Revanth Reddy | అసెంబ్లీకి రానప్పుడు.. కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు?

  • By: sr    news    Apr 30, 2025 7:54 PM IST
Revanth Reddy | అసెంబ్లీకి రానప్పుడు.. కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు?

Revanth Reddy |

విధాత: ప్రతిపక్షపాత్ర పోషించని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు తమను ప్రశ్నించే అర్హత లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌజ్ లోనే ఉంటూ ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. అధికారం, ఆదాయం ఉంటేనే పనిచేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా రూ. 65 లక్షల జీతం, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారని..మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. శ్రీ మహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే పదేళ్లు అధికారం అనుభవించి..ఇపుడు విలన్ అంటారా అని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి నిలదీశారు.

కేసీఆర్ మాటల్లో, కళ్లలో విషం కనిపిస్తోందన్నారు. తెలంగాణలో పదేళ్లు తామే అధికారంలో ఉంటాం..కేసీఆర్ పదేళ్లు ఫామ్ హౌజ్ లోనే ఉంటారు..ఆ తర్వాత ఆయన చరిత్ర అక్కడే పరిసమాప్తం అవుతుందని ధ్వజమెత్తారు. పదేళ్లు దోచుకున్న నీకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదని..ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబమేనని ఎద్దేవా చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు కేసీఆర్ వరంగల్ వెళ్లారన్నారు. ఆయన వరంగల్ వెళ్లి పాపాలు కడిగేసుకున్నానుకుంటున్నారు.. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారన్నారు. వరంగల్ సభలో నా పేరు తీసే ధైర్యం కూడా చేయలేదని చురకలేశారు. వరంగల్ బీఆర్ఎస్ సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని ఇచ్చామన్నారు.

దేని మీద చర్చ చేద్దాం కేసీఆర్? : సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్ సభలో కేసీఆర్ సంక్షేమ పథకాలు ఆగిపోయాయన్నారని…ఏ పథకాలు ఆగిపోయాయో చర్చచేద్దామా అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకంపై చర్చిద్దామా? రైతులకు రుణమాఫీపై చర్చిద్దామా? నిరుద్యోగులకు ఇచ్చిన 60 వేల ఉద్యోగాలపై చర్చిద్దామా? ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన లపై చర్చిద్దామా ? అని సవాల్ చేశారు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఇవేవి కేసీఆర్ కు కనిపించడంలేదా? అని నిలదీశారు. ఫామ్ హౌజ్ లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని విమర్శించారు. మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలన్నారు. కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేష పూరిత ప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు? అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు విజ్ఞులు.. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసన్నారు. పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తామన్నారు.

నేటి తరానికి బసవేశ్వరుడు ఒక స్ఫూర్తి

బసవేశ్వరుడు సంఘసంస్కర్త అని..నేటి తరానికి స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి కొనియాడారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా బసవేశ్వరుడు పోరాడారన్నారు. విప్లవకారుడు అంటే తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. విప్లవాత్మక మార్పు తెచ్చే ఎవరైనా విప్లవకారుడేనన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నామని, మా ప్రజాప్రతినిధులందరూ బాధ్యతతో పనిచేస్తున్నారన్నారు.