కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?

ఫామ్‌హౌస్‌ను వీడి బయటకు వచ్చిన కేసీఆర్‌.. జగిత్యాల సభతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. కానీ.. దాన్ని కొనసాగించేలా ఇక నుంచైనా ఆయన క్షేత్రస్థాయిలో ఉంటారా? ఇప్పుడు అందరిలోనూ ఇదే చర్చ.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

పడిపోయిన పార్టీ గ్రాఫ్‌.. వరుస పరాజయాల నేపథ్యంలో జగిత్యాల జనగర్జన పేరుతో బీఆరెస్‌ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ.. పార్టీ శ్రేణులను కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చర్చ సాగుతున్నది. పద్నాలుగేళ్ల రాష్ట్ర ఉద్యమం, పదేళ్ల పరిపాలన అనంతరం మళ్లీ పార్టీకి జవసత్వాలు కల్పించే టార్గెట్‌తో బీఆరెస్‌ ఈ భారీ సభను ప్లాన్‌ చేసింది. దాని విజయవంతానికి సర్వశక్తులు ఒడ్డింది. బీఆరెస్‌కు ఉన్న ఏకైక ‘అస్త్రం’ కేసీఆర్‌ సుదీర్ఘకాలం తర్వాత బయటకు వచ్చి.. సీఎంపై నిప్పులు చెరగడం పార్టీ శ్రేణులను యాక్టివేట్‌ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కేవలం పార్టీ ముఖ్యనేతలకు అందుబాటులో ఉంటూ ఫాం హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ చాలా కాలం పాటు పార్టీ శ్రేణులకు, ప్రజలకు దూరంగా ఉంటున్న లోటు ఆయన ఉపన్యాసంలో స్పష్టంగా కనిపించిందనే వాదనలూ వినిపిస్తున్నాయి. మొత్తం మీద రాబట్టిన కొద్దిపాటి ఉత్సాహాన్ని నిలబెట్టేందుకు ఇప్పటి నుంచైనా కేసీఆర్‌ ప్రజా క్షేత్రంలో ఉంటారా? లేదా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

జీవన్ రెడ్డి చేరిక పేరుతో నిర్వహించిన సభకు కేసీఆర్ రావడమే కాకుండా ఆయన వద్ద, బీఆర్ఎస్ దగ్గర ఉన్న తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని సైతం మరోసారి ప్రయోగించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పరిస్థితులతో పాటు ఆతర్వాత ఉద్యమకాలంలో చేసిన ప్రయత్నాలన్నింటిని ఏకరువుపెడుతూ తెలంగాణ సెంటిమెంటును కొత్తగా పండించేందుకు ప్రయత్నించారు. జనం గుండెల్లో దారుణ సంఘటనలుగా ముద్రపడిన వాటిని గుర్తుచేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయనే చర్చలు సాగుతున్నాయి.

గత సంఘటనలను నెమరు వేసిన కేసీఆర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ సమస్యపై సాగిన పోరాటం, బషీర్ బాగ్ పోలీస్ కాల్పుల్లో ముగ్గురు అమరులైన సంఘటనను కేసీఆర్ గుర్తుచేస్తూ ఆనాటి తెలంగాణ పరిస్థితిని తాజాగా తెరపైకి తెచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరెంట్ అడిగితే చంద్రబాబు కాల్చిచంపిండంటూ గుర్తుచేశారు. అప్పటి అసెంబ్లీలో హనుమకొండ ఎమ్మెల్యే ప్రణయ్ భాస్కర్ తెలంగాణ అంటూ మాట్లాడితే సమైక్యపాలకులు అడ్డుకున్నారంటూ అప్పటి గడ్డు పరిస్థితిని వివరించారు. దీంతో పాటు పాలమూరు జిల్లా, మెట్పల్లి, జగిత్యాల ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పల్లెలు వలసవెళ్ళిన పరిస్థితులను, తిండికి కూడా నోచుకోలేని పరిస్థితిల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించే విధంగా గంజికేంద్రాలు పెట్టారంటూ అనాటి దు:ఖ చరిత్రను వల్లెవేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పల్లెపల్లె పిట్టలెక్క తిరిగిన అంశాలను వివరించారు. ఇదే క్రమంలో ఉద్యోగులకు అన్యాయం చేసే జీవో పై యుద్ధం చేశామని, ఆఖరున తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో… అనే నినాదంతో చావు నోట్లో తలకాయపెడితే కేంద్రం దిగివచ్చి తెలంగాణకు అనుకూల ప్రకటన చేసిన అంశాన్ని నొక్కి చెప్పారు.  పనిలో పనిగా తాను ప్రారంభించిన పథకాలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో చెబుతూ రేవంత్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ‘జగిత్యాల సభకు తాను వస్తున్నానని మరో ఎకరానికి రైతు భరోసా ఇస్తున్నారట…మరోసారి రైతు భరోసా రావాలంటే నేను మరో సభ పెట్టాలేమో?’ అంటూ తనదైన శైలిలో చురకలు అంటించారు.

జనంపైనే నెపం నెట్టే ధోరణిలోనే…

తమ ఓటమి ప్రజల తప్పిదమేనన్న ధోరణి నుంచి కేసీఆర్‌ ఇంకా బయటపడినట్టు లేరు. ‘అసెంబ్లీకి ఓట్లేసే ముందు చిలుకకు చెప్పినట్లు చెప్పిన.. కొందరు విన్నరు.. కొందరు వినలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 1.7 శాతం కొద్ది ఓట్లతో ఓటమిపాలయ్యాం..’ అంటూ తాను చెప్పినా మీరు వినలేదనే ధోరణిలో మాట్లాడటం గమనార్హం. కాంగ్రెస్ వాళ్ళు ఏం పరిపాలన చేస్తరో చెయ్యనియ్యనీ అని ఇంతకాలం బయటికి రాకుండా ఊరుకున్నానంటూ తాను ఫామ్‌హౌస్‌కు పరిమితమైన విషయాన్ని చాకచక్యంగా సమర్థించుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మూడు అంశాల పై కేసీఆర్ మౌనం

తన కలల ప్రాజెక్టుగా కేసీఆర్ అభివర్ణించే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈ బహిరంగ సభలో ఒక్క మాట మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. పైగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అదే రోజు మేడిగడ్డలో పర్యటించి కుంగిన పియర్స్, పునరుద్దరణకు అవసరమైన పరీక్షల తీరును పరిశీలించినప్పటికీ ఆవేమీ పట్టనట్లు కేసీఆర్ ఆ ముచ్చటే తీయలేదు. పైగా సీఎం పర్యటనకు ఒక రోజు ముందు బీఆర్ఎస్ నేతల బృందం మేడిగడ్డను సందర్శించడం గమనార్హం. ఇక తాను అధికారం కోల్పోయి, ప్రత్యర్థి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఏ సభలోనూ ఆయన పేరు ఉచ్ఛరించిన సందర్భంలేదు. ప్రభుత్వాన్ని, వ్యక్తులను పరోక్షంగా తిట్టిపోస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి పేరు మాత్రం ఎత్తలేదు. మరోసారి అదే పద్ధతిని కొనసాగించారు. ఇక కరెంట్ మీటర్ల విషయంలో మోదీ పేరెత్తడం తప్ప బీజేపీ, ఆ పార్టీ నేతలను, చివరికి కేంద్రాన్ని కూడా పల్లెత్తుమాట కేసీఆర్ అనకపోవడం చర్చకు ఆస్వారమిచ్చింది. మహిళా బిల్లు, డీలిమిటేషన్ వ్యవహారంతో పాటు తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య విమర్శించినప్పటికీ అన్ని అంశాలను మాట్లాడిన కేసీఆర్ ఈ ఊసే ఎత్తకపోవడం విశేషం.

Read Also |

కేసీఆర్‌ సభకు కేటీఆర్‌, హరీశ్‌.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
 “మొదటి సంతకంతోనే హైడ్రాను పీకి పడేస్తాం”.. జగిత్యాలలో కేసీఆర్ గర్జన
Tiwanese Watermelon | పుచ్చ‌కాయ‌ల సాగు.. 3 నెల‌ల్లోనే రూ. కోటికి పైగా సంపాద‌న‌..

Latest News