Site icon vidhaatha

Indus Waters Treaty  | పాకిస్తాన్‌కు సింధు జలాలు బంద్‌ చేసే వీలుందా? అసలేంటీ సింధు నదీ జలాల ఒప్పందం?

Indus Waters Treaty  | ఉగ్రవాదులను భారత్‌లోకి చొరబడి, విధ్వంసాలకు, మారణహోమాలకు ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌ ప్రభుత్వంపై కీలక చర్యలు ప్రకటించింది. 26 మందిని బలిగొన్న పహల్గామ్‌ ఘటన నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్‌ను కట్టడిచేసేందుకు ఒత్తిడి తెచ్చేలా ప్రకటించిన చర్యల్లో 1960 నాటి సింధు జలాల ఒప్పందం రద్దు అత్యంత కీలకమైంది. ప్రకటన వెలువడగానే కొన్ని కామెంట్లతో ఎక్స్‌ పొంగిపొర్లింది. ‘దాహంతో పాకిస్తాన్‌ చనిపోతుంది’, ‘ఈ వేసవిలో పాకిస్తాన్‌ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది’, ‘పాకిస్తాన్‌ ఎండిపోతుంది’.. అనే కామెంట్లు వెల్లువెత్తాయి. పాకిస్తాన్‌ ఎదుర్కొనబోయే దారుణ పరిస్థితిని కళ్లకు కట్టాయి. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఇప్పటికి ఆ దేశాన్ని మానసికంగా ఒత్తిడి చేస్తే.. దీర్ఘకాలంలో పెను విపత్తులు ఎదుర్కొనాల్సిన పరిస్థితిని సృష్టించనున్నది.

దీనికి ముందు అసలు సింధు జలాల ఒప్పందం ఏమిటో ఒకసారి చూద్దాం. సింధు, ఝీలం, చీనాబ్‌ నదుల నుంచి నీటిని పొందేందుకు ఈ ఒప్పందం అనుమతిస్తుంది. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ఒప్పందంపై 1960లో ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్‌, పాకిస్తాన్‌ రెండు దేశాలూ ప్రధానంగా వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థలు. అందులోనూ నదీజలాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సింధూ నదీ వ్యవస్థలోని సట్లెజ్‌, బియాస్‌, చీనాబ్‌ నదుల నుంచి భారతదేశం అపరిమితంగా నీటిని వాడుకొనే హక్కు ఉన్నది. మరోవైపు సింధు, ఝీలం, చీనాబ్‌ నదుల నుంచి నీటిని పొందే అనుమతి ఉన్నది. అయితే.. దిగువ నదీ తీర దేశంగా ఉండటం పాకిస్తాన్‌కు ఒక ప్రతికూలత. నదులు పుట్టి ప్రవహించే భాగంలో భారత్‌ ఉండటం భారత్‌ సానుకూలత. ఈ నదుల నీటి నుంచే 80 శాతం జలాలను పాకిస్తాన్‌ ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో ఈ ఒప్పందంపైనే పాకిస్తాన్‌ పూర్తిగా ఆధారపడి ఉన్నది.

ఈ నీళ్లే పాకిస్తాన్‌లోని పంజాబ్‌, సింధ్‌ ప్రావిన్స్‌ల వ్యవసాయ అవసరాలను తీర్చుతున్నది. వ్యవసాయిక దేశమైన పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థకు 25 శాతం వ్యవసాయం నుంచే అందుతున్నది. అంతేకాదు.. ఈ వ్యవసాయమే పాకిస్తాన్‌లోని 70 శాతం గ్రామీణ ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు. ఇప్పటికే పాకిస్తాన్‌ భూగర్భ జలాల క్షీణతతో తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నది. కరాచీ వంటి నగరాలు నీటి కోసం ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయి. ఈ సమయంలో సింధు జలాల సరఫరాలో ఏ మాత్రం ఆటంకం ఎదురైనా పంటలు ఎండిపోయి, ఆహార కొరత ఏర్పడటమే కాదు.. మొత్తం ఆర్థిక వ్యవస్థే అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉన్నది. భారత నిర్ణయంతో ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌ చిక్కులోకి వెళ్లదు. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌కు నీటి సరఫరాను భారత్‌ కూడా నిలిపివేయలేదు. ఎందుకంటే.. పాకిస్తాన్‌కు పారే నీటిని ఆపే లేదా మళ్లించే వ్యవస్థ లేదు. అయితే.. తక్షణం ఐదు నుంచి పదిశాతం నీటి సరఫరాపై కోత పెట్టే అవకాశం ఉన్నది.

సింధూ నదీ జలాల ఒప్పందం ప్రకారం.. సింధు, ఝీలం, చీనాబ్‌ నదులపై భారతదేశం అనకట్టలు నిర్మించే వీలు లేదు. అయితే.. జలవిద్యుత్తు ఉత్పత్తికి ప్రాజెక్టులు నిర్మించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులు నీటి సరఫరాను నిలిపివేయలేవు కానీ.. అడ్డుకునే అవకాశం మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో దానిలోని నిబంధనలకు భారత్‌ కట్టుబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిజర్వాయర్లపై ఆనకట్టలు కట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. దశాబ్దాలు కాకపోయినా.. నదులపై రిజర్వాయర్‌లు నిర్మించడానికి అనేక ఏళ్లు పడుతుంది. సర్వేలు, నిర్మాణాలకు నిధుల కేటాయింపు, పర్యావరణ ప్రభావం.. ఇలా అనేక అంశాలు ఉంటాయి. కనుక.. ఈ దశలో భారత్‌ నిర్ణయం.. ఉగ్రమూకలను కట్టడి చేసేలా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచేందుకు మాత్రమే పనిచేస్తుంది. ఇదే విషయాన్ని ఒక ఎక్స్‌ యూజర్‌ స్పష్టంగా రాశారు. ‘రేపొద్దున్నే నీటిని బంద్‌ చేయడం కాదు.. నీటి పంపు ఇంకా తెరిచే ఉన్నది. అయితే.. దాని వెనుక ఉన్న నిబంధనలను ఎత్తివేసినట్టయింది’ అని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version