Site icon vidhaatha

Encounter | ములుగు.. కర్రెగుట్టలను చుట్టుముట్టిన భద్రత బలగాలు? కాల్పుల మోత!

విధాత ప్రత్యేక ప్రతినిధి:
Encounter | తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులోని ములుగు అటవీ ప్రాంతంలోని కర్రెగుట్టలను వేలమంది సాయుధ భద్రత బలగాలు భారీ ఎత్తున చుట్టుముట్టినట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో కర్రెగుట్టల వైపు పోలీసు బలగాలు తరలి వెళ్తున్నట్లు జిల్లా కేంద్రంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఏదో భారీ ఎన్‌కౌంటర్‌కు సాయుధ పోలీస్ బలగాలు శ్రీకారం చుట్టినట్లు ఆదివాసీ వర్గాల్లో, గిరిజనగూడేల్లో తీవ్ర ఆందోళన రేకెత్తుతున్నది. ఇదిలా ఉండగా మంగళవారం మార్క్సిస్టు మహోపాధ్యాయుడు లెనిన్ పుట్టినరోజుతోపాటు ఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడం గమనార్హం.

వివాదాస్పదంగా మారిన కర్రెగుట్టలు
ఇటీవల కర్రెగుట్టలపై తీవ్ర చర్చ సాగిన విషయం తెలిసిందే. కర్రెగుట్టల్లో బాంబులు, ఎల్ఈడీలు అమర్చినట్లు మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖ తీవ్ర కలకలం సృష్టించింది. దీనికి ముందు ఒకరిద్దరు గిరిజనులు కర్రెగుట్టల వైపు వెళ్లి మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా మావోయిస్టుల పేరుతో విడుదలైనట్లు పేర్కొన్న లేఖ ఆధారంగా స్థానిక పోలీసులు నక్సల్స్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గిరిజనుల ప్రాణాలతో మావోయిస్టులు చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవిపై గిరిజనులకు ఉన్న హక్కును హరిస్తూ వారి జీవితాలను అల్లకల్లోలం చేసేలా మావోయిస్టులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే.. ఆ లేఖ తాము విడుదల చేసిందని కాదని వివరణ ఇచ్చారు. ఆ తరువాత ములుగు, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు అటవీ గ్రామాల్లో గిరిజనుల పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులను అడవి నుంచి, ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇదంతా పోలీసుల పనేనని చర్చ జరిగింది.

భారీ ఎన్‌కౌంటర్‌కు పోలీసుల ప్లాన్?
ఈ దశలో తాజాగా మంగళవారం ఉదయం నుంచి కర్రెగుట్టను భారీ ఎత్తున పోలీసు బలగాలు , సాయుధ సీఆర్పీఎఫ్‌ బలగాలు చుట్టుముట్టాయని చర్చ బహిరంగమైంది. కర్రెగుట్టల కేంద్రంగా మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఈ కారణంగానే సాయుధ బలగాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం కర్రెగుట్టలను దిగ్బంధించినట్లు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఫలితంగా మావోయిస్టులు కర్రెగుట్ట వైపు తరలి వెళ్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే కర్రెగుట్టను చుట్టుముట్టినట్లు చెబుతున్నారు. దీంతో మరో భారీ ఎన్‌కౌంటర్‌ ఉంటుందేమో అన్న చర్చ నడుస్తున్నది.

కీలక స్థానంలో ఉన్న కర్రెగుట్ట
కర్రెగుట్టలు ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ వైపుగా విస్తరించి ఉన్నాయి. సుదీర్ఘకాలంగా మావోయిస్టులకు షెల్టర్‌గా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టలు టార్గెట్‌గా సాయుధబలగాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి నలువైపుల నుంచి దాడికి పూనుకున్నట్లు భావిస్తున్నారు. కర్రెగుట్టల్లో మావోయిస్టు భారీగా ఉన్నారని సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు చర్చ సాగుతోంది. స్థానిక పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్‌ బలగాలు భారీగా నుంచి భారీగా తరలి వస్తున్నట్టు సమాచారం. తెలంగాణ, భారీగా పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కాల్పుల మోతతో గిరిజనగూడేలు దద్దరిల్లుతున్నట్లుగా సమాచారం. కర్రెగుట్టలను పోలీసు బలగాలు చుట్టుముట్టిన నేపథ్యంలో హక్కులనేత ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. మంగళవారం సాయంత్రానికి గాని ఏం జరిగిందనే విషయాలు బహిరంగమయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. పోలీసుల స్పందిస్తే తప్ప విషయాలు వెలుగు చూసే అవకాశం లేదు.

కర్రెగుట్ట కాల్పులు వెంటనే ఆపాలి: ప్రొఫెసర్ హరగోపాల్
ఉదయం 6 గంటల నుండి, భారీ స్థాయిలో, ఊసుర్ బ్లాక్ లోని కర్రె గుట్టల సమీపంలో సాయుధ బలగాలు కాల్పులు జరుపుతున్నట్లు, అదనపు బలగాల తరలింపు కూడా జరుగుతుందని సమాచారం మీడియా మిత్రుల ద్వారా అందుతున్నదని హరగోపాల్‌ పేర్కొన్నారు. శాంతి చర్చల ప్రతిపాదన చేస్తూనే , ఇటువంటి హత్యాకాండకు ప్రభుత్వాలు తెగబడడం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించవచ్చని, వెంటనే సాయుధ చర్యలు నిలిపి వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హరగోపాల్ కోరారు. హరగోపాల్ ప్రకటనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అనే చర్చ సాగుతుంది.

హిడ్మా దళం ఇక్కడ సంచరిస్తుందన్న సమాచారం

భద్రతాబలగాలు కర్రిగుట్టలను చుట్టుముట్టడానికి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, పార్టీ కేంద్ర మిలటరీ కమిషన్ ఇంచార్జి హిడ్మా దళం ఇక్కడ సంచరిస్తుందన్న సమాచారం కారణమని తెలుస్తుంది. 2010లో తాడిమెట్లలో కేంద్ర బలగాలు ప్రయాణిస్తున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చి 76 మందిని హత‌మార్చిన ఘటనతో హిడ్మా వెలుగులోకి వచ్చాడు. నాలుగేళ్ల క్రితం సొంత గ్రామం పువ్వర్తి జీనుగూడ అడవుల్లో తాను ఉన్నానని భద్రతా బలగాలను నమ్మించి పట్టుకునేందుకు వచ్చిన వారిలో 26 మందిని హతమార్చిన ఘటనలోనూ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మా కీలకంగా ఉన్నారు.

ఇటీవల కేంద్ర కమిటీ సభ్యుడు ఒడిస్సా ఇంచార్జి రామచంద్రా రెడ్డి అలియాస్ చలపతి ఎన్ కౌంటర్ హిడ్మా వైఫల్యంగా భావించిన మావోయిస్టు పార్టీ ఆయనను కేంద్ర మిలటరీ కమిషన్ ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించినట్లుగా ప్రచారం సాగింది. హిడ్మా స్థానంలో దేవ్‌ ను నియమించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హిడ్మా దళం ములుగు జిల్లా కర్రిగుట్టల్లోకి ప్రవేశించినట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందిందని సమాచారం. అందుకే భద్రతా బలగాలు కర్రిగుట్టలను చుట్టుముట్టినట్లుగా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి..

Gadar Awards | జూన్ 14న.. గద్దర్ అవార్డుల ప్ర‌ధానం

Rythu Bharosa | మూడో సీజన్‌ రైతు భరోసా.. ఇస్తారా? ఎగ్గొడతారా?

Exit mobile version