అండర్‌గ్రాడ్యుయేట్స్‌కు నెరవేరని 5 లక్షల వార్షికవేతనం కల.. తాజా అధ్యయనంలో కీలక అంశాలు
నెలకు కనీసం 40వేల జీతాన్నిచ్చే కొలువు సంపాదించేందుకు అండర్‌గ్రాడ్యుయేట్స్ నానాయాతనలు పడుతున్నారు. Unstop విడుదల చేసిన Talent Report 2026లో ఇలాంటి అనేక మంది విద్యార్థుల ఘోష వినిపిస్తోంది. ఈ నివేదిక ప్రకారం.. 73 శాతం మంది ఫ్రెషర్స్.. 5 లక్షలకుపైగా వార్షిక జీతాన్ని ఆశిస్తుంటే.. వాస్తవంగా 40 శాతం మందికే అది దక్కుతోంది.
మంచి టాలెంటెడ్ విద్యార్థి. డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడు. అది కూడా మంచి పేరున్న కాలేజీ నుంచి! కానీ.. సరైన జాబ్‌లో కుదురుకోవడం సాధ్యం కావడం లేదు. అన్నీ చిన్న జీతాల జాబుల ఆఫర్లే చేతిలో ఉన్నాయి. ఈ సమస్య ఒక్కరిదో, పది మందిదో కాదు.. అనేక మంది తమ డిగ్రీకి సరిపోయే జీతం ఇచ్చే ఉద్యోగం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అంత కష్టపడి చదివింది ఈ మాత్రం జీతం కోసమేనా? అనే ఆవేదన చెందుతున్నారు. Unstop విడుదల చేసిన Talent Report 2026లో ఇలాంటి అనేక మంది విద్యార్థుల ఘోష వినిపిస్తోంది.
ఈ నివేదిక ప్రకారం.. 73 శాతం మంది ఫ్రెషర్స్.. 5 లక్షలకుపైగా వార్షిక జీతాన్ని ఆశిస్తుంటే.. వాస్తవంగా 40 శాతం మందికే అది దక్కుతోంది. 84 శాతం మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇంకా ప్లేస్‌మెంట్ లభించనేలేదు. 85 శాతం మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాల్లేక ఖాళీగా ఉంటున్నారు. 9 లక్షలకుపైగా వార్షిక వేతనంతో ఉద్యోగం కేవలం 14 శాతం మందికి మాత్రమే దక్కుతున్నది. అంటే.. కలలు ఎంత పెద్దగా ఉన్నా.. అవకాశాలు మాత్రం చాలా పరిమితంగానే ఉంటున్నాయని ఈ నివేదిక గణాంకాలు పేర్కొంటున్నాయి.
గొప్ప కాలేజీలో చదివినంత మాత్రాన.. మంచి మార్కులు సాధించినంత మాత్రాన కంపెనీలు ప్లేస్‌మెంట్స్ ఇవ్వడం లేదని దీని ద్వారా అర్థమవుతున్నది. 94 శాతం కంపెనీలు కాలేజీకి ఉన్న గొప్ప పేరుకంటే.. దానిలో చదివిన విద్యార్థికి ఉన్న నైపుణ్యాలను చూస్తున్నాయని నివేదిక పేర్కొంటున్నది. 64 శాతం మంది హెచ్‌ఆర్‌లు ఏఐ, డాటా, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీ వంటి స్కిల్స్ ఉన్నవారిని ప్రీమియం టాలెంట్‌గా పరిగణిస్తున్నాయని తెలిపింది. అంటే.. డిగ్రీకంటే.. స్కిల్స్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇదే సమయంలో ఏఐ అనేది కూడా ప్లేస్‌మెంట్స్‌ను ప్రభావితం చేస్తోంది. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 80శాతానికి పైగా విద్యార్థులు ఏఐ వాడుతున్నప్పటికీ.. 55 శాతం మంది వరకూ దానిపై ఎలాంటి శిక్షణ లేదు. కంపెనీలు కూడా ఏఐ ఉపయోగించి స్క్రీనింగ్స్, ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. అంటే.. విద్యార్థులు ఏఐ ద్వారా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే.. అదే ఏఐని కంపెనీలు ఉపయోగిస్తూ.. వారిని వడపోస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిస్థితిని అధిగమించాలంటే.. ఏఐ, డాటా తదితర నైపుణ్యాలు సాధించి.. కొంత అనుభవం సంపాదించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిగ్రీ ఉన్నప్పటికీ నైపుణ్యాలు సాధిస్తేనే ఉద్యోగావకాశాలు మెరుగైన జీతాలతో లభిస్తాయని అంటున్నారు. అదే సమయంలో కంపెనీలు కూడా వాస్తవాల ఆధారంగా రిక్రూట్‌మెంట్స్ చేయగలిగితే.. ఈ గ్యాప్ కొంత తగ్గే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram