AP | HUMAN SKULL
విధాత: డ్రైనేజీలో మనిషి పుర్రె బయటపడటం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కలకలం రేపింది. పట్టణంలోని పాతూరు పెద్ద మసీదు సమీపంలో మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీలో పూడిక తీస్తుండగా మనిషి పుర్రె(కపాలం) బయటపడింది. ఒక్కసారిగా పుర్రెను చూసిన మున్సిపల్ సిబ్బంది ఏం చేయాలో తెలియక..భయంతో అక్కడి నుంచి పరారయ్యారు.
డ్రైనేజీలో మనిషి పుర్రె కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పుర్రె ఎవరిది…డ్రైనేజీలో ఎందుకుంది..? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఏదైనా జంతువులు, కుక్కలు దగ్గరలోని శ్మశాన వాటిక నుంచి ఆ కపాలాన్ని తీసుకొచ్చి డ్రైనేజీలో పడేశాయా లేక ఎవరినైనా హత్య చేసి డ్రైనేజీలో పడేశారా అన్న సందేహం కూడా ఉంది.
పుర్రె పురుషుడిదా.. మహిళదా.. ఎంత వయసు వారిదన్న అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. పుర్రెను పరిశీలిస్తే దాని కుడివైపు భాగంలో డామేజ్ కనిపిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు పుర్రెను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.