విధాత: నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. ఆ తర్వాత జోగి రమేశ్‌తోపాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. రమేశ్‌ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. కాగా జోగి రమేశ్ చెప్పడంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తనకు రూ.3 కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారని అందు చేతనే తాను ఈ పనిలోకి దిగానని తెలిపాడు. జోగి రమేశ్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఇబ్రహీంపట్నంలో
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డి సాయం తీసుకుని మద్యం తయారీ మొదలు పెట్టమని సూచించారని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు.
