ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం సభా హక్కుల నోటీసు అందజేసింది. ఎన్నికైన ఎంపీల స్వాతంత్య్రం, సమగ్రతపై ప్రధాని నిందలు మోపారని విమర్శించింది. సభా హక్కులను ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అందించిన నోటీసులో కోరారు. లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించలేక వీగిపోయింది.ఆ మరుసటి రోజు.. శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే.
‘జాతిని ఉద్దేశించి ప్రసంగం పేరుతో 29 నిమిషాలపాటు మాట్లాడిన మోదీ.. బిల్లును అడ్డుకున్నారంటూ ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. అంతేకాకుండా.. ప్రతిపక్షసభ్యుల ఓటింగ్ సరళిపై వ్యాఖ్యలు చేస్తూ వారికి దురుద్దేశాలు ఆపాదించారు’ అని కేసీ వేణుగోపాల్ తన నోటీసులో తెలిపారు.
131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ప్రతిపక్షాలపై, ప్రత్యేకించి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ.. బిల్లును ఓడించడం భ్రూణహత్యతో పోల్చారు. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి తగినంత మెజార్టీని సాధించలేక పోయిన మోదీ.. అందుకు ప్రతిపక్షాలను విమర్శించేందుకు తన ప్రసంగాన్ని వాడుకోవడం మునుపెన్నడూ లేనిదని వేణుగోపాల్ తన నోటీసులో పేర్కొన్నారు. ఇది అనైతికం, విస్పష్టమైన అధికార దుర్వినియోగం’ అని స్పష్టంచేశారు. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి స్టేట్‌మెంట్స్ రావడం సభను, సభా హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే’ అని వేణుగోపాల్ పేర్కొన్నారు.
పార్లమెంటులో సభ్యులు చేసిన ప్రసంగాలకు ఉద్దేశాలు ఆపాదించడం, వారిపై ఆరోపణలు చేయడం సభనే కాదు.. సభా హక్కులను కూడా తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. బిల్లు ఆమోదం పొందాలని కోరుకున్న ప్రధాన మంత్రి.. ఆగ్రహంతో ప్రసంగిస్తూ రాజ్యాంగ రక్షణలో తమ విధులు నిర్వహిస్తున్న ఎంపీలకు దురుద్దేశాలు ఆపాదించడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ఇది సభ్యుల సమగ్రతను, వారి స్వతంత్రను అనుమానించడమేనని పేర్కొన్నారు. ప్రధాని సహా ఎవరైనా.. ఏ సభ్యుడి ప్రవర్తన లేదా ఓటింగ్‌పై వ్యాఖ్యలు చేయకూడదనేది చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయమని, అది సభ్యుడికి ఉన్న ప్రాథమిక హక్కు అని తెలిపారు. సభ్యుల ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తం చేయకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 రక్షణనిస్తున్నదని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు సభ గౌరవాన్ని, అధికారాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. సభ్యులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ బాధ్యతలను నిర్వహించడాన్ని కూడా అడ్డుకుంటాయని పేర్కొన్నారు.
Read Also |
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
Revanth Reddy | కేసీఆర్ సభ వేళ బీఆర్ఎస్ నేతల ఢిల్లీ టూర్.. సీఎం రేవంత్ ప్రకటనతో ప్రకంపనలు!
