విధాత: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పట్ల భారత్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ(సీసీఎస్) సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పహల్గాం దాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని కేంద్రం విశ్వసించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులు పర్యాటకులు వారం రోజుల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ వాఘా సరిహద్దులు వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాక్ పౌరులను భారత్ లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.
ఇకపై పాక్ పౌరులకు ప్రత్యేక వీసాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే సరిహద్దు దాటిన వారు మే 1లోగా వెనక్కి వెళ్ళిపోవాలని ఆదేశించింది. రాయబార కార్యాలయాల సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించాలని నిర్ణయించింది. భారత్ లో సార్క్ వీసా ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లోగా వెళ్లిపోవాలని వెల్లడించింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ నుంచి వెళ్లాలని పాక్ హై కమిషన్ ను ఆదేశించింది. పహల్గామ్ దాడి వెనుక పాక్ హస్తం ఉందని మా దగ్గర పూర్తి ఆధారాలున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. రేపు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది.