Shahbaz Sharif: ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పేరు చెబితేనే భారతీయులు మండిపడుతున్నారు. ఇక ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి.
ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. షరీఫ్ పూర్వీకులు జమ్ముకశ్మీర్ కు చెందినవారు. అయితే బ్రిటీష్ పాలనలోనే షరీఫ్ కుటుంబం కశ్మీర్ నుంచి అమృత్ సర్ సమీపంలోని ‘‘జాతి ఉమ్రా’’ అనే గ్రామానికి వెళ్లి స్థిరపడ్డారట. బ్రిటిష్ రచయిత లైవెన్ అనటోల్ రచించిన ‘‘పాకిస్థాన్ ఎ హార్డ్ కంట్రీ’’లో ఇందుకు సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. షరీఫ్ పూర్వీకులు వ్యాపారవేత్తలను తెలుస్తున్నది.
జాతి ఉమ్రా గ్రామంలో వాళ్లు ఓ పెద్ద భవంతిని నిర్మించుకొని అందులో ఉండేవారట. దేశ విభజన సమయంలో షరీఫ్ కుటుంబం పాకిస్థాన్ కు వలసవెళ్లింది. అప్పుడు ఈ గ్రామంలో ఉన్న తమ భవంతిని గురుద్వారా కోసం విరాళంగా ఇచ్చారట. అయితే జాతి ఉమ్రా గ్రామం పట్ల షరీఫ్ కుటుంబసభ్యులు అనుబంధం వదులుకోలేదని.. పలు మార్లు వాళ్లు ఈ గ్రామానికి వచ్చేవారని సమాచారం.
1976లో షెహబాజ్ షరీఫ్ సోదరుడు అబ్బాస్ షరీఫ్ తన భవంతిని గ్రామానికి విరాళంగా ఇచ్చారట. ఆయన గతంలో తరుచూ ఈ గ్రామానికి వచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. షరీఫ్ కుటుంబానికి ఈ గ్రామం మీద ఎంతో మమకారం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. షెహబాజ్ షరీఫ్ కూడా పాకిస్తాన్లోని తన అధికారిక నివాసానికి వారి పూర్వీకుల గ్రామమైన జాతి ఉమ్రా పేరు పెట్టుకోవడం గమనార్హం. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తలు చోటుచేసుకున్న నేపథ్యంలో షరీఫ్ మనదేశంలోని ఓ గ్రామం పట్ల ప్రత్యేక అనుబంధం కలిగిఉండటం గమనార్హం.
గ్రామస్థుల నుంచి వ్యతిరేకత
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జాతి ఉమ్రా గ్రామస్థులు పాకిస్థాన్ ప్రధాని పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి పాకిస్థాన్ ప్రధాని కావడం తమకు గర్వకారణం కానీ.. ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుండటం కరెక్ట్ కాదని వారు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ భారత్ మీద ప్రయోగించే డ్రోన్లతో తమ గ్రామానికి కూడా నష్టం వాటిల్లుతుందని వారు అంటున్నారు.