Viral Video | నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. వాటి చర్యలను చూసి నవ్వుకోవడంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఏనుగుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆకులను తినేందుకు ఆ గజరాజు ఏకంగా చెట్టనే కూలదోసింది. భారీ వృక్షాన్ని నేలకూల్చడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ప్రకారం.. ఓ భారీ చెట్టు దగ్గరకు ఏనుగు వచ్చింది. ఆకులు తినేందుకు ప్రయత్నించగా అందనంత ఎత్తులో ఉన్నాయి. ఎలాగైనా ఆ చెట్టు ఆకులు తినాల్సిందేనని పట్టుబట్టింది. తన భారీ కాయాన్ని ఉపయోగించి చెట్టును నెట్టడం ప్రారంభించింది.
కొద్దిసేపటికి సెకన్ల వ్యవధిలోనే గజరాజు బలానికి ఆ వృక్షం నేలకూలింది. ఆ తర్వాత ఎంచక్కా చెట్ల ఆకులను తినేసింది. వీడియో దక్షిణాఫ్రికాలోని మలమలగమే రిజర్వ్ ఫారెస్ట్‌లోనిది. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించగా.. మూడులక్షల దాకా లైక్స్ వచ్చాయి. వీడియోను చూసిన పలువురు ‘పెద్ద చెట్టును ఎంత సింపుల్ గా పడేసింది. ఈ వీడియో చూస్తేనే ఏనుగుల బలమేంటో తెలిసిపోతోంది’ అని కామెంట్ చేశారు. మరో యూజర్ చెట్టు పెరగాలంటే ఎన్నో ఏళ్లు పడుతుందని.. దాన్ని ఏనుగు సింపుల్‌గా కూల్చేసింది.. ఇలాగైతే అడవి నాశనం కాదా? అని మరికొందరు కామెంట్ చేశారు.
ఏనుగే కాకుండా ఇతర జంతువులు ఆ చెట్టు ఆకులు తింటాయని.. ఇది అడవుల్లో జరిగే సాధారణ విషయమేనని మరొకరు స్పందించారు. అయితే, ఏనుగులు తమ చుట్టూ వాతావరణాన్ని రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని.. చాలా మంది దీన్ని విధ్వంసమని త్వరగానే హైలెట్ చేస్తారని.. అది చిన్నచూపు కావ్వొచ్చని వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి పోస్టులో పేర్కొన్నారు. ఇవాళ మనచుట్టూ కనిపించే పొద (Bush) ఇలానే ఉంటుందని అనుకుంటామని.. కానీ, ఈ పరిస్థితి ఉండదన్నారు. ‘150 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో కొన్ని చెట్లు పుష్కలంగా కనపించేవని.. ఇప్పుడు లేవని.. ప్రస్తుతం ప్రకృతి దృశ్యంపై ఆధిపత్యం చెలాయించే ఇతర చెట్ల జాతులు అప్పటికి దాదాపుగా లేవు. మార్పు సహజం. నిజానికి ఇది అనివార్యం. కానీ, ఏనుగులు గత శతాబ్దాలలో కంటే ఇప్పుడు సంచరించడానికి చాలా తక్కువ స్థలాన్ని కలిగి ఉన్నాయని కూడా మనం గుర్తుంచుకోవాలి’ అని సూచించారు.