Site icon vidhaatha

హైదరాబాద్.. స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్

విధాత: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో 78.57 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొత్తం ఓటర్ల సంఖ్య 112 మంది ఉండగా..వారిలో 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేసేందుకు భవన నిర్వహణ విభాగం గదిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. 81 మంది కార్పొరేటర్ల కోసం లైబ్రరీ హాల్‌లో ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 77.68% పోలింగ్ నమోదు కాగా, మొత్తంగా 78.57శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 88 ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ లకు చెందిన 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ సభ్యులు పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఈ నెల 25న ఇక్కడే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియ నిర్వహిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ పదవీ కాలం మే1వ తేదీతో ముగియ్యనున్న నేపథ్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు.

22 ఏళ్లుగా హైదరాబాద్‌ లోకల్ బాడీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతూ వస్తోంది. 22ఏళ్ల తర్వాత తొలిసారిగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ గౌతమ్ రావు పోటీ పడ్డారు. ఎన్నిక నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Exit mobile version