మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన చట్టాన్ని వేగంగా అమలు చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నట్టు గత కొద్ది వారాలుగా మోదీ ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందు (14.4.2026) ఎంపీలకు అందించిన డ్రాఫ్ట్ బిల్లులను పరిశీలిస్తే.. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడం కంటే.. దానిని దాటుకుని మొత్తంగా లోక్‌సభ కూర్పులోనే అత్యంత కీలకమైన మార్పులను తీసుకురావాలని ప్రభుత్వం చేస్తున్న ఆలోచన బట్టబయలైందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో మొత్తం మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అవి… 1) 2026 డీలిమిటేషన్ బిల్లు, 2) 2026 రాజ్యాంగ 131వ సవరణ బిల్లు, 3) 2026 కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు.
ప్రగతి సాధించిన దక్షిణాదికి శిక్ష
ప్రభుత్వం ప్రతిపాదించబోతున్న ఈ బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందితే.. 2011 జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు దారి తీస్తుంది. లోక్‌సభలో ప్రస్తుత ప్రాతినిధ్యం 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉన్నది. ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకున్న పక్షంలో దక్షిణాది రాష్ట్రాలు పెద్దమొత్తంలో నష్టపోయే అవకాశం ఉందన్న ఆందోళనలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో 1971 తర్వాత జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో భాగంగా తక్కువ జననాల రేటు కలిగిన రాష్ట్రాలకు అప్పట్లో ప్రత్యేక ప్రయోజనాలు కల్పించారు. వాటిని అందుకున్న దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణకు కృషి చేశాయి. కానీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం అక్కడి పేదరికం, నిరక్షరాస్యతతో జనాభా రేటు నియంత్రణలోకి రాలేదు. ఇప్పుడు అదే అన్ని రాష్ట్రాల నూతన ప్రాతినిధ్యాన్ని నిర్దేశించబోతున్నది. అంటే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు జనాభాను తగ్గించుకున్న దక్షిణాది రాష్ట్రాలు అవి చేసిన మంచిపనికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడింది.
ఉత్తరాదికి అయాచిత లబ్ధి
జనాభా ప్రాతిపదికన చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన అధిక జనాభా కలిగిన ఉత్తర, మధ్య భారతదేశంలోని రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల విషయంలో అయాచిత లబ్ధిని చేకూర్చుతాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దక్షిణాదితో పోల్చితే ఉత్తరభారత దేశ రాష్ట్రాల్లోనే బీజేపీకి ఎక్కువ పట్టు ఉన్న విషయాన్ని కూడా అవి ప్రస్తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను బలంగా ఉన్న రాష్ట్రాల్లో మరిన్ని సీట్లు పెంచుకోవడం ద్వారా మొత్తంగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో, నిధుల పంపిణీలో ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనం కల్పించేలా మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని మండిపడుతున్నాయి.
లోక్‌సభలో పెరుగనున్న సభ్యులు
రాజ్యాంగ 131వ సవరణ బిల్లును చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే 2023 మహిళా రిజర్వేషన్ చట్టంపై రూపొందించారు. ఇది లోక్‌సభలో సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెంచేందుకు ఉద్దేశించారు. ఇందులో 815 సీట్లు రాష్ట్రాల నుంచి 35 సీట్లు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉంటాయి. ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది సభ్యులు ఉన్నప్పటికీ.. గరిష్ఠంగా 550 వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నది. అన్నింటికంటే ముఖ్యమైన అంశం.. ఈ బిల్లు.. 2023 మహిళా రిజర్వేషన్ల చట్టం ప్రాతిపదికను సమూలంగా మార్చివేస్తున్నది. దీని ప్రకారం.. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మూడొంతుల సీట్లు అంటే.. 33 శాతం కేటాయించాల్సి ఉంటుంది. అయితే.. ఈ రిజర్వేషన్లు కూడా వాస్తవానికి జనగణన పూర్తయిన తర్వాత మాత్రమే అమల్లోకి రావాల్సి ఉన్నది. ప్రస్తుతం జనగణన ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఇది 2027 నాటికి పూర్తి అవుతుందని భావిస్తున్నారు. కానీ.. అంతకుముందే మహిళా రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో కేంద్ర హడావుడి పడుతున్నది. 1971 జనగణన ప్రాతిపదికన లోక్‌సభ సీట్లను ఫ్రీజ్ చేసిన నిబంధనను తొలగించేందుకు రాజ్యాంగంలోని 82వ అధికరణంలో మార్పులు చేయాలని రాజ్యాంగ 131వ సవరణ బిల్లులో ప్రతిపాదించడం గమనార్హం.
2011 జనాభా లెక్కలే ప్రామాణికం?
డీలిమిటేషన్ కసరత్తుకు ఏ జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారనే విషయంలో డీలిమిటేషన్ బిల్లులో కేంద్రం స్పష్టతనివ్వలేదు. ‘తాజాగా ప్రచురితమైన జనాభా లెక్కల ప్రాతిపదికన’ అని మాత్రమే కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. దాని అర్థం.. ఇప్పటికే ప్రచురితమైన జనాభా లెక్కలు 2011 నాటివే. అంటే.. ఇవే లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించనున్నారనేది స్పష్టమవుతున్నదనేది ప్రతిపక్షాల అభ్యంతరం.
సాధారణ మెజార్టీతో సరి
ప్రస్తుత డీలిమిటేషన్‌ను ఏ జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టాలనే విషయం రాజ్యాంగ సవరణ బిల్లుపైనే ఆధారపడి ఉన్నది. ఈ బిల్లు ఆమోదానికి పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం. కానీ.. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు సింపుల్ మెజార్టీ సరిపోతుందని పేర్కొంటున్నది. అంటే.. ఎలాంటి రాజ్యాంగ సవరణ బిల్లు అవసరం లేకుండానే ఎన్డీయే ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును ఏకపక్షంగా ఆమోదించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.
తీవ్రంగా నష్టపోనున్న దక్షిణాది రాష్ట్రాలు
2011 జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టబోయే డీలిమిటేషన్ కసరత్తు.. లోక్‌సభలో వివిధ రాష్ట్రాల సీట్ల సంఖ్యను మార్చివేయనున్నది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల సంఖ్యను గణనీయంగా తగ్గించబోతున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు స్వల్పంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియతో తాము తీవ్ర స్థాయిలో నష్టపోతామని, ఉత్తరాది, మధ్యభారత రాష్ట్రాలు గరిష్ఠంగా ప్రయోజనం పొందుతాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
హామీ లేదు : యోగేంద్ర యాదవ్
ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడున్న నిష్పత్తి యథాతథంగా కొనసాగుతుందనే హామీ ఏదీ ప్రతిపాదిత బిల్లులో లేదని ప్రముఖ సెఫాలజిస్ట్, రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్ మంగళవారం ఒక ట్వీట్‌లో ఎత్తిచూపారు.
