న్యూఢిల్లీ : దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్ర ఎండలతో మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు అనేక చోట్ల నెలకొంటున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో గడిచిన కొద్ది రోజుల్లోనే అనేక మంది ఎండల తీవ్రత తట్టుకోలేక చనిపోయారు. ఢిల్లీ, బీహార్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ, తగ్గిపోతున్న అటవీప్రాంతాలతో ప్రత్యేకించి నగరాల్లో ఎండలు దంచి కొడుతున్నాయని, తేమ పెరుగుతున్నదని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు.. రాత్రిపూట సైతం వేడిగాలులు విశ్రమించడం లేదు. ఫలితంగా వడగాలుల తీవ్రత పెరుగుతున్నదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎండల తీవ్రతను తట్టుకోలేక పేదలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని అంటున్నారు.
అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్, పెరుగుతున్న రాత్రిపూట ఉష్ణోగ్రతలు
అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది నగరాల్లో వేడిగాలులకు కారణమవుతున్నదని, ప్రత్యేకించి రాత్రుళ్లలో చట్టుపక్కల ప్రాంతాలకంటే నగరాల్లో పలు డిగ్రీలు అధికంగా వేడి ఉంటున్నదని వాతావరణ మార్పుల వల్ల కలిగి ప్రభావాలు, దుర్బలతలపై అంచనాలు రూపొందించే వాతావరణ మార్పులపై అంతర్ మంత్రిత్వ ప్యానెల్ (ఐపీసీసీ) రెండో వర్కింగ్ గ్రూప్ పేర్కొంటున్నది. స్వాభావికమైన చెట్లు, వాటర్ బాడీస్‌వంటివాటితో పోల్చితే.. కాంక్రీటుతో నిర్మించిన కట్టడాలు, పేవ్‌మెంట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు సూర్యరశ్మిని ఎక్కవగా స్వీకరించి, తిరిగి వెదజల్లుతాయి. చెట్లు తక్కువగా ఉండి, ఇటువంటి కట్టడాలు కేంద్రీకరించి ఉండే నగరాల్లో అందుకే చుట్టుపక్కల చెట్లు ఉన్న ప్రాంతాలకంటే ఎక్కవగా అధిక ఉష్ణోగ్రతల ఐలాండ్స్‌గా మారుతాయి. దీనినే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. కట్టడాల్లో వేడి చిక్కుబడిపోతుంది కాబట్టి.. విస్తృతస్థాయిలో జరిగే పట్టణీకరణ రాత్రిపూట పెరిగే ఉష్ణోగ్రతలతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటుంది.
పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
2003 నుంచి 2020 మధ్య భారతదేశంలోని 141 నగరాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలను భువనేశ్వర్ ఐఐటీ స్కాలర్లు సౌమ్య సత్యకాంత సేథి, వి వినోజ్ విశ్లేషించారు. ప్రతి దశాబ్దానికి దాదాపు అన్ని నగరాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.52 ప్లస్ ఆర్ మైనస్ 0.19 సెల్సియస్ డిగ్రీలు పెరిగినట్టు గుర్తించారు. నేచర్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో భారతీయ నగరాల్లో వేడి పెరగడానికి పట్టణీకరణే 60శాతం కారణమైందని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతకు, రాత్రి ఉష్ణోగ్రతకు మధ్య తేడా పట్టణ ప్రాంతాల్లో కొంతకాలంగా తగ్గుతూ వస్తున్నదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్‌మెంట్ (సీఎస్‌ఈ)కి చెందిన అనుతిత రాయ్ చౌదరి, సోమ్‌వన్షి, శరణ్‌జీత్ కౌర్ నిర్వహించిన మరో అధ్యయనం కనుగొన్నది.
రాత్రి ఉష్ణోగ్రతలను, పగటి ఉష్ణోగ్రతలను పోల్చి చూస్తే.. 2001-10 మధ్య రాత్రుళ్లు 6.2 నుంచి 13.2 డిగ్రీల సెల్సియస్ మేర చల్లగా ఉన్నాయని, కానీ.. 2014-23 మధ్య కాలంలో అది 6.2 నుంచి 11.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నదని పేర్కొన్నది. ఒక్క కోల్‌కతా మినహా అన్ని నగరాల్లో రాత్రిపూట చల్లదనం తగ్గిపోయిందని తెలిపింది. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్‌తో పోరాడాలంటే.. మరిన్ని చెట్లను పెంచడం, నిర్మాణ ప్రాంతాల సాంద్రను తగ్గించడం వంటి దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని సస్టెయినబుల్ ఫ్యూచర్స్ కొలాబరేటివ్స్‌కు చెందిన ఆదిత్య వలియనాథన్ పిళ్లై చెప్పారు.
తేమ, వేడి రాత్రులతో మానవ శరీరానికి ఇదీ నష్టం
ఉష్ణోగ్రతలు, తేమ పెరగడం, రాత్రిపూట వేడి వాతావరణంతో వేసవికాలం మనుషులకు ప్రమాదకరంగా తయారవుతున్నది. ఎండాకాలంలో పట్టే చమట ద్వారా శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. ‘వేడికి స్పందిస్తూ హృదయం మన చర్మానికి మరింత రక్తాన్ని సరఫరా చేస్తుంది. దానితో చర్మ గ్రంథులు క్రియాశీలంగా మారుతాయి. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అయితే.. చమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలోని ఇతర భాగాలకు రక్త సరఫరా తగ్గుతుంది’ అని గాంధీనగర్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ దిలీప్ మావలంకర్ చెప్పారు.
తేమ పరిస్థితుల్లో శరీరానికి చమట పడుతుంది. ఫలితంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురవడమే కాకుండా.. లవణాల సమతుల్యం కూడా దెబ్బతింటుంది. మరోవైపు రక్త సరఫరా తగ్గడంతో మిగిలిన అవయవాల పనితీరు మందగిస్తుంది. శరీర వేడిని నియత్రించే వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడంతో శరీరం అతిగా వేడెక్కుతుంది. ఈ వేడి మరింతగా ఉంటే.. మెదడులోని కణ ప్రక్రియ ప్రభావితం అవుతుందని, అందుకే సొమ్మసిల్లి పడిపోవడం జరుగుతుందని, కొన్ని సీరియస్ కేసులలో గుండెపోటు, లేదా అవయవాలు పనిచేయకపోవడం వంటి తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని మావలంకర్ వివరించారు.