తెలంగాణలో అప్పుడే బీఆర్ఎస్ నేతల ‘అధికార’ ఆశలు

వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని బీఆరెస్‌ అధినేత ఘంటాపథంగా చెప్పడం పార్టీ క్యాడర్‌ను ఉత్తేజపర్చేందుకా? లేక నిజంగానే ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై ముఖం మెత్తిందనే అభిప్రాయంతోనా? ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ప్రజలు నిజంగానే కాంగ్రెస్‌ పాలనను వ్యతిరేకిస్తున్నట్టయితే ఏ ఒక్క ఎన్నికలోనూ బీఆరెస్‌కు సానుకూలత ఎందుకు వ్యక్తం కావడం లేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావడంపై బీఆర్ఎస్ అధినాయకత్వం భారీ ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మూడేళ్ళకే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని, వచ్చేసారి తిరిగి బీఆర్ఎస్ అధికారానికి రావడం ఖాయమని ఇప్పటి నుంచే ప్రకటిస్తున్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాప్రభుత్వం కాదు… పనికిరాని ప్రభుత్వం. ఈ సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. మళ్లీ గెలుపు మనదే.. నో డౌట్’ అంటూ కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్ వేదికగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో భిన్నమైన చర్చ సాగుతోంది. పదేళ్ళు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు మొదటి నుంచీ ప్రతిపక్షంలో ఇముడలేకపోతున్నారని, అందుకే ఆరంభం నుంచే అధికారం కోసం ఆరాటపడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. అధికారాన్ని అనుభవించేందుకు ముందుండే కేసీఆర్, ప్రతిపక్ష నేతగా తన పాత్ర నిర్వహించేందుకు సిద్ధపడటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ కూడా ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారని గుర్తుచేస్తున్నారు. ఇది ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేననే వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగానే ఉన్నాయి. ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత పెరిగినప్పటికీ, అది బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారలేదని, బీఆర్ఎస్ పదేళ్ళ పాలనను ప్రజలు అప్పుడే మరిచిపోలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. నిజంగానే కాంగ్రెస్‌పై అంత తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే ‘బీఆర్ఎస్‌కు ఎక్కడా అనుకూల’ ఫలితాలు ఎందుకు రావడం లేదనే ప్రశ్న వస్తున్నది.

సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు.. అధికార పార్టీ విఫలమైందంటూ విమర్శలు గుప్పిస్తూ ఉంటాయి. దాన్నొక రాజకీయ ఎత్తుగడగా అనుసరిస్తూ ఉంటారు. బీఆరెస్‌ విషయానికి వస్తే.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, ప్రత్యేకించి రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జీర్ణం కాని విషయమనే అభిప్రాయాలు ముందు నుంచీ ఉన్నాయి. రేవంత్‌ను సీఎం సీట్లో చూడటానికి ఇష్టంలేకే కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదనే విమర్శలూ వినిపిస్తుంటాయి. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు హామీలతో ప్రజలను వంచించారని, ప్రజలు కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నారని.. ఇప్పటికీ చెబుతూ వస్తున్న నాయకులు.. ప్రజాభిప్రాయాన్ని కించపరుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారంటూ కొత్త పల్లవిని గులాబీ నాయకత్వం ఎత్తుకుంటున్నది. దాని సంగతిని పక్కనపెడితే.. బీఆరెస్‌ పాలనలో చోటు చేసుకున్న లోపాలపై, జరిగిన పొరపాట్లపై బీఆరెస్‌ నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకుంటుందా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చేసారి మాదే అధికారం అంటూ తొలి రోజు నుంచీ బీఆర్ ఎస్ ‘రాజకీయ’ దాడిని తీవ్రం చేయడం ఆసక్తికర పరిణామంగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై అంచనాకు వచ్చే ముందు రాజకీయ పరిశీలకులు కూడా ఆచితూచి స్పందించాల్సి వస్తోందంటున్నారు.

భరోసా కోసమా? వ్యతిరేకత పెరిగిందా?

మూడేళ్ళ తర్వాత, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ముఖ్యుల సమావేశంలో మాట్లాడుతూ వారిలో మనోధైర్యాన్ని నింపడమే కాకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత కూడా కేసీఆర్‌కే ఉందనేది వాస్తవం. నాయకులు, కేడర్‌లో విశ్వాసం పెంచేందుకే కేసీఆర్ ఈ మాటలు మాట్లాడారా? లేక రాష్ట్రంలో నిజంగానే కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందా? అనే చర్చ కూడా సాగుతోంది. కాంగ్రెస్ ముఖ్య నాయకుల్లో అనైక్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. దానికి తోడు ఆర్థిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతున్నది. ఈ సమయంలో పాలనపై పట్టు సాధించుకోలేక, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేక ప్రభుత్వ పెద్దలు సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది. అయితే.. కాంగ్రెస్‌పై భారీగా ఆశలు పెట్టుకున్న ప్రజలు అవి నీరుగారిపోయి, ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారా? ఈ కారణంగానే మూడేళ్ళకే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని బీఆరెస్‌ చెబుతోందా? అనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి ఎంత మంచి పనులు చేసినా… అధికార పార్టీపై ఎంతో కొంత వ్యతిరేకత పెరుగుతూ వస్తుందనడంలో సందేహం లేదు. అయితే.. అప్పుడే కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి, పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్‌కు తిరిగి అధికారం కట్టబెట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ కారణంగానే బీఆర్ఎస్ నేతల మాటలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇది బీఆర్ఎస్ వ్యూహాత్మక రాజకీయ ప్రచారమా? కాంగ్రెస్ సర్కారు వైఫల్యమా? అనే సందిగ్ధత కూడా నెలకొందని కొందరంటున్నారు.

బీఆర్ఎస్ దాడి… కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్

రాజకీయ ఆధిపత్యంలో భాగంగా కాంగ్రెస్‌పై కేసీఆర్ విమర్శల దాడికి దిగారనే అభిప్రాయం ఒక వైపు ఉండగా… రాష్ట్రంలో కాంగ్రెస్ తీరు కూడా కేసీఆర్ విమర్శలకు ఎంతో కొంత ఊతస్తున్నదనే అనే వాదన కూడా వినిపిస్తున్నది. కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీ ఇచ్చిన వంద రోజులు, ఆరు గ్యారెంటీలే అస్త్రాలుగా సీఎం రేవంత్ రెడ్డిని బీఆరెస్‌ టార్గెట్‌ చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఇప్పటి వరకు సాఫీగా సాగిందిలేదు. చివరికి సీఎం సొంత నియోజకవర్గం కోడంగల్‌లో చేపట్టిన పారిశ్రామిక కారిడార్, మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్‌ సిటీ… అన్నింటా అవినీతి జరిగిదంటూ బీఆరెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి రాజకీయ పరిస్థితిని వేడెక్కిస్తున్నాయి. వీటిని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ అట్టర్ ఫ్లాప్‌ అయ్యారంటే అతిశయోక్తికాదు. రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని, పార్టీని వేరు చేస్తూ బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయ దాడి ఉచ్చులో ఆ పార్టీలోని ముఖ్యనేతలు మౌనం వహిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ కారణంగానే బీఆర్ఎస్ నిత్యం చేస్తున్న విమర్శలను ప్రజలు విశ్వసించే అవకాశం ఎంతోకొంత లేకపోలేదంటున్నారు. పైగా ఇచ్చిన హామీలన్నీంటినీ అమలు చేసే ఆర్థిక శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు మౌనం వహిస్తున్నారు. అయితే ప్రతీ కార్యక్రమంలో ఆయా మంత్రులు కమీషన్లు దండుకుంటున్నారంటూ, అవినీతికి పాల్పడ్డారంటూ వ్యక్తుల పేర్లు ప్రకటిస్తూ చేస్తున్న విమర్శలను, సోషల్ మీడియా ప్రచారాన్ని కాంగ్రెస్ పట్టించుకోవడంలేదనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో బాహాటంగానే వ్యక్తమవుతున్నది. ఇప్పుడే దీనిని సరిదిద్దుకోకపోతే.. రానున్న రోజుల్లో ఈ ప్రచారం పెరిగి పెరిగి, అసలుకే ఎసరోస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read Also |

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు..హడలిపోయిన బ్యాంకు సిబ్బంది
అమరావతి-హైదరాబాద్ బుల్లెట్ రైలు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి మొండి బాకీలు వ‌సూల‌వుతాయి..!

Latest News