Amazon LayOffs : ఊహించినట్టే జరిగింది.. 16 వేల మందిపై వేటు వేసిన అమెజాన్‌

అమెజాన్‌లో మరో 16,000 మందికి ఉద్వాసన! 30 వేల ఉద్యోగాల కోత లక్ష్యం పూర్తి. ఏఐ ప్రభావంతో సంస్థ పునర్నిర్మాణం.. ప్రభావితం కానున్న ఏడబ్ల్యూఎస్, రిటైల్ విభాగాలు.

Amazon LayOffs : ఊహించినట్టే జరిగింది.. 16 వేల మందిపై వేటు వేసిన అమెజాన్‌

ఊహించినట్టే జరిగింది. ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) భారీగా లేఆఫ్స్‌ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 16 వేల మందిని తొలగించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఏఐ ఒత్తిడిలో వ్యాపార పునర్‌నిర్మాణంలో భాగంగా ఈ తొలగింపులు చేపట్టినట్టు సంస్థ తెలిపింది. సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బెత్‌ గలెట్టీ లేఆఫ్స్‌ గురించి ప్రకటన చేశారు.

ఇది కష్టమైనప్పటికీ.. సంస్థను బలోపేతం చేసేందుకు, అనవసరమైన లేయర్‌లను తగ్గించి, యాజమాన్య బాధ్యతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో తమ భవిష్యత్తుకు అవసరమైన వ్యూహాత్మక విభాగాల్లో పెట్టుబడులు, నియామకాలు కొనసాగిస్తామని బెత్ గెల్లెట్టి తెలిపారు. ఇక ఉద్యోగం కోల్పోయిన వారికి అండగా ఉంటామని అమెజాన్ హామీ ఇచ్చింది. ప్రభావితమైన ఉద్యోగులు అంతర్గతంగా కొత్త ఉద్యోగం వెతకడానికి 90 రోజుల సమయం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత కూడా ఉద్యోగం దొరకని వారికి సెవరాన్స్ ప్యాకేజీ, ఆరోగ్య బీమా, ఔట్‌ప్లేస్‌మెంట్ సేవలు వంటి ప్రయోజనాలను అందిస్తామని స్పష్టం చేసింది.

మూడు నెలల్లోనే రెండోసారి..

కాగా, మూడు నెలల వ్యవధిలో కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల కోత విధించడం ఇది రెండోసారి. 2025 అక్టోబరు నెలలో అమెజాన్ సుమారు 14,000 కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించింది. అప్పట్లో ప్రకటించిన 30,000 ఉద్యోగాల కోత లక్ష్యంలో ఇది సగం మాత్రమే. ఇప్పుడు మిగతా సగం సిబ్బందిని తొలగించింది. గతంలో లేఆఫ్స్‌కు గురైన వారికి కల్పించిన 90 రోజుల గడువు సోమవారంతో ముగిసిన నేపథ్యంలో మిగతా లేఆఫ్స్‌ ప్రక్రియను సంస్థ పూర్తి చేస్తోంది.

ఈ విభాగాలపై ప్రభావం..

తాజా సమాచారం ప్రకారం.. ఈ లేఆఫ్స్ ప్రభావం అమెజాన్‌లోని కీలక విభాగాలపై పడనుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్ విభాగం, ప్రైమ్ వీడియో, హ్యూమన్ రిసోర్సెస్ (పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ) విభాగాలపై పడనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్‌ ఇదే

తాజా లేఆఫ్స్‌ ప్రకటనతో సంస్థ గతంలో చెప్పిన 30,000 ఉద్యోగాల కోత పూర్తయినట్టే. దీంతో అమెజాన్ మూడు దశాబ్దాల చరిత్రలోనే అతిపెద్ద తొలగింపు ఇది. 2022లో కంపెనీ సుమారు 27,000 మందిని తొలగించిన విషయం తెలిసిందే. ఇది ఆ కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్. ఆ తర్వాత గతేడాది అక్టోబర్‌లో 14 వేల మందిపై వేటు వేసింది. ఇప్పుడు 16వేల మందిని తొలగిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 15.8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వేర్‌హౌస్‌లు, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Nalgonda Municipal Corporation Elections : నల్లగొండ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ !
MSG | బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్.. ఓవర్సీస్‌లోనూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రభంజనం