vemulavada temple | దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిపై రచ్చ హాట్ టాపిక్ గా మారింది. ఆలయాన్ని 100కోట్లకు పైగా వెచ్చించి అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే..అభివృద్ధి పేరుతో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ విపక్షాలు, హిందూ సంఘాలు..ఆలయ పరిరక్షణ సమితి అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికే ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణ బంద్ తో తమ నిరసన సైతం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఏమంటుందీ..?
తెలంగాణలో అతిపెద్ద ఆలయంగా ఉన్న రాజన్న ఆలయంలో 1979లో జరిగిన పనులే తప్ప అనంతరకాలంలో ఆలయ అభివృద్ధికి ఒక్క పని కూడా జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 జూన్ 18న కేసీఆర్ సీఎం హోదాలో వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ప్రతీ బడ్జెట్‌లో రూ. 100 కోట్ల చొప్పున మొత్తం రూ. 400 కోట్లతో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీడీఏ)ని కూడా ఏర్పాటు వరకే పరిమితమయ్యారు. ఆలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఇదిగో అదిగో అంటూ పాలకులు ఊరిస్తున్న రాజన్న ఆలయ విస్తరణ పనులను పదేళ్ల తర్వాతా మేం చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆలయ విస్తరణ పనులకు గతేడాది నవంబర్ 20న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆలయ విస్తరణ పనులకు వేములవాడ ప్రధాన అర్చకులు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాలయ ఈవో వినోద్ రెడ్డిలు, శృంగేరి పీఠాధిపతులు భారతి తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతి తీర్థ స్వామిలను కలిసి ఆలయ విస్తరణ కోసం ప్లాన్ రెడీ చేశారు. ఇందుకోసం ఇటీవల రూ. 76 కోట్లు విడుదల చేసింది. అలాగే నిత్యన్నదాన సత్రం నిర్మాణం కోసం మరో రూ. 35 కోట్లు కేటాయించింది. వచ్చే నెల నుంచి పనుల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయంలో ప్రధానంగా నిత్య నివేదన మండపం, మహా మండపం, ఆలయ ప్రాకారాలు, నాలుగు రాజగోపురాలు, కోడెల విశ్రాంతి మందిరం, అభిషేక సంకల్ప మండలం, బ్రాహ్మణసత్రం, కల్యాణ మండపం, అద్దాల మండప నిర్మాణం, వేదాశీర్వచన మండపం, అనుస్థాన మండపం, ధర్మ గుండాన్ని పునఃనిర్మించడంతో పాటు క్యూలైన్లను విస్తరించాలని నిర్ణయించారు.
ఆలయ విస్తరణ తీరుపై అభ్యంతరాలు
ప్రధాన ఆలయంలో విస్తరణ పనుల కారణంగా భక్తులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పక్కనే ఉన్న భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన ఆలయంలో నిత్యపూజలు యథావిధిగానే కొనసాగిస్తూ, దర్శనాలను మాత్రం భీమేశ్వరాలయంలో కల్పించనున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఆలయ విస్తరణ సంకల్పం బాగానే ఉన్నప్పటికి విస్తరణ పనుల పేరుతో భక్తులకు రాజన్న దర్శనాలు నిలిపివేస్తామనడం సరికాదంటున్నారు. వచ్చే జూన్ 15నుంచి మూడేళ్ల పాటు భక్తులు లేకుండా పూజలు నిర్వహించడం వల్ల రాజన్న మొక్కులు..విశ్వాసాలు దెబ్బతింటున్నాయని ఆలయ పరిరక్షణ సమితి వాదిస్తుంది. దేశంలోని అయోధ్య, కాశీ, ఉజ్జయిని వంటి దేవాలయాల అభివృద్ధి సందర్భంగానూ భక్తులకు ఇబ్బందికి కల్గించలేదని..అదే రీతిలో ఇక్కడా కూడా దర్శన ఏర్పాట్లు చేయాలని ప్రతిపక్షాలు, ఆలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. అలాగే ఆలయ విస్తరణలో భాగంగా భక్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతీసేలా 1100 సంవత్సరం నాటి పురాతన కోటిలింగాలను.. హిందూ దేవి దేవతలను తొలగించడాన్ని తప్పుబడుతుంది. అదే సమయంలో ఆలయం ప్రాంగణంలోని దర్గాను ఎందుకు తొలగించడం లేదన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తు రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేరుతో బుధవారం పట్టణ బంద్ కూడా నిర్వహించారు. రాజన్న దర్శనాలను యథావిధిగా కొనసాగిస్తూనే అభివృద్ధి పనులు చేపట్టాలని, ఆలయ విస్తరణ పేరుతో ఎలాంటి విగ్రహాలను తొలగించవద్దని డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధి పనుల పేరుతో వేములవాడ ఆలయాన్ని మూసివేయాలని కాంగ్రెస్సర్కారు ప్రయత్నిస్తోందని, విగ్రహాలను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని ఈ సందర్భంగా ఆరోపించారు.
డీపీఆర్ ఎక్కడా..నిధులపై స్పష్టత ఏదీ ?
ఆలయ అభివృద్ధి డీపీఆర్ ప్రభుత్వం బహిర్గతం చేయలేదని.. నిధులు ఎక్కడి నుంచి వెచ్చిస్తారో చెప్పలేదని ప్రతిపక్షాలు, ఆలయ పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అభివృద్ధి పనులకు నిధులపై వివరణ లేకుండానే గుడి దర్శనాలు మూసివేయడాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వమే నిధులు కేటాయించాలని..దేవాలయానికి సంబంధించిన ఆదాయ వనరులను ముట్టుకుంటే సహించేది లేదంటు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు నిధులు లేవంటునే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామంటూ దర్శనాలు నిలిపివేయడంతపై సందేహాలు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వం వద్ధ నిధులుంటే ఇప్పటికే చెపట్టిన రాజన్న అనుబంధ ఆలయం బద్ధి పోచమ్మ ఆలయ పనులు ఎందుకు నత్తనడక సాగుతున్నయంటూ ప్రశ్నిస్తున్నారు. నిధులపై స్పష్టత ఇచ్చి పట్టణంలోని ప్రముఖులు, కులసంఘాలతో చర్చించి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని, నిధుల వివరాలు వెల్లడించాకే పనులు మొదలు పెట్టాలని చెబుతున్నారు. భక్తులకు ప్రధానాలయంలో దర్శనాలు, పూజలు యధావిధిగా కొనసాగిస్తునే ఆలయ అభివృద్ధి చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆలయ అభివృద్ధిపై రాజకీయం తగదు
45ఏళ్ల తర్వాతా రూ. 76 కోట్లతో ఆలయ విస్తరణ పనులు చేపడుతుంటే స్వార్థ రాజకీయాల కోసం విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడుతున్నారు. పదేండ్ల పాటు అధికారంలో ఉండి కూడా బీఆర్‌ఎస్ ఆలయ విస్తరణ చేయలేదని, బీజేపీ కేంద్రం నుంచి ఒక్కపైసా తేలేదని విమర్శించారు. వాళ్లు చేయలేని ఆలయ అభివృద్ధి పనులను తాము చేస్తుంటే అడ్డుతగలడం అన్యాయమని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్ లీడర్లు పట్టణ బంద్‌కు పిలుపునివ్వడంతో కాంగ్రెస్ నాయకులు కరపత్రాల ప్రచారంతో కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.
నిధులే లేనపుడు అభివృద్ధి ఎలా చేస్తారు..?
ప్రభుత్వం దగ్గర నిధులే లేవని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధి ఎలా చేస్తారని ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రశ్నించారు. రాజన్న ఆలయం మూసివేస్తే పరివార దేవతమూర్తుల విగ్రహాలను, కోటిలింగాలను తొలగించకూడదని డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి మ్యాప్ ఇంకా విడుదల చేయకపోవడంతో ..విస్తరణ పనులు ఎలా చేస్తారన్నదానిపై భక్తుల్లో సందేహాలు నెలకొన్నాయన్నారు. 60 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం పనిచేస్తున్నారు తప్ప.. రాజన్నపై భక్తితో కాదని విమర్శించారు.
శాస్త్రయుక్తంగానే ఆలయ విస్తరణ పనులు: వినోద్‌రెడ్డి, ఈవో
వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ పనులు అగమాశాస్ర్తం, శృంగేరి పీఠాధిపతుల అనుమతితోనే జరుగుతాయని ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఆలయాన్ని జూన్ 15న మూసి వేస్తామనడం అబద్ధం అని ఈవో వినోద్‌రెడ్డి చెప్పారు. రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు జరిగే క్రమంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాక వేములవాడ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. రాజన్న ఆలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Srisailam Dam | డేంజర్‌లో శ్రీశైలం డ్యామ్?
Saraswati River Pushkaram: తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం
Kanche Gachibowli lands: పర్యావరణం పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందే : సుప్రీంకోర్టు