Telangana |
విధాత, (విధాత): తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే.రామకృష్ణారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్థిక శాఖలో గత దశాబ్ధకాలంగా పనిచేస్తున్న ఆయన సేవలను మున్ముందు ఉపయోగించుకోవాలనే ఉద్ధేశ్యంతో ఉన్నత స్థాయి పదవికి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. కే.రామకృష్ణారావు (1991 ఐఏఎస్ బ్యాచ్) ప్రస్తుతం ఆర్థిక శాఖ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
గత మూడు నెలలుగా కాబోయే ప్రధాన కార్యదర్శి అంటూ ప్రచారం జరుగుతున్నది. ఈ పదవి కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్ లు తమ స్థాయిలో పోటీ పడ్డారు. కొద్ది రోజుల క్రితం ఓబీసీ కులానికి చెందిన జయేష్ రంజన్ ప్రధాన కార్యదర్శి అవుతున్నారని వార్తలొచ్చాయి. ఉత్తర, దక్షిణ భారత వాదం తెరమీదికి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కే.రామకృష్ణారావు వైపు మొగ్గు చూపారనే స్పష్టమవుతున్నది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజున రామకృష్ణారావు నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంత బాగా లేకపోవడం, సంక్షేమ పథకాలకు దండిగా నిధులు అవసరం ఉండడం కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక అంశాలు తెలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారి కావడంతో గట్టెక్కిస్తారనే నమ్మకంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి చెందిన రామకృష్ణారావు కు తెలంగాణలో సుధీర్ఘకాలం పనిచేసిన అనుభవం, తెలంగాణ బడ్జెట్ పై పూర్తి పట్టు ఉండడంతో పరిగణనలోకి తీసుకున్నారు. అయితే రామకృష్ణారావు 2025 ఆగస్టు నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆరు నెలలు సర్వీసు పొడగించాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు.