Site icon vidhaatha

Enforcement Directorate | ఈడీలో అంతా అసమర్థులేనా?

Enforcement Directorate

విధాత‌, న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఎస్‌కే మిశ్రా పదవీకాలం పొడిగింపు విషయంలో కేంద్రం సుప్రీం కోర్టు నుంచి సానుకూల తీర్పు పొందింది. ఈ కేసును గురువారం విచారించిన సుప్రీం కోర్టు.. ఆయనను సెప్టెంబర్‌ 15 వరకూ ఆ పదవిలో కొనసాగేందుకు అనుమతినిచ్చింది. అయితే.. విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరోసారి ఆయన పొడిగింపును కేంద్రం కోరడంపై స్పందిస్తూ.. మొత్తం శాఖలో పదవీ విరమణ చేయబోయే అధికారి (మిశ్రా) తప్ప.. అంతా అసమర్థులేనా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

సెప్టెంబర్‌ 15 వరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తున్నామన్న సుప్రీం కోర్టు.. తదుపరి ఎట్టిపరిస్థితుల్లోనూ పొడిగించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్‌ 15 వరకూ పొడిగించాలని సుప్రీం కోర్టును కేంద్రం కోరింది. దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విక్రంనాథ్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం.. దేశ, విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం వెలువరిస్తున్నట్టు పేర్కొన్నది.

మిశ్రా తప్ప అంతా అసమర్థులేనా? అన్న సుప్రీం కోర్టు ప్రశ్నకు సొలిసిటర్‌జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. ఆర్థిక నేరాల టాస్క్‌ఫోర్స్‌ కీలక రివ్యూ ఉన్నదని, ఇందులో ఆయన హాజరు అవసరమని పేర్కొన్నారు. మిశ్రా ఆ పదవిలో ఈ సమయంలో కొనసాగడం అత్యవసరం ఏమీ కానప్పటికీ.. ఆయన కీలక సమీక్షల్లో పాల్గొనాల్సి ఉన్నదని తెలిపారు. దీనిపై ఏకీభవించిన సుప్రీంకోర్టు.. పదవీకాలం పెంపునకు అనుమతించింది.

Exit mobile version