విధాత, హైదరాబాద్ : భారత్ ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాలకు వరం అని.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని తయారు చేస్తాం.. జూన్ రెండులోపు ఫ్యూచర్ సిటీ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్ లో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశంలో నాలుగో అతి పెద్ద నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుందన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంత సులభం కాదు అని.. అందరూ కలిసి పనిచేస్తేనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం సాధ్యం అన్నారు. ఫ్యూచర్ సిటీలో కలపాలని చుట్టు గ్రామాలు డిమాండ్ చేస్తున్నాయని.. ప్రజల్ని అభివృద్ధి భాగస్వాములను చేయడమే మా లక్ష్యం అని చెప్పారు.
గతంలో హైటెక్ సిటీ అంటే ముందు అంతా అపహాస్యం చేశారని..ఇప్పుడు ప్రపంచ స్థాయి ఐటీ ఐకానిక్ సెంటర్ గా హైదరాబాద్ కు తలమానికంగా నిలిచిందని రేవంత్ గుర్త చేశారు. ఏ నగరానికి లేనివిధంగా ఔటర్ రింగ్ రోడ్డు ఉందని, ఇక్కడే కోవిడ్ వాక్సిన్లు, యుద్ద విమానాల సర్వీస్ సెంటర్లు ఉణ్నాయని తెలిపారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని, రైతులు సహకరిస్తే రెండేళ్లలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్నారు.
శంషాబాద్ నుంచి ముంబై వయా పూణే వరకు బుల్లెట్ ట్రైన్ రాబోతుందని, శంషాబాద్ లో అతిపెద్ద బస్ టెర్మినల్ నిర్మిస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి వాయిదా పడితే అంచనాలు పెరుగుతాయి అని, కాలుష్య కారకమైన ఫార్మాసిటీని వ్యతిరేకించి ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చాననని, ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అని.. నేను ఫ్యూచర్ సిటీ కోసం పనిచేస్తూనే ఉంటానన్నారు. కేసీఆర్ కుటుంబం ఏడుస్తుంటే నా చెవులకు వినసొంపుగా ఉంటుందని, ఫ్యూచర్ సిటీ కడతామంటే వాళ్లు ఏడుస్తున్నారని, అధికారం కోల్పోయిన బాధలో వాళ్లు ఉన్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో పడుకున్నారని, మారీచుడు, సుభాహుడు జనంలో తిరుగుతున్నారని హరీశ్, కేటీఆర్ లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఈ కార్యక్రమంలో హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
