Site icon vidhaatha

DGMO | డీజీఎంవోలు అంటే ఎవ‌రు..? భార‌త్ – పాక్ కాల్పుల విర‌మ‌ణ‌లో వారి పాత్ర ఏంటి..?

DGMO | ఆప‌రేష‌న్ సిందూర్ (Operation Sindoor ) త‌ర్వాత భార‌త్ – పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు తెర‌ప‌డింది. డీజీఎంవో( DGMO )ల చ‌ర్చ‌ల అనంత‌రం కాల్పుల విర‌మ‌ణ‌ల‌కు భార‌త్( India ), పాకిస్తాన్( Pakistan ) దేశాలు అంగీక‌రించిన‌ట్లు భార‌త విదేశాంగ శాఖ అధికారికంగా ప్ర‌క‌టించింది. శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం( Ceasefire agreement ) అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించింది.

ఈ అంశంపై విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్రీ( vikram misri ) మాట్లాడుతూ.. శ‌నివారం మ‌ధ్యాహ్నం 3.35 గంట‌ల‌కు ఇరుదేశాల డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిల‌ట‌రీ ఆప‌రేష‌న్స్( Director-General of Military Operations ) స్థాయిలో ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. పాకిస్తాన్ డీజీఎంవో( DGMO ) భార‌త డీజీఎంవోకు ఫోన్ చేశారు. చర్చ‌ల అనంత‌రం కాల్పుల విర‌మ‌ణ‌కు ఇరు దేశాల సైనికాధికారులు అంగీక‌రించారు. సాయంత్రం 5 గంట‌ల నుంచి కాల్పుల విర‌మ‌ణ‌ అమల్లోకి వ‌చ్చింది. భూ, గ‌గ‌న‌, స‌ముద్ర‌త‌లాల నుంచి ఇరు దేశాల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ కొన‌సాగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఇరు దేశాల సైన్యాల‌కు ఆదేశాలు వెళ్లాయి. మ‌ళ్లీ 12వ తేదీన సాయంత్రం డీజీఎంవోలు చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్రీ ప్ర‌క‌టించారు.

ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌గ్గించ‌డానికి కీల‌క‌పాత్ర పోషించిన డీజీఎంవో( DGMO )లు అంటే ఎవ‌రు..? అస‌లు డీజీఎంవోల పాత్ర ఏంటి..? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం..

డీజీఎంవో అంటే..? ( What is the DGMO )

డీజీఎంవో అంటే డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిలిట‌రీ ఆప‌రేష‌న్స్. డీజీఎంవో వ్య‌వ‌స్థను సాధారణంగా సరిహద్దు సమస్యలు, ఇతర సైనిక సంబంధిత విషయాలను చర్చించడానికి ఉపయోగిస్తారు. రెండు దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న‌ప్పుడు.. ఇరు దేశాల సైనిక అధికారులు ఒకరితో ఒకరు తక్షణమే మాట్లాడవచ్చు. సరిహద్దు ఉల్లంఘనలు, కాల్పుల విరమణ ఒప్పందాల గురించి విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌ర‌పొచ్చు. అంటే భారతదేశంలో కాల్పుల విరమణ ఒప్పందాలు, సరిహద్దు ఉద్రిక్తతలు వంటి సున్నితమైన సమస్యలను డీజీఎంవో నిర్వహిస్తారు.

డీజీఎంవో పాత్ర ఏంటి..? ( What Is The Role Of DGMOs )

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ద‌ళాల‌కు డీజీఎంవో నేతృత్వం వ‌హిస్తారు. త్రివిధ ద‌ళాల ఉమ్మ‌డి కార్య‌క‌లాపాల‌కు, ఇత‌ర దేశాల‌కు అనుసంధాన క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దులో సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడం, కాల్పుల విరమణ ఒప్పందాలు, భద్రతా సమస్యలను పరిష్కరించడం వంటి వాటిల్లో డీజీఎంవో కీల‌క‌పాత్ర పోషిస్తారు. ఈ క్ర‌మంలోనే భార‌త్ – పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌తలు త‌గ్గించ‌డానికి పాకిస్తాన్ డీజీఎంవో.. భార‌త్ డీజీఎంవోను ఫోన్ లైన్‌లో సంప్ర‌దించారు. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై పాక్ డీజీఎంవో.. భార‌త డీజీఎంవోతో చ‌ర్చించారు. కాల్పుల విర‌మ‌ణ‌కు పాక్ డీజీఎంవో ప్ర‌తిపాదించారు. పాక్ ప్ర‌తిపాద‌న‌పై భార‌త డీజీఎంవో చ‌ర్చ‌లు జ‌రిపింది. ఇరు దేశాల డీజీఎంవోల చ‌ర్చ‌ల మేర‌కు, అవ‌గాహ‌న‌తో కాల్పుల విర‌మణ‌కు అంగీకారం కుదిరింది.

డీజీఎంవోల‌నే ఎందుకు మొద‌ట సంప్ర‌దిస్తారు..? ( Why Are DGMOs Usually First Contact )

ఇరు దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న‌ప్పుడు, ఆ ఉద్రిక్త‌త‌లను త‌గ్గించేందుకు మొద‌ట‌గా డీజీఎంవోల‌ను సంప్రదిస్తారు. ఎందుకంటే డీజీఎంవోలు అంద‌రూ సీనియ‌ర్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్లే ఉంటారు. వారికి స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌ల‌పై పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న ఉంటుంది. ఆర్మీ ఆప‌రేష‌న్స్‌కు సంబంధించి వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తారు. ఈ క్ర‌మంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని త‌గ్గించేందుకు ఏం చేయాలనే దానిపై త‌క్ష‌ణ చ‌ర్య‌లు ప్రారంభిస్తారు.

ఇక డీజీఎంవోలుగా లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్స్ లేదా స‌మాన అర్హ‌త క‌లిగిన వారిని నియ‌మిస్తారు. క‌మాండ‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసేందుకు డీజీఎంవోల‌కు అధికారాలు ఉంటాయి. అవ‌స‌ర‌మైతే ఉద్రిక్త‌త‌ను త‌గ్గించేందుకు స్వ‌యంగా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంటుంది. డీజీఎంవోలు ప్ర‌ధానంగా సైనిక కార్యాచ‌ర‌ణ‌పై దృష్టి సారిస్తారు.

 

Exit mobile version