Highcourt:
విధాత : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ.2500 కోట్లను పంపించారని కేటీఆర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది.
ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ కేటీఆర్ పై పెట్టిన కేసును కొట్టివేశారు. వారం రోజుల క్రితం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును కూడా జడ్జి లక్ష్మణ్ విచారించి కొట్టివేశారు.
మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ చేసిన ఫిర్యాదు మేరకు ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆ కేసు నమోదైంది. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ అనిల్ యాదవ్ సైఫాబాద్ పీఎస్‌లో పెట్టిన కేసును సైతం హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. ఇటీవల మేడిగడ్డలో డ్రోన్ ఎగరేసిన కేసు కూడా హైకోర్టు కొట్టివేసింది.