పురాతన భావాలు కాలగర్భంలో కలిసిపోక తప్పదు!
లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 850కి పెంచాలనే ఎజెండా వెనుక, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే కుట్ర దాగి ఉందనే బలమైన అనుమానాలు కూడా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రల్లో ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాలకు అదనంగా 50% పెంచుతామని నాలుకపై తేనే రాశారు. అదే దామాషాలో దేశంలోని అన్ని రాష్ట్రలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు 50% స్థానాలు పెంచితే 815కు సంఖ్యను పెంచితే సరిపోతుంది. మరి 850కి ఎందుకు పెంచాలనుకున్నారో!
(టి. లక్ష్మీనారాయణ)
చూడండి! మనుస్మృతిని ఆచరించాలని వాదించేవారే, నేడు మహిళా సాధికారత కోసం అత్యున్నత చట్ట సభలో “న్యాయవాదులు”గా నిలబడ్డారు. శభాష్! అనాలని ఉంది. కానీ, సమస్య మూలాల్లోకి వెళితే రేఖా మాత్రంగా అనుమానాలను రేకెత్తిస్తున్నది. చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ కల్పించే బిల్లును 2023లోనే పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడింది. కానీ, మోదీ ప్రభుత్వం ఆ చట్టాన్ని గజిట్ లో ప్రకటించి, అమలు చేయకుండా మూడేళ్ళ పాటు ఇనుప బీరువాలో దాచిపెట్టింది. తాజాగా మహిళా రిజర్వేషన్ చట్టం అమలును, లోక్ సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో ముడిపెట్టి రాజ్యాంగ సవరణకు విఫల ప్రయత్నం చేసి, ఘోరపరాభావం చెందిన కొద్ది గంటల్లోనే, మహిళా రిజర్వేషన్ చట్టానికి సంబంధించిన గజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇది మోడీ ప్రభుత్వానికే చెల్లింది. మహిళల హక్కుల పట్ల చిత్తశుద్ధికి ఇదొక ప్రబల నిదర్శనంగా పరిగణించవచ్చునేమో!
లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 850కి పెంచాలనే ఎజెండా వెనుక, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే కుట్ర దాగి ఉందనే బలమైన అనుమానాలు కూడా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రల్లో ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాలకు అదనంగా 50% పెంచుతామని నాలుకపై తేనే రాశారు. అదే దామాషాలో దేశంలోని అన్ని రాష్ట్రలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు 50% స్థానాలు పెంచితే 815కు సంఖ్యను పెంచితే సరిపోతుంది. మరి 850కి ఎందుకు పెంచాలనుకున్నారో! 2011 జనాభా లెక్కలు, అటుపై 2026 జనాభా లెక్కలంటూ చేసిన ప్రస్తావన, త్రిసభ్య కమిటీ ఏర్పాటు లోగుట్టెంటో! లోక్‌సభ సభ్యుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించిన మోదీ ప్రభుత్వం, దానికి అనుగుణంగా రాజ్యసభ సభ్యుల సంఖ్యను పెంచడం గురించి ఎందుకు ఆలోచించలేదో! బహుశా దీని వెనుక ఒక దుష్ట ప్రణాళిక ఉండి ఉండవచ్చునేమో! జనాభా లెక్కలను పనిముట్టుగా వాడుకుని, తమకు గట్టి పట్టున్న రాష్ట్రాల్లో 50% కంటే మించి లోక్ సభ సభ్యుల సంఖ్యను పెంచుకుని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని (ఉత్తరాది ఆధిక్యతతో) నిలబెట్టుకుని, ఉభయ సభలు (లోక్ సభ – రాజ్యసభ) కలిపి మూడింట రెండు వంతుల ఆధిక్యాన్ని సంపాదించుకుంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చేయవచ్చన్న దురాలోచన ఉండి ఉండవచ్చునేమో!
రాజ్యాంగ పీఠికలో పొందుపరచబడిన “లౌకిక” మరియు “సామ్యవాద” అనే పదాలు ‘కాషాయ’ భావజాల ప్రతిపాదకులకు నిద్రపట్టకుండా చేస్తున్నాయేమోనన్న సందేహం లేకపోలేదు! భారతదేశం వైవిధ్యానికి నిలయం. ప్రజాస్వామ్యం – మత సామరస్యత – సమాఖ్య వ్యవస్థపైనే ఆధారపడి దేశ ఐక్యత – సమైక్యత – సార్వభౌమత్వం పరిరక్షించబడతాయి. నిజమైన ప్రజాస్వామ్యవాదులు – దేశ భక్తులు కాస్త రాజకీయ విజ్ఞత ప్రదర్శిస్తూ, అప్రమత్తంగా వ్యవహరించకపోతే, మాయ మాటలు – నినాదాలతో మభ్యపెట్టి “రహస్య ఎజెండా”ను అమలు చేయడానికి కొత్త కొత్త రాజకీయ ఎత్తుగడలు – వ్యూహాలతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తారు. ప్రజలను ప్రలోభపెట్టి తమ వైపు మళ్ళించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అధికారమే పరమావధిగా భావించే అవకాశవాద రాజకీయ పార్టీలకు – నేతలకు, రాజకీయాలను రక్షణ కవచంగా వాడుకుంటున్న నేరపూరిత – అనైతిక – స్వార్థపరులకు మన సమాజంలో కొదువ లేదు. ప్రజల చైతన్యం – సమిష్టి బలం మాత్రమే దేశానికి నిజమైన రక్షణ కవచంగా పనిచేస్తాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram