Aadhar Update | ఆధార్. ప్రతి ఒక్కరికి ఇదొక బేసిక్ డాక్యుమెంట్‌గా మారింది. ఓటర్ కార్డులు, మొబైల్ కనెక్షన్ల కోసం ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తున్నారని గమనించిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలెట్టింది. దేశవ్యాప్తంగా చనిపోయిన 2 కోట్ల మంది కి పైగా పేర్లు, వారి వివరాలు పూర్తిగా తన డాటాబేస్ నుంచి తొలగించింది. దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది. దేశ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఆధార్ డాటాబేస్‌లో వివరాలు తొలగించడం ఇదే తొలిసారి.
దేశంలో డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లను జల్లెడ పట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అమలు చేస్తున్న విషయం అందరికీ విదితమే. చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వలసపోయినవారి వివరాలు తొలగిస్తున్నామని చెబుతున్నది. దీనిపై వివాదాలు కూడా తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి. ఇదే తరహాలో యూఐడీఏఐ కూడా రంగంలోకి దిగింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, చౌక ధరల దుకాణాలు, సామాజిక సహాయక పథకాలు, ఆర్థిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలోని పలు విభాగాల నుంచి చనిపోయిన వారి పేర్లు, వారి వివరాలు, ఆధారాలు సేకరించారు. ఇలా సేకరించిన పేర్లను సరిపోల్చుకుని మొత్తం 2 కోట్ల మంది కి పైగా వరకు ఉన్నట్లు నిర్థారణకు వచ్చారు. ఇంకేముందు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆధార్ వెబ్ ఫోర్టల్ డేటా బేస్ నుంచి 2 కోట్ల మంది పైగా ఉన్నవారి పేర్లు, వివరాలు తీసివేశారు.
పౌరులు లేదా బంధువులు ఎవరైనా సరే తమ కుటుంబంలో చనిపోయిన వారి వివరాలు ఉంటే మై ఆధార్ వెబ్ పోర్టల్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ లేదా మండల కార్యాలయం లేదా మునిసిపల్ అధికారులు జారీ చేసిన డెత్ సర్టిఫికెట్‌ను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌ను తనిఖీ చేసిన తరువాత ఆధార్ నెంబర్ డీ యాక్టివేట్ చేస్తారు. ఒక వేళ తప్పుడు ఆధారాలతో తొలగించినా, మళ్లీ ఆధార్ వివరాలు పొందాలంటే రీ యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. అయితే దీని కోసం అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ క్లీనింగ్ లో భాగంగా ఈ ఏడాది జూలై నెలలో 1.17 కోట్ల మంది పేర్లు, వివరాలను డీ ఆక్టివేట్ చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ నెల నాటికి ఆ సంఖ్య కాస్తా 1.4 కోట్లకు పెరిగింది. తాజాగా రెండు కోట్లకు పైబడి పేర్లను తొలగించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దేశంలో డీ యాక్టివేట్ అయిన నెంబర్లను కొత్తగా ఎవరికీ కేటాయించడం లేదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. చనిపోయిన వారి ఆధార్ కార్డులను ఇతరులు ఉపయోగించుకుని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
Labour Codes Explained | నాలుగు లేబర్ కోడ్‌లను కార్మికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
IRCTC Best Package: రూ.26,960కే గుజరాత్ చుట్టి వద్దామా..
Pakistan | పాక్ మాజీ ప్రధానిని హత్య చేశారా? అసలు నిజం ఏంటంటే?
