Site icon vidhaatha

Supreme Court | లైంగిక వాంఛల నియంత్రణ కేసు కొట్టివేత.. నిందితుడికి శిక్ష పునరుద్దరణ

న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పవద్దని చురకలు
Supreme Court |  కౌమర బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలంటూ వ్యాఖ్యానిస్తూ ఓ నిందితుడికి దిగువ కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ కోల్‌కత్తా హైకోర్టు (Calcutta High Court) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ కేసులో నిందితుడికి వేసిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేగాక తీర్పులో న్యాయమూర్తులు ప్రవచనాలు చెప్పరాదని చురకలేసింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ బెంగాల్‌ (Bengal)కు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ వ్యక్తి కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. గతేడాది అక్టోబరులో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు  సంచలన తీర్పు వెలువరించింది. బాలిక అతడితో ఇష్టపూర్వకంగానే సాన్నిహిత్యాన్ని కొనసాగించిందన్న కారణంతో అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఆ సందర్భంగా న్యాయస్థానం కొన్ని సూచనలు చేసింది.
“కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం చూసుకుంటే. సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలిపోతారని, కౌమర బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి” అని సూచించింది. అంతేగాక దీనిపై సుదీర్ఘ విశ్లేషణలతో తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు పట్ల అప్పట్లో పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు వ్యాఖ్యలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేసింది. వీటిపై గతంలో విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు సూచనలపై అసహనం వ్యక్తంచేసింది. న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పరాదని, చెప్పి నిందితుడికి విధించిన శిక్షను పునరుద్ధరించింది.
Exit mobile version