Site icon vidhaatha

Jurala Project | జూరాల ప్రాజెక్టు పదిలం..  వంద కోట్లతో  ప్రాజెక్టు వద్ద అదనపు బ్రిడ్జి: మంత్రి ఉత్తమ్

Jurala Project | విధాత, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు సాగునీటికి వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (Priyadarshini Jurala project) ప్రమాదంలో ఉందని వస్తున్న ఆరోపణలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి (Irrigation Minister Uttam Kumar Reddy) ఖండించారు. శనివారం జిల్లాకు చెందిన మంత్రి శ్రీహరి ఆధ్వర్యంలో జూరాల ప్రాజెక్టును సందర్శించిన ఉత్తమ్ ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. ఇటీవల ప్రాజెక్టుకు ఉన్న ఒక క్రస్ట్ గేట్ పాడవడంతో అధికారులు చేస్తున్న మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టుపై నుంచి వాహనాల రద్దీ అధికంగా ఉందని, దీని వల్ల రానున్న రోజుల్లో ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని చెబుతూ.. రూ. 100 కోట్లతో కొత్తగా బ్రిడ్జి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ప్రాజెక్టు వద్ద ప్రత్యేకంగా బ్రిడ్జిని నిర్మిస్తే ప్రాజెక్టు పై భారం తగ్గుతుందని చెప్పారు. ఒక్క క్రస్ట్ గేట్ మరమ్మతుకు వస్తే ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని బీఆర్ఎస్ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు.

పదేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్టు లను పట్టించుకోని గులాబీ నేతలు ఇప్పుడు ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదనడం వారి అవివేకానికి నిదర్శనం అని ఉత్తమ్ అన్నారు. జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని బీ ఆర్ ఎస్ నేతలు ప్రజలను నమ్మించే పనిలో పడ్డారని.. కానీ ప్రజలు ఆ పార్టీ నేతలను నమ్మే పరిస్థితి లేదన్నారు. పదేళ్ల బీ ఆర్ ఎస్ పాలనలో ప్రాజెక్టు ల పై చేసిన తప్పులను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుతున్నదని, రేవంత్ సర్కార్ ప్రాజెక్టు ల రక్షణ కోసం కంకణం కట్టుకుంటే గులాబీ నేతలు ఓర్వ లేక పోతున్నరన్నారు. పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భష్టుపట్టించారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరో మంత్రి వాకిటి శ్రీ హరి మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు ప్రమాదం లో ఉందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రాజకీయ ఉనికిని కపాడుకునేందుకు కోసం బీ ఆర్ ఎస్ నేతలు ప్రాజెక్టు పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మంత్రుల వెంట నారాయణ పేట ఎమ్మెల్యే పర్ణిక,గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి,వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి,అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ నాయకురాలు సరిత, జూరాల ప్రాజెక్టు అధికారులు, జిల్లా సాగునీటి శాఖ అధికారులు ఉన్నారు.

Exit mobile version