Site icon vidhaatha

Bhupesh Singh Chaudhary | యోగి, మౌర్య విభేదాల నేపథ్యంలో మోదీని కలిసిన భూపేశ్‌ సింగ్‌ చౌదరి

న్యూఢిల్లీ: యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేశ్‌ సింగ్‌ చౌదరి బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బల అనంతరం యూపీ సీఎం ఆదిత్యనాథ్‌, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య మధ్య విభేదాలు పెరిగాయన్న వార్తలు, ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ప్రక్షాళన జరుగుందన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆయన మోదీని కలవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

రాజకీయంగా బీజేపీకి ఉత్తరప్రదేశ్‌ అత్యంత కీలకమైనది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలన ఆయన మోదీకి వివరించారని తెలుస్తున్నది. మంగళవారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను చౌదరి, మౌర్య కలిశారు. ఇటీవల ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన మౌర్య.. పార్టీ ఎల్లప్పుడూ ప్రభుత్వానికంటే పెద్దదని వ్యాఖ్యానించారు. బుధవారం తన సామాజిక మాధ్యమ ఖాతాలోనూ అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. వేదికపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా ఉండగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సంచలనం రేపింది.

మరోవైపు అతి విశ్వాసం వల్లే యూపీలో సీట్లు తగ్గాయని ముఖ్యమంత్రి చెప్పారు. యోగి, మౌర్య విభేదాల వార్తల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం అటు మౌర్యతోనూ, పార్టీ అధ్యక్షుడు చౌదరితోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఇంటిని చక్కదిద్దేపనిలో ఉన్నారని తెలుస్తున్నది. ఇదిలా ఉంటే.. యూపీ పార్టీలో భారీ ప్రక్షాళనకు బీజేపీ కేంద్ర నాయకత్వం సిద్ధమవుతున్నదనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. యూపీలో రాబోయే పది అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలపై పార్టీ పెద్దలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారని సమాచారం.

Exit mobile version