Site icon vidhaatha

CSగా బాధ్యతలు స్వీకరించిన కే. రామకృష్ణారావు

విధాత: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ కే.రామకృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఎస్ గా పదవి విరమణ చేసిన ఐఏఎస్ శాంతికుమారి స్థానంలో రామకృష్ణారావు నూతన సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావు గతంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కీలక పదవిలో పనిచేశారు. ఆయనకు పాలనాపరంగా ఉన్న అనుభవం, ఆర్థిక రంగంపై మంచి పట్టు ఉండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం సీఎస్ గా ఆయనను ఎంపిక చేసుకుంది.

ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఆయన 12ఏళ్లపాటు పనిచేశారు. మొత్తం 14 రాష్ట్ర బడ్జెట్లను రూపుదిద్దారు. వీటిలో 12 పూర్తిస్థాయి కాగా, మరో రెండు ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్లు. తొలుత 2014 నవంబరు 5న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అటు బీఆర్ఎస్ పాలనలో, ఇటు కాంగ్రెస్‌ పాలనలోనూ రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించిన ఘనత ఆయనకు దక్కింది. రామ‌కృష్ణారావు 2025 ఆగ‌స్టు నెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ప్రభుత్వం ఆయన పదవి కాలాన్ని మరో ఆరునెలలు పొడిగించే అవకాశం ఉంది.

రామకృష్ణారావు ప్రస్థానం

రామకృష్ణారావు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గుత్తి కోటకు చెందినవారు. గుత్తి పట్టణంలోని కోట ప్రాంతం తొలుత వారి కుటుంబం నివాసం. రామకృష్ణారావు తాత కూట్లిగి చంద్రమౌళీశ్వర రావు స్వాతంత్ర్య సమరయోధుడు. తల్లిదండ్రులు గురునాథరావు, భాగ్యలక్ష్మి. గురునాథరావు రైల్వే ఉద్యోగి కావడంతో బదిలీలపై వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు. ఖాజీపేటలో తండ్రి రైల్వే ఉద్యోగిగా పనిచేసిన కాలంలో అక్కడ రామకృష్ణారావు కొంతకాలం పెరిగా. చివరకు రామకృష్ణారావు కుటుంబం హైదరాబాదులో స్థిరపడ్డారు.

రామకృష్ణారావు గుత్తి కోట వీధిలోని పట్టు కేశవపిళ్లై ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివారు. శ్రీసత్యసాయి జిల్లా (ఉమ్మడి అనంతపురం జిల్లా) పరిగి మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివారు. నాగార్జున సాగర్‌లో ఇంటర్‌, కాన్పూర్‌ ఐఐటీలో బీటెక్‌, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్‌, అమెరికా డ్యూక్‌ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. 1991లో ఐఏఎస్‌ సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామబాద్‌ జిల్లాల సబ్‌ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌గా, గుంటూరు, అదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్‌గా, విద్యాశాఖ కమిషనర్‌గా, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నిన్నటి వరకు విధులు నిర్వహించారు.

ఎంసీఆర్ హెచ్ ఆర్డీ చైర్మన్ గా శాంతికుమారి

మాజీ సీఎస్ శాంతికుమారిని ప్రభుత్వం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్ హెచ్ ఆర్డీఐ) వైస్ చైర్మన్, డైరక్టర్ జనరల్ (ఎఫ్ఏసీ) గా ప్రభుత్వం నియమించిని సంగతి విదితమే.

Exit mobile version