Train accident : ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం రాత్రి చండీగఢ్ స్టేషన్ నుంచి అస్సాంలోని దిబ్రూగఢ్‌కు బయలుదేరిన చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు యూపీలోని గోండా జిల్లాలో ప్రమాదానికి గురైంది. రైలులోని 21 బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మరణించగా చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వారిలో ముగ్గురు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైలు గురువారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే 40 మంది సభ్యులలో కూడిన వైద్య బృందం 15 అంబులెన్స్‌లతో ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులకు ప్రథమ చికిత్సలు చేసి ఆస్పత్రులకు తరలించింది.
కాగా ఈ రైలు ప్రమాదంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ రైలు ప్రమాద ఘటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బాధ్యత వహించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. అన్ని రైల్వే మార్గాల్లో కవచ్ పేరుతో యాంటీ-కొలిజన్ సిస్టమ్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు.