Site icon vidhaatha

Supreme Court | నీట్ ప్రశ్నపత్రం లీకేజీ రెండు ప్రాంతాలకే పరిమితం సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఎన్టీఏలో అనేక లోపాలు
తక్షణమే వాటిని సరిద్దుకోవాలి
ఇది విద్యార్థుల భవితకు సంబంధించిన అంశం
రాధాకృష్ణన్ కమిటీని విస్తరించాలి
పరీక్షా విధానంలో లోపాలను సరిదిద్దడానికి చర్యలపై సెప్టెంబర్‌ 30లోగా నివేదికను అందజేయాలి
అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలి
నివేదిక అందిన తర్వాత రెండు వారాల్లోగా నిర్ణయం
కేంద్రం, విద్యాశాఖలకు ధర్మాసనం ఆదేశాలు

విధాత, హైదరాబాద్ : పరీక్ష పత్రాల లీకేజీల వ్యవహారంలో అపఖ్యాతిని మూటగట్టుకున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలో లోపాలను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తి చూపింది. విద్యార్థుల భవితకు సంబంధించిన అంశం కనుక వెంటనే ఆ లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. నీట్ యూజీ 2024 పరీక్ష ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారం కేవలం జార్ఖండ్‌లోని హజారీబాగ్, బీహార్‌లోని పాట్నా వరకే పరిమితమైందని వ్యాఖ్యానించింది. ఈ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ ఇటీవల కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం, అందుకుగల కారణాలను వివరిస్తూ శుక్రవారం మళ్లీ తీర్పు వెలువరించింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని ఎన్టీయేకు సూచించింది. ఈ సమస్యను కేంద్రం ఈ ఏడాదే పరిష్కరించాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్‌టీఏదేనని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజీలో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు చోటుచేసుకోలేదని, పరీక్ష పవిత్రతను దెబ్బతీసేలా విస్తృత స్థాయిలో లీక్ జరగలేదని అన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ ఝార్ఖండ్‌లోని హజారీబాగ్, బీహార్‌లోని పాట్నా వరకే పరిమితమైందని, దానిపై దర్యాప్తు జరుగుతోందని, అందుకే పరీక్షను రద్దు చేయాలని తాము అనుకోలేదని తెలిపారు. అయితే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని, విద్యార్థుల భవితకు సంబంధించిన అంశంలో ఇలాంటివి చోటుచేసుకోవడం సరికాదని, వెంటనే లోపాలు సవరించుకోవాలని ఆదేశించింది.

ఎన్టీయే పనితీరు, పరీక్షల్లో సంస్కరణల కోసం నియమించిన ఇస్రో మాజీ చీఫ్‌ కే రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్యానెల్‌ను మరింత విస్తరించాలని పేర్కొంది. పరీక్షా విధానంలో లోపాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యలపై కమిటీ సెప్టెంబరు 30లోగా తమ నివేదికను అందజేయాలని ఆదేశించింది. పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలని సూచించింది. ఈ నివేదిక అందిన తర్వాత అందులోని అంశాలను అమలుచేసే అంశంపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, విద్యాశాఖలను దర్మాసనం ఆదేశించింది.

ఈ ఏడాది నీట్ ప్రవేశపరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్ధులు రాశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. దీంతో పేపర్ లీకేజీ, ఇతర అక్రమాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది.. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారని కోర్టు అభిప్రాయపడింది.

Exit mobile version