Liechtenstein Success Story | సాధారణంగా విస్తీర్ణంలో పెద్ద దేశాలు, లేదా సైనిక శక్తి.. లేదా బలమైన కరెన్సీ.. అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు కలిగి ఉన్న దేశాలు అత్యంత సంపన్నమైన దేశాలుగా పరిగణిస్తారు. కానీ.. ఈ సంప్రదాయ ఆలోచనలను యూరప్ ఖండంలోని ఒక చిన్న దేశం సవాలు చేస్తున్నది. ఈ దేశానికి సొంత కరెన్సీ లేదు.. ఒక్కటంటే ఒక్క ఎయిర్ పోర్టు కూడా లేదు. కానీ.. ప్రపంచ సంపన్న దేశాల్లో ఒకటిగా అజమాయిషీ చెలాయిస్తున్నది. దానిపైరే లిక్టన్‌స్టైన్! స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల మధ్య కొండల మధ్య ఒదిగిపోయిన ఈ అందమైన దేశం.. తలసరి ఆదాయంలో సంపన్న దేశాల సరసన నిలబడింది. ఆర్థిక సమర్థతకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నది. అంతా కలిపితే 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉంటుంది. కానీ.. బలమైన ఆర్థిక వ్యవస్థను ఇది నిర్మించుకోగలిగింది. సొంత సెంట్రల్ బ్యాంక్ లేని లిక్టన్‌స్టైన్.. స్విస్ ఫ్రాంక్‌లను అధికారిక కరెన్సీగా ఉపయోగిస్తున్నది.
మానిటరీ పాలసీల తలనొప్పి లేదు
లిక్టన్‌స్టైన్ వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఆ దేశం మానిటరీ పాలసీల నిర్వహణ అనే పెద్ద తలనొప్పి నుంచి బయటపడింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, కరెన్సీ ముద్రణ వంటి ఇబ్బందులేమీ ఆ దేశానికి లేవు. లిక్టన్‌స్టైన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అది దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరతను సాధించగలిగిందని, విత్త క్రమశిక్షణను పాటిస్తున్నదని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. లిక్టన్‌స్టైన్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు. అయినా.. వివిధ దేశాలకు కనెక్టివిటీ అనేది ఈ దేశానికి సమస్యగా కూడా లేకపోవడం విశేషం. విమాన యానాలకు ఈ దేశం స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలోని అధునాతన విమానాశ్రయాలను వినియోగించుకుంటున్నది. లిక్టన్‌స్టైన్‌కు రావాల్సిన ప్రజలు నేరుగా జ్యూరిచ్ లేదా ఇన్స్‌బ్రుక్ ఎయిర్‌పోర్టులకు చేరుకుని.. అక్కడి నుంచి కారు లేదా ట్రైన్‌లో స్వదేశానికి చేరుకుంటారు. చక్కటి, విశాలమైన రోడ్లు సత్వరం, సుఖంగా ప్రయాణం చేసే వీలు కల్పిస్తున్నాయి.
మాన్యుఫాక్చరింగ్ రంగంలో కింగ్
లిక్టన్‌స్టైన్ ఆర్థిక వ్యవస్థను వెన్నెముకగా నిలుస్తున్నది అధునాతన మాన్యుఫాక్చరింగ్ రంగం. కచ్చితత్వంతో కూడిన ఇండస్ట్రియల్ పనిముట్లకు, అడ్వాన్స్‌డ్ టెక్నలాజికల్ ఉత్పత్తులకు లిక్టన్‌స్టైన్ గ్లోబల్ హబ్‌గా విలసిల్లుతున్నది. డెంటల్ ఎక్విప్‌మెంట్, ఆటోమోటివ్ కాంపొనెంట్స్, ఆఖరుకు స్పేస్ మిషన్‌లకు అవసరమయ్యే విడి భాగాలను సైతం ఈ దేశం తయారు చేస్తున్నది. నిర్మాణరంగ మెషినరీకి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన హిల్టీ వంటి కంపెనీలు ఇక్కడ తమ గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌ను కలిగి ఉన్నాయంటే దీని ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. మరో విశేషం ఏమిటంటే.. లిక్టన్‌స్టైన్‌లో జనాభా సంఖ్యకంటే రిజిస్టర్డ్ కంపెనీల సంఖ్యే ఎక్కువ. అపారమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నది.
తక్కువ నేరాలు
లిక్టన్‌స్టైన్‌లో నేరాల రేటు అత్యంత కనిష్ఠ స్థాయిలో ఉంటుంది. సుమారు 40వేల జనాభా కలిగిన ఈ దేశంలో పాలనా వ్యవస్థ అత్యంత క్రమశిక్షణ కలిగినది. నేరాలు అనేవి జరుగవనే చెప్పాలి. ఇంటికి తాళం వేయకపోయినా ఏమీ కాదన్న ధీమాతో అక్కడి ప్రజలు ఉంటారు. వివిధ అంతర్జాతీయ ఏజెన్సీలు సైతం ఈ దేశంలో క్రైమ్ రేట్ చాలా అంటే చాలా తక్కువని నిర్ధారిస్తున్నాయి. దీంతో అత్యంత సురక్షిత దేశంగా కూడా లిక్టన్‌స్టైన్ తన దేశ ప్రతిష్ఠను ఇనుమడింప చేసుకుంటున్నది. ఈ దేశం సక్సెస్ అనేది మిలిటరీ పవర్ మీదనో లేదా సహజ వనరుల కారణంగానో లేదని, సమర్థమైన విధానాలు, వనరులను చక్కగా వినియోగించుకోవడం, పొరుగు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కలిగి ఉండటం కారణంగానే ఈ విజయం లభించిందని నిపుణులు చెబుతుంటారు. వృథా ఖర్చులు నివారించి, అత్యంత ప్రమాణాలతో కూడిన ఉత్పత్తుల ఎగుమతి, సామాజిక నమ్మకం పెంపొందించడం ద్వారా పాలనకు సుస్థిరమైన నమూనాగా నిలుస్తున్నది. ఇది చదివిన తర్వాత.. మన దేశంలో, మన రాష్ట్రాల్లో కూడా ఇటువంటి విధానాలు, పాలనా పద్ధతులు ఉంటే బాగుండని అనిపిస్తున్నదా?
