2025 లో 4 లక్షల ఉద్యోగాలు ఉఫ్…కొంపలు కూల్చుతున్న ఏఐ

ఏఐ ప్రభావంతో 2025లో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. రానున్న కాలంలో మరింత కోతలు ఉండొచ్చని నిపుణుల హెచ్చరిక.

ప్రపంచంలో ప్రఖ్యాత ఐటీ కంపెనీలు సాఫ్ట్ వేర్ నిపుణులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) రాకతో ఐటీ కంపెనీల ముఖచిత్రమే మారిపోతున్నది. ఏ రోజు ఎంత మంది ఉద్యోగాలు తొలగిపోతాయోనన్న బెంగ ఐటీ నిపుణులను వెంటాడుతున్నది. గడచిన సంవత్సరం 2025 లో ప్రపంచ వ్యాప్తంగా 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపించారు. యూపీఎస్, ఒరాకిల్, అమెజాన్, మెటా, ఇంటెల్ మైక్రోసాఫ్ట్ కంపెనీలతో పాటు పలు సంస్థల్లో దశల వారీగా ఏడాది కాలంలో నాలుగు లక్షల మంది పై వేటు వేశారు.

ఒకప్పుడు ఐటీ సంస్థల్లో ఉద్యోగం అంటే ఎగిరి గంతేసేవారు. గత మూడు నాలుగు సంవత్సరాలు సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనే ఊగిసలాటలో లక్షలాది మంది కొట్టుమిట్టాడుతున్నారు. ఏ రోజు మెస్సేజ్ లేదా మెయిల్ వస్తుందోనంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గడచిన ఎనిమిది సంవత్సరాలలో ముప్పై లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు కొత్తగా ఉద్యోగాలు కల్పించిన ప్రముఖ కంపెనీలు ఏ సంవత్సరం లేని విధంగా 2025 సంవత్సరంలోనే విడతల వారీగా నాలుగు లక్షల మంది ఐటీ నిపుణులను ఇంటికి పంపించారు. ఈ పరిస్థితులను చూస్తుంటే మున్ముందు ఐటీ కంపెనీలలో నియామకాలు గతంలో మాదిరి ఉండవని, జీతాలు కూడా ఆకర్షనీయంగా ఉండవని అంటున్నారు. ప్రపంచంలోని పలు ఐటీ కంపెనీలు ఆర్టిపీషియల్ ఇంటెలీజెన్స్ పై పెద్ద ఎత్తున పెట్టుబడులు వెచ్చిస్తున్నాయి. వేయి కోట్లు ఐదు వేల కోట్లు కాకుండా లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. పెట్టుబడుల కోసం తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను ఇబ్బడి ముబ్బడిగా తప్పిస్తున్నారు.

ఏఐ ని అందుకోలేకపోతే భవిష్యత్తులో ఇతర కంపెనీలతో పోటీపడలేమనే భావనతో ఒక కంపెనీ తరువాత మరో కంపెనీ కోతల బాట పట్టాయని ఐటీ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యోగులను తగ్గించుకోవడమే కాదు సంస్థ సాంకేతిక స్వరూపాన్ని కూడా మార్చుకుంటున్నారు. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం 2026 సంవత్సరంలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాల కోత ఉండనున్నది. ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి. ప్రముఖ సంస్థల్లో అమెజాన్ 16వేల మందిని, మెటా 8వేల మందిని తగ్గించుకుంటుండగా, మైక్రో సాప్ట్ 8,750 మందిని స్వచ్ఛందంగా ఇంటికి పంపించేందుకు ఉద్యోగులను సిద్ధం చేసింది. ఉద్యోగుల తొలగింపు ద్వారా మిగులున్న నిధులను ఏఐ పై పెద్దఎత్తున పెట్టుబడిగా పెడుతున్నాయి. సాంప్రదాయంగా వస్తున్న వైట్ కాలర్ ఉద్యోగాలకు వెచ్చిస్తున్న నిధులను ఇలా దారి మళ్లిస్తున్నారు. ఏఐ రంగంలో అనిశ్చిత పరిస్థితి ఉండడంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్పులు ఇచ్చేందుకు నిరాసక్తత కనబరుస్తున్నాయి. అయినప్పటికీ కంపెనీలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు పోతుండడం విశేషం. కంపెనీ పునర్ నిర్మాణంలో భాగంలో ఈ ఏడాది ప్రారంభంలో ఒరాకిల్ 12వేల మందిని భారత్ లో, దేశ వ్యాప్తంగా 30వేల మంది ఊడబెరికింది. అన్ని సంస్థలూ ఏఐ వైపు పరుగెత్తడం మూలంగా సంస్థాగత మార్పులు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఏఐ ద్వారా సామర్థ్యం, ఆటోమేషన్ ను పెంపొందించుకునే పనిలో పలు ప్రముఖ సంస్థలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాలకు వరం : సీఎం రేవంత్ రెడ్డి
అమరావతి-హైదరాబాద్ బుల్లెట్ రైలు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Latest News