా? ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌, అగ్నిమాపక రక్షణ వ్యవస్థలు తదితర అంశాలపై బెంచ్‌ వాకబుచేసింది.

Latest News