విధాత : భార్య కళ్లముందే ఆమె ప్రియుడిని భర్త హత్య చేసిన ఘటన వైరల్ గా మారింది. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్(35) తన భార్య అనిత, ముగ్గురు పిల్లలతో పెద్దపల్లిలోనే నివాసముంటూ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్‌కుమార్‌తో కుమార్ భార్య అనిత పినతల్లి కూతురు శైలజతో పెళ్లయింది. వరసకు మరదలు అయ్యే శైలజతో కుమార్ చనువుగా మెదలుతుండడాన్ని సంతోష్ తట్టుకోలేక పోయాడు.
భార్య శైలజను, కుమార్ ను ఈ విషయమై మందలించాడు. కొంతకాలంగా గొడవలు జరుగుతున్నా కుమార్ ప్రవర్తనలో తేడా కనిపించలేదు. దీనిపై సంతోష్ భార్య శైలజను నిలదీయడంతో తాను కాదంటున్న కుమార్ వెంటపడుతూ వేధిస్తున్నాడంటూ నెపం కుమార్ పైకి తోసేసింది. ఈక్రమంలో సంతోష్ ‘మాట్లాడుకుందాం రా’ అని కుమార్‌ను పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు పిలిచాడు. మార్కెట్ యార్డు ఆవరణలో తన భార్య, అక్కడున్నవారు చూస్తుండగానే కుమార్‌ను సంతోష్ కత్తితో నరికిచంపాడు. ఇది చూసిన శైలజా సొమ్మసిల్లి పడిపోయింది. ఘటన స్థలాన్ని డీసీపీ కరుణాకర్, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశ్ పరిశీలించారు.
మాట్లాడుకుందామని పిలిచి చంపేశారు
ఈ ఘటనపై మృతుడు పొలం కుమార్ భార్య అనిత స్పందిస్తూ నా భర్త ఇంట్లో ఉండగా సంతోష్‌కుమార్, శైలజ నుంచి ఫోన్ వచ్చిందని.. వెంటనే బయటకు వెళ్తుండగా ఎక్కడికి అని అడిగితే ‘సంతోష్, శైలజ తనతో మాట్లాడుతారటని…వ్యవసాయ మార్కెట్‌యార్డుకు రమ్మంటున్నారు అని చెప్పాడని తెలిపింది. శైలజ తన భర్తతో చనువుగా ఉంటూ తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు కుమార్ తన వెంట పడుతున్నాడంటూ సంతోష్ కు చెప్పి గొడవకు కారణమైందని పేర్కొంది. అక్రమసంబంధం ఆరోపణలో నా భర్తను దారుణంగా చంపారని వాపోయింది. అనిత ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపుతున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.