తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ

ఏపీలోని జొన్నగిరి బంగారు గని నుంచి మే నెలలో తవ్వకాలు ప్రారంభం. దేశీయ బంగారం ఉత్పత్తికి ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.

తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ

విధాత : తెలుగు రాష్ట్రం ఏపీలోని జొన్నగిరి బంగారు గని నుంచి పసడి త్రవ్వకాలు మే నెల నుంచి ప్రారంభంకానున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో విస్తరించి ఉన్న ఈ బంగారు గని.. భారత బంగారు దిగుమతుల దిశను మార్చబోతుందన్న ఆశలు నెలకున్నాయి. జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని అభివృద్ధి చేసింది.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిగా జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాబోయే పదేళ్లలో భారత్ ఏడాదికి 50 నుండి 100 టన్నుల బంగారాన్ని స్వదేశంలోనే ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గనిలో ప్రాసెసింగ్ ప్లాంట్‌ను కేవలం 13 నెలల్లోనే పూర్తి చేయడం విశేషం.

తొలి దశలో ఏడాదికి టన్ను బంగారం

భారత్ ఏటా సుమారు 800 టన్నులకు పైగా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుడటంతో విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతోంది. ప్రస్తుతం దేశీయంగా హట్టి గోల్డ్ మైన్స్ ద్వారా కేవలం 1.5 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. 2000 సంవత్సరంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూతపడిన తర్వాత ఏర్పడిన లోటును జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ భర్తీ చేయనుందని నిపుణులు చెబుతున్నారు. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న జొన్నగిరి ప్రాజెక్ట్ ద్వారా తొలి దశలో రాబోయే 15 ఏళ్లలో ఏడాదికి 1,000 కిలోల (1 టన్ను) స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ గనిలో 13.1 టన్నుల నిల్వలు ఉన్నాయని, పరిశోధనలు కొనసాగితే ఇది 42.5 టన్నులకు చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 600కేజీల బంగారం ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

దేశీయ పసిడి రంగానికి మైలురాయి

ఏపీ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి, దేశ బంగారం అవసరాలకు జొన్నగిరి మైలురాయిగా నిలవనుంది. జొన్నగిరి ప్రాంతం కేవలం బంగారానికే కాదు, ప్రాచీన కాలం నుండి వజ్రాలకు కూడా ఎంతో ప్రసిద్ధి. మళ్లీ జొన్నగిరి గోల్డ్ మైనింగ్ తో రాయలసీమ గడ్డపై పసిడి సిరుల వెలుగులు చూడబోతున్నారు.బంగారం ధరలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెరిగిపోతున్న తరుణంలో దేశీయంగా బంగారు ఉత్పత్తి పెరగడం స్వయంసమృద్ధికి బాటలు వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే మరిన్ని ప్రైవేట్ సంస్థలు మైనింగ్ రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం తవ్వకాలకే పరిమితం కాకుండా.. స్థానిక గ్రామాల మౌలిక సదుపాయాలు,విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కృషి చేస్తుంది.

భూమిలోంచి పసిడిని దొరకపట్టేది ఇలాగే..

గోల్డ్ మైనింగ్ లో ప్రక్రియలో భాగంగా జొన్నగిరిలో ‘ఓపెన్ పిట్’ పద్ధతిలో భూమి ఉపరితలం నుండి లోతుగా గుంతలు తవ్వుకుంటూ వెళ్లి రాళ్ళను తవ్వి తీస్తారు. గనుల నుండి తీసిన పెద్ద పెద్ద రాళ్ళను క్రషింగ్ & గ్రైండింగ్ పద్దతిలో భారీ యంత్రాల ద్వారా పిండిలా మారుస్తారు. ఈ పొడిని కెమికల్స్ (ముఖ్యంగా సైనైడ్ ద్రావణం) కలిపిన నీటిలో ఉంచుతారు. ఈ రసాయనం రాళ్ళలోని బంగారాన్ని తనలో కరిగించుకుంటుంది. దీనిని ‘కార్బన్-ఇన్-లీచ్’ ప్రక్రియ అని కూడా అంటారు.ద్రావణంలో కరిగి ఉన్న బంగారాన్ని విద్యుత్ ప్రక్రియ ఎలక్ట్రోవిన్నింగ్ ద్వారా వేరు చేసి ముడి బంగారంగా మారుస్తారు. వచ్చిన ముడి బంగారాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి, అందులోని ఇతర మలినాలను స్మెల్టింగ్ & రిఫైనింగ్ ప్రక్రియ ద్వారాతొలగిస్తారు. చివరగా 99.9% స్వచ్ఛమైన గోల్డ్ బిస్కెట్లు సిద్దం చేస్తారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
కేసీఆర్ ప్రజలనే తప్పుబడుతున్నారు..బీఆర్ఎస్ మారదు: కవిత ఫైర్