Site icon vidhaatha

ఉగ్రవాదుల కోసం భార‌త్‌ ముమ్మర వేట.. ఇంట్లో భారీ పేలుడు! తృటిలో తప్పించుకున్న సైనికులు

ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత.. ట్రాప్ గా అనుమానాలు

విధాత: పహల్గామ్ లో పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టన బెట్టుకున్న ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్న భద్రతా బలగాలు ఉగ్రవాదుల నివాసాల సోదా సందర్భంగా పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయి. పుల్వామా జిల్లా త్రాల్‌లోని మోంఘమా ప్రాంతంలోని లష్కరే తొయిబా ఉగ్రవాదులు అసిఫ్ షేక్.. అవంతిపొరలో అదిల్ తోకర్‌ల నివాసంలో సైన్యం సోదాలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై సురక్షిత ప్రదేశానికి వెళ్లిన కొద్ది సెకెన్లలో ఆ ఇంట్లో భారీ పేలుడు జరిగి ఆ ఇండ్లు నేలమట్టమయ్యాయి. పాకిస్థాన్ నుంచే ఈ దాడికి కుట్ర జరిగినట్టు భారత్ బలంగా నమ్ముతోంది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. భద్రతాబలగాలు తమ ఇళ్లకు వస్తారన్న నమ్మకంతో ఐఈడీలు అమర్చి పేలుళ్లకు పాల్పడినట్లుగా సైన్యం అనుమానిస్తుంది. ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసమైన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే గురువారం రాత్రి సైన్యమే ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసి ఉంటుందని భావిస్తున్నారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌‌లో మారణకాండకు పాల్పడిన ఉగ్రవాదుల్లో ఆసిఫ్, అదిల్ హస్తం కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. దర్యాప్తులో వీరి పేర్లను కూడా పోలీసులు చేర్చారు. కశ్మీర్ కు చెందిన అసిఫ్, ఆదిల్ లు దాడి తర్వాత మిగతా ఉగ్రవాదులతో కలిసి పిర్‌పంజల్‌ పర్వతాల్లో దాక్కొని ఉండొచ్చని భద్రతా బలగాలు భావించి గాలింపు చేపట్టాయి. డ్రోన్‌లు, భద్రతా బలగాల కూంబింగ్‌తో ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయి. 2018లో పాక్‌కు వెళ్లిన ఈ ఇద్దరూ.. లష్కరే తాయిబా ఉగ్ర సంస్థలో చేరి శిక్షణ తీసుకున్నారు. ఈ ఇద్దరూ ఈ మధ్యే మరో నలుగురితో కలిసి కశ్మీర్‌లోకి చొరబడినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అదిల్‌ హుస్సేన్‌ తోకర్‌కు ఇద్దరు సోదరులు. అనంత్‌ నాగ్‌లో కొంత భూమి ఉంది ఈ కుటుంబానికి. అసిఫ్‌ కుటుంబానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. పహల్గాం దాడి తర్వాత ఈ ఇద్దరి కుటుంబాలను భద్రతా బలగాలు రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు కథనం. అనంత్‌ నాగ్‌ పోలీసులు ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు పాక్‌ టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు సైతం ప్రకటించారు.

Exit mobile version