Mlc Kavitha | Kaleshwaram | Megha Krishna Reddy | Meil
- ఆ సంస్థను ఎందుకు వదిలిపెడుతున్నారని ప్రశ్న
- మేఘాతో.. కాంగ్రెస్ డీల్ చేసుకుందంటూ ఆరోపణ
- 90 % హౌస్ లు కట్టిన సంస్థను ఎందుకు వదిలేశారు..
- అధికారులను మాత్రమే విచారణకు పిలుస్తారా..
- మేఘా సంస్థను పిలిచే అధికారం జ్యుడీషియల్ కమిషన్ కు
- విచారణకు పిలవకపోవడంపై అనేక అనుమానాలు
- రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్న సంస్థ
- ఇంజినీరింగ్ నిపుణుల్లోనూ చర్చలు
హైదరాబాద్, (విధాత): బీఆర్ఎస్ అధినేత కవిత మేఘా కృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు. ఇంజినీర్లను, అధికారులకు విచారిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో మెజార్టీ పనులు పూర్తి చేసిన సంస్థకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదంటూ ఆమె ప్రశ్నించారు. మేఘా సంస్థతో కాంగ్రెస్ పార్టీ డీల్ కుదర్చుకున్నదని విమర్శించారు. కవిత చేసిన ఆరోపిణలు ఇప్పుడు రాజకీయవంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పీసీ ఘోష్ కమిషన్ మేఘా సంస్థకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని.. కేవలం ఇంజినీర్లకు, అధికారులకు మాత్రమే నోటీసులు ఎందుకు ఇచ్చారని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘మేము ఏం తప్పు చేసినమా.. కేసీఆర్ ఏం తప్పు చేశారు.. నీళ్లు ఇవ్వడం తప్పా.. నిధులు తేవడం ఆయన చేసిన తప్పా.. తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడం తప్పా? అంటూ ఆమె ప్రశ్నించారు. అదే సమయంలో మేఘా సంస్థ అధిపతి కృష్ణారెడ్డిని ఆమె టార్గెట్ చేశారు.
మేఘా కంపెనీకే మెజార్టీ కాంట్రాక్టులు
మేఘా కృష్ణారెడ్డికి (మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ యజమాని) కాళేశ్వరంలో 21 పంప్ హౌస్ లు ఉంటే 20 పంప్ హౌస్ లు ఆయనకే ఇచ్చారని కవిత అన్నారు. మేఘా కష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. ‘రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం వచ్చింది. మీరు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేముందు 90 శాతం పంప్ హౌస్ లు కట్టిన మేఘా కష్ణారెడ్డిని ఎందుకు విడిచిపెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇ ది కేవలం కుట్ర అని ప్రజలకు అర్థం అవుతున్నది’’ అని కవిత అన్నారు. అయితే.. ఉన్నట్టుండి కాళేశ్వరం లోపాలపై కవిత ఇప్పుడు మాట్లాడటం గమనార్హం. మేడిగడ్డ బారాజ్ లో ఒక పిల్లర్ కుంగి, రెండు పిల్లర్లకు పగుళ్లు ఏర్పడినప్పుడు కూడా కవిత కాంట్రాక్టర్లు తప్పులు చేశారని, నాసిరకంగా నిర్మించారని ఏనాడూ మీడియాతో చెప్పలేదు. ఒక లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధ్యక్షతన జ్యుడిషియల్ కమిషన్ ను నియమించింది. ఈ విచారణకు తుది దశకు చేరుకోవడమే కాకుండా విచారణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు పంపించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగాహైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగతి ఆధర్యంలో జరిగిన మహాధర్నాలో కల్వకుంట్ల కవిత పై విధంగా మాట్లాడారు.
11న కేసీఆర్ విచారణ
కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న కేసీఆర్ ఈ నెల 11వ తేదీన ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బీఆర్ కేఆర్ భవనంలోని 8వ అంతస్తులో ఉన్న జ్యుడిషియల్ కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. కేసీఆర్ విచారణకు సమ్మతి తెలియచేస్తూ, తేదీని నిర్ణయించిన తరువాత కవిత మహాధర్నాకు పిలుపునిచ్చి, మేఘా కృష్ణారెడ్డిపై ఘాటు గా విమర్శలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. గత దశాబ్ధకాలంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలలో మేఘా కంపెనీ పనులు దక్కించుకునేందుకు పార్టీల పెద్దలతో దగ్గరి సంబంధాలు నెరపుతున్నది. బీజేపీకి ఎక్కువ మొత్తంలో పార్టీ విరాళాలు సమకూర్చేందుకు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసింది కూడా. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అందరికీ విరాళాలు ఇస్తున్నది. అయితే కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ నీటి పారుదల అధికారులను మాత్రమే పిలిపించి విచారించడం, కాంట్రాక్టర్లను పిలిచి విచారించకపోవడం కవితకు చిర్రెత్తుకొచ్చింది. మేడిగడ్డ బారాజ్ లో డ్యామేజీ అయిందని కేసీఆర్ కు నోటీసు ఇచ్చి, విచారణకు హాజరు కావాలంటున్నారు. మరి మేఘా కృష్ణారెడ్డి సంగతేంటని ఆమె రేవంత్ రెడ్డి సర్కార్ ను సూటిగా ప్రశ్నించారు. విచారణను ఇంజినీర్లకు, బ్యూరోక్రాట్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులకే పరిమితం చేస్తారా అని ప్రశ్నించారు.
మేఘాను తప్పిస్తున్నారా?
కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు దక్కించుకుని, నిర్మాణంలో ప్రధాన భూమికను పోషించిన మేఘా సంస్థను ఎలా వదిలేస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సంస్థను తప్పించేందుకు లోపాయికారి ఒప్పందాలు జరిగాయనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. అనేక తప్పిదాలకు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్న సంస్థ పట్ల చూసిచూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని ఇంజినీరింగ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కాంట్రాక్టు ఏజెన్సీ పై గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రచార, ప్రసార సాధనాల్లో కోకొల్లలుగా వార్తలు వస్తున్నాయి. వాటిని కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకుని విచారణకు నోటీసులు జారీ చేయాలని కోరుతున్నారు. కేవలం ఇంజినీర్లు, అధికారులు, పార్టీ నాయకులను విచారణ జరిపితే సరిపోదని అంటున్నారు. ప్రాజెక్టు పనులపై ఏమాత్రం అనుమానం ఉన్నా, ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని భావించిన సందర్భంలో మేఘా కు నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే అధికారం జ్యుడిషియల్ కమిషన్ కు ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.