ముందుగా ఒక్క మాట. లోక్‌సభలో, ఒక రాష్ట్ర శాసనసభలో, జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ శాసనసభలో, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత శాసనసభలో మరియు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత శాసనసభలో మహిళలకు సీట్ల రిజర్వేషన్, రాజ్యాంగ (నూట ఆరవ సవరణ) చట్టం – 2023 ప్రకారం ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలన్న సూచన సరళమైన, తక్షణ పరిష్కార మార్గం. ఇది జనగణన కాలపరిమితులు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియల సంక్లిష్టతలను అదిగమించడానికి వీలవుతుంది. “డిలిమిటేషన్: దక్షిణాది రాష్ట్రాల సెల్ఫ్ గోల్” శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ రోజు డా. జయప్రకాశ్ నారాయణగారి వ్యాసం చదివాను. “1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి రాష్ట్రానికీ కేటాయించిన సీట్లను 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించారు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆ చర్య తీసుకున్నారు. 2001లో సీట్ల సంఖ్యలో ఆ స్తంభన వ్యవధి ముగిసింది. అయితే రాష్ట్రాలకు కేటాయించిన సీట్లలో యథాతథ స్థితిని మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలని అప్పటి వాజపేయి ప్రభుత్వాన్ని ఒప్పించటంలో నేను కీలకపాత్ర పోషించాను”అని వ్రాశారు. కానీ, ఇప్పుడు ఆయన వైఖరి మార్చుకోవడానికి ప్రస్తావించిన అంశాలు సమర్థనీయంగా లేవు. 1976 నుండి 2025 వరకు యాభై ఏళ్లలో వచ్చిన మార్పు ఏంటో కూడా గమనించాలి కదా!
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కుటుంబ నియంత్రణ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేసిన రాష్ట్రాల్లో జనాభా తగ్గింది, అమలు చేయని రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. ఈ వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన 2011 నాటి జనగణన గణాంకాలే వెల్లడించాయి. తాజాగా మొదలైన 2026 జనగణన గణాంకాలు అధికారికంగా వెళ్ళడైన మీదట రాష్ట్రాల వారిగా జనాభా పెరుగుదల లేదా తరుగుదలపై స్పష్టత వస్తుంది. జనాభా ప్రాతిపదికపై లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) చేయాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచబడింది. దాన్ని పరిగణలో ఉంచుకునే 1976లో ఇందిరాగాంధీ(కాంగ్రెస్), 2001లో వాజ్ పాయి(బిజెపి) ప్రభుత్వాలు దేశ ప్రయోజనాలు – సమస్య సంక్లిష్టత దృష్ట్యా హేతుబద్ధమైన నిర్ణయం తీసుకుని యథాతథ స్థితిని కొనసాగించారు. 1976 – 2001 మధ్య కాలం కంటే 2001-25 మధ్య కాలంలో రాష్ట్రాల వారిగా జనాభా పెరుగుదల – తరుగుదల విషయంలో మరింత ఎక్కువ తారతమ్యాలు ఉండవచ్చు. ఇది విస్మరించలేని వాస్తవం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ సమతుల్యత, సామాజిక న్యాయం, ఈ దృక్కోణంతో రాజకీయాలకు అతీతంగా డిలిమిటేషన్ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ పూర్వరంగంలో డా. జయప్రకాష్ నారాయణగారు ఒక చిట్కా పరిష్కారాన్ని సూచించారు. “కొన్నేళ్లలో వలసలు అసమతుల్యతలను సరిచేస్తాయి. ఇప్పటికే కోట్లాది కార్మికులు దక్షిణాదిన, పశ్చిమ, ఉత్తరాదిన పలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్ని నిర్మిస్తున్నారు, సుస్థిర పరుస్తున్నారు. ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లటాన్ని మనము సులభతరం చేయాలి. వారు ఏ రాష్ట్రంలో ఉన్నా, వారి రాజ్యాంగ హక్కులను గౌరవించాలి. ఎక్కడుంటే అదే వారి రాష్ట్రం కావాలి. అలా వారి జీవితాల్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చాలి. ఆ మార్పు మన జనాభా సవాళ్లను పరిష్కరిస్తుంది. అనేక పెద్ద రాష్ట్రాలు ఇప్పటికే తక్కువ జననాల స్థాయికి చేరుకున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ కూడా కొన్నేళ్లలో వాటిని చేరుకోనున్నాయి. అమెరికా దేశం లోపల భారీ వలసలు సాధారణం. ఈ సంస్కృతి అక్కడి జనాభా సంఖ్యను, ప్రాతినిధ్యాన్ని కొన్నేళ్లలో గణనీయంగా మార్చేసింది” ఇదీ వారు వ్యక్తం చేసిన అభిప్రాయం. అంటే, జనాభా పెరిగిన రాష్ట్రాల నుండి జనాభా తగ్గిన రాష్ట్రాలకు వలసలు పెరిగితే, వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తే, కాలచక్రంలో సమస్య పరిష్కారం అవుతుందని వారి భావన. వినడానికి అద్భుతమైన పలుకులే.
హైదరాబాదు నుండి లండన్ – వాషింగ్టన్ వరకు వలసదారులకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలను, తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వలసదారులను అవమానిస్తూ తన “ట్రూత్ సోషల్”లో షేర్ చేసిన పోస్ట్ ను డా. జయప్రకాష్ నారాయణగారు ఎలా చూస్తున్నారు? అమెరికాలో ఇటీవల 3,300 కేంద్రాలలో జరిగిన “నో కింగ్స్” ర్యాలీల్లో పాల్గొన్న దాదాపు 80 లక్షల మందిలో అత్యధికులు వలసదారులే. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వలసదారుల సమస్య. ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గ్రామాల్లో కూడా బీహార్, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, తదితర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారే వ్యవసాయ పనులు మొదలు చిన్న చిన్న హోటళ్ళలో కార్మికులుగా కూడా పనిచేస్తున్నారు. దక్షిణాది నుండి వలస వెళ్ళిన వారికి వ్యతిరేకంగా 1960-70లలో ముంబాయ్ కేంద్రంగా శివసేన చేసిన విద్వేష పూరితమైన ఆందోళనా చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి ఆందోళనలు చిన్నవో, పెద్దవో దేశంలో పలు రాష్ట్రాలలో జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు దారితీసిన కారణాల్లో ఇది కూడా ఒకటి (నిధులు – నియామకాలు – నీళ్ళు, ఇదే కదా ప్రధాన నినాదం). వాస్తవిక దృష్టి నుండి ప్రజలను మాయా ప్రపంచంలోకి నెట్టేప్రయత్నం చేయకూడదు.
“జనాభా పరంగా సీట్లు కోల్పోతున్న ఏడు రాష్ట్రాలకు ఊహించని బహుమతిని (మోడీ – అమిత్ షా/ మోడీ ప్రభుత్వం) ప్రతిపాదించింది”, ఇదీ, డా. జయప్రకాష్ నారాయణగారి వ్యాఖ్య. లోక్ సభలో మాట్లాడిన సందర్భంలో ప్రధాన మంత్రి మోడీగారు మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షాగారు చెప్పిన మాటలు డా. జయప్రకాష్ నారాయణగారికి విశ్వాసం కలిగించి ఉండవచ్చు. అవి నోటి మాటలే, బిల్లులో ప్రస్తావించలేదు. ఆంతర్యం ఏమిటో! సమకాలీన చరిత్ర ఏం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడానికి నాటి ప్రధాన మంత్రి డా. మన్మోహన్ సింగ్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు “ప్రత్యేక తరగతి హోదా” కల్పిస్తామని వాగ్దానం చేస్తూ వ్రాత పూర్వక ప్రకటన పెద్దల సభలో చదివి వినిపించారు. సభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్తీకరణ చట్టం – 2014లోనే కడప ఉక్కు కర్మాగారం, ఓడ రేవు, వెనుకబడిన రాయలసీమ – ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి ప్యాకేజీ, రాజధాని నిర్మాణానికి – మౌలిక సదుపాయాల కల్పనకు సంపూర్ణంగా ఆర్థిక తోడ్పాటు, పారిశ్రామికాభివృద్ధికి రాయితీలు, వగైరా వాగ్దానలు చేశారు. ఆచరణలో వీటన్నింటిని ఎగొట్టిన మోడీ ప్రభుత్వంపై డా. జయప్రకాష్ నారాయణగారికి ఎంత విశ్వాసమో! “వాగ్దానం ఎందరో అవివేకులను తృప్తి పరుస్తుంది”, ఈ తెలుగు సామెత గుర్తుకు వచ్చింది. దానికి ఒక సవరణ “మేకవన్నె పులి తరహా రాజకీయ నేతల వాగ్దానాలు మేధావులను కూడా సంతృప్తి పరుస్తాయి”.
మహిళా రిజర్వేషన్స్ అమలు అంశాన్ని “డిలిమిటేషన్”తో ఎందుకు ముడిపెట్టారు? ఇదే అసలు ప్రశ్న. దానికి డా. జయప్రకాష్ నారాయణగారి వ్యాసంలో సముచితమైన ప్రస్తావనే లేదు. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 334ఏ స్థానంలో, ఈ క్రింది అనుచ్ఛేదం చేర్చబడుతుంది, అదేదనగా:–– 334ఏ (1) ఈ భాగం లేదా భాగం VIII లోని పూర్వ నిబంధనలలో ఏమున్నప్పటికీ, లోక్‌సభలో, ఒక రాష్ట్ర శాసనసభలో, జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ శాసనసభలో, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత శాసనసభలో మరియు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత శాసనసభలో మహిళలకు సీట్ల రిజర్వేషన్‌కు సంబంధించిన ఈ రాజ్యాంగ నిబంధనలు, ఈ ప్రయోజనం కోసం నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) ప్రక్రియ చేపట్టిన తర్వాతే అమలులోకి వస్తాయి”, ఈ ప్రతిపాదిత రాజ్యాంగ సవరణనే కదా! లోక్ సభ తిరస్కరించింది.
చట్ట సభల నాణ్యతా ప్రమాణాల మాటేంటి? “రాశి కంటే వాసి మిన్న”, అన్నది ఒక తెలుగు సామెత. ప్రజల్లో చట్టసభల పనితీరుపై విశ్వాసం బాగా సన్నగిల్లింది. చట్టసభల విశ్వసనీయత పునరుద్ధించడంపైనే భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ భవిష్యత్తు ఆధారపడి ఉంది. చట్టసభలకు ఎన్నిక అవుతున్న సభ్యుల నాణ్యతా ప్రమాణాలు అత్యంత నాశిరకంగా ఉన్నాయి. సభ్యుల నైతికత ప్రశ్నార్థకంగా తయారయ్యింది. లోక్ సభ సభ్యుల సంఖ్యను 550 (రాజ్యాంగం గరిష్టంగా అనుమతించిన సంఖ్య) నుండి 850కి పెంచడం వల్ల “మంది ఎక్కువైతే మజ్జిగ పలచన” అన్న సామెతగా లోక్ సభ పనితీరు మరింత దిగజారుతుందేమోనన్న భావన వ్యక్తమవుతున్నది. సమగ్ర ఎన్నికల సంస్కరణలు అత్యవసరం. దామాషా ఎన్నికల విధానంతో సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. 2023లోనే చట్టం చేసిన 33% మహిళా రిజర్వేషన్స్ అమలును డిలిమిటేషన్ తో పాటు లోక్ సభ సభ్యుల సంఖ్య పెంపుదలతో ముడిపెట్టడంలోని మతలబు ఏంటి? దానిపై డా. జయప్రకాశ్ నారాయణగారి డొంకతిరుగుడు సమర్థన ఆశ్చర్యం కలిగించింది.
- టి. లక్ష్మీనారాయణ
